వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు అంటూ మెసేజ్‌లు వస్తున్నాయా.. అజాగ్రత్తగా ఉంటే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది..!
సైబర్ నేరాలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా యాప్‌లను ఆధారంగా చేసుకొని మోసాలు చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు, ట్రేడింగ్ పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. సోషల్ మీడియా యాప్‌ల ద్వారా లింక్స్ పంపి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
తాజాగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఇటీవల కాలంలో వర్క్ ఫ్రం హోం పేరుతో (work from home job scams) మభ్యపెట్టి ఇద్దరు మహిళల నుంచి రూ.48,000 మరియు రూ.52,000 దోచుకున్నారు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగించుకున్నారు.

ఇన్‌స్టాలో నకిలీ యాడ్‌లతో ఇద్దరి మహిళలను మోసం చేశారు. దీంతోపాటు నకిలీ అమెజాన్ యాప్‌తో మరొకరి నుంచి రూ.4.9 లక్షల దోచుకున్నారు. అయితే ఈ తరహా సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు.. ఈ తరహా ఘటనలతో సంబంధం ఉన్న 2 మిలియన్ అకౌంట్‌లను బ్లా్‌క్ చేసింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న అకౌంట్లను ఎక్కువగా UAE, పిలిప్పెన్స్, కంబోడియా, మయన్మా్ర్ వంటి దేశాల కేంద్రంగా వినియోగిస్తున్నారు.
అయితే ఈ తరహా ఘటనలపై పోలీసులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ నుంచి నగదు డిమాండ్ చేస్తూ మరియు గిఫ్ట్‌లు ఇస్తామంటూ ఇతర మార్గాల్లో సంప్రదిస్తున్న వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా మెసెజ్‌లు వచ్చినప్పుడు.. ఆ మెయిల్ ఐడీల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.
అనుమానాస్పదంగా అనిపించిన మెయిల్ లేదా SMS లలో వచ్చే లింక్స్‌ను క్లిక్ చేయవద్దు. వాటిలో వచ్చే అటాచ్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేసే ప్రయత్నం చేయవద్దు. దీంతోపాటు వాటికి ఎటువంటి స్పందన (Respond) తెలియజేయవద్దు. దీంతోపాటు మరింత భద్రత కోసం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
బ్యాంకు వివరాలు లేదా బ్యాంకు కార్డులకు సంబంధించిన నంబర్లు, పాస్‌వర్డ్‌లు చెప్పాలంటూ వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దు. బ్యాంకు లేదా సంబంధిత అధికారులు పిన్, పాస్‌వర్డ్ లేదా ఇతర సున్నితమైన సమాచారం కావాలని ఎప్పుడు కాల్స్ లేదా మెసేజ్‌లు చేయరని గుర్తుంచుకోవాలి.
కొన్ని రోజుల క్రితం డిజిటల్ అరెస్ట్‌లపై ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో ప్రత్యేకంగా సూచనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఈ నేరాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని.. ప్రభుత్వ అధికారులెవరూ డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధింపులకు పాల్పడరని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.
డిజిటల్ అరెస్ట్ అంటూ వస్తున్న కాల్స్ పట్ల 'ఆగండి.. ఆలోచించండి.. ఆపై స్పందించండి' అంటూ సూచనలు చేశారు. ఇలాంటి సమయాల్లో నేరగాళ్ల ఫోన్ కాల్ రికార్డు చేయడం మరియు వాళ్ల ఫోటోలను క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టాల్లోనే లేదని.. ప్రజలను మోసం చేసే ఎత్తుగడని ప్రధాని స్పష్టం చేశారు.
సైబర్ ఘటనలపై సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే ప్రధాన వ్యాఖ్యల అనంతరం కేంద్ర హోం శాఖ కీలక వివరాలను వెల్లడించింది. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ఆధారంగా జనవరి 2024 నుంచి ఏప్రిల్ 30 వరకు సైబర్ నేరాలపై 7.4 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications








