రూ. 500 చెల్లిస్తే ప్రముఖుల ఆధార్ వివరాలు మీ చేతికి, వంద కోట్ల అకౌంట్లు లీక్ !
ఆధార్ ఇప్పుడు దేశంలోని అన్ని కార్యాకలాపాలకు గుర్తుగా వాడుతున్న విషయం తెలిసిందే.
ఆధార్ ఇప్పుడు దేశంలోని అన్ని కార్యాకలాపాలకు గుర్తుగా వాడుతున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డు నుంచి బ్యాంకు అకౌంట్ దాకా అన్నింటికి ఈ ఆధార్ అనుసంధానం అనేది తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఈ డేటా అక్రమార్కుల చేతుల్లోకి వెళిందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. 1 బిలియన్ అకౌంట్లకి సంబంధించిన సమాచారం వారి దగ్గర ఉందని ఓ పత్రిక స్టింగ్ ఆపరేషన్లో తేలింది.

ద ట్రిబ్యూన్ స్టింగ్ ఆపరేషన్..
ప్రముఖ పత్రిక ద ట్రిబ్యూన్ స్టింగ్ ఆపరేషన్ లో ఆధార్ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందనే నిజాలు వెలుగులు చూస్తున్నాయి. దాదాపు 1 బిలియన్ అకౌంట్లు వారి దగ్గర ఉన్నట్లుగా ఈ పత్రిక చెబుతోంది.

రూ.500కే వాట్సప్ ద్వారా..
కేవలం రూ.500కే వాట్సప్ ద్వారా ఎవరి ఆధార్ వివరాలైనా తేలిగ్గా పొందే అవకాశం ఉందని ఈ సంస్థ పేర్కొంది. కొన్ని వాట్సప్ గ్రూపులతో ఈ రాకెట్ ఆరు నెలల క్రితమే మొదలైందని బయటపెట్టింది.

పది నిమిషాల్లోనే లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్..
ద ట్రిబ్యూన్ కు చెందిన రిపోర్టర్లు స్వయంగా ఈ అనుభవాన్ని చవి చూశారు. వాట్సప్ ద్వారా ఈ వివరాలు అందించే వ్యక్తిని పరిచయం చేసుకున్న రిపోర్టర్.. అతనికి పేటీఎం ద్వారా రూ.500 చెల్లించాడు. పది నిమిషాల్లోనే లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఆ రిపోర్టర్‌కు వచ్చేశాయి.

వంద కోట్ల మంది ఆధార్ వివరాలు..
ఇందులో వంద కోట్ల మంది ఆధార్ వివరాలు ఉన్నాయి. ఏ ఆధార్ నంబర్‌నైనా ఎంటర్ చేస్తే చాలు దానికి సంబంధించిన పేరు, అడ్రెస్, పిన్ కోడ్, ఫోన్, ఫొటో ఇలా అన్ని వివరాలు చూసుకోవచ్చు

మరో రూ.300 ఇవ్వగా..
మరో రూ.300 ఇవ్వగా ఆధార్ కార్డులను ప్రింట్ చేసేందుకు ఉద్దేశించిన సాఫ్ట్ వేర్ ను కూడా పంపించడం విశేషం. ఇంత సునాయాసంగా ఆధార్ వివరాలు లీక్ అవుతున్న సందర్భంలో అన్నింటినీ దానికి ముడిపెట్టడం మరింత ఆందోళన కలిగిస్తున్నది.

వార్తలను ఖండించిన యూఐడీఏఐ
ఈ విషయం యూఐడీఏఐ చండీగఢ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇది జాతీయ భద్రతా ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఈ వార్తలను ఖండిస్తూ...ఆధార్ వివరాలు పూర్తి భద్రంగా ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టంచేసింది.


Click it and Unblock the Notifications








