షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ.23 లక్షలు కొట్టేశారు.. పోలీసులు ఏం చేశారంటే?
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ నేరాలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. అనేక మంది ప్రజలను ఆశపెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలపై పోలీసులు సహా ఇతర సంబంధిత వర్గాలు ఎంత అప్రమత్తం చేసినా.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో లక్షల రూపాయలు కోల్పోతున్నారు.
తాజాగా ఇటువంటి ఘటన ఢిల్లీలో జరిగింది. ఓ మహిళ ఏకంగా 23.5 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఢిల్లీకి చెందిన 32 సంవత్సరాల మహిళ.. సోషల్ మీడియాలో కొన్ని స్టాక్ మార్కెట్‌కు (Share Market Scam) సంబంధించిన వెబ్‌సైట్ గురించి తెలుసుకుంది. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ఆ వెబ్‌సైట్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేసింది.

ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు.. షేర్ మార్కెట్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని ఆమెను నమ్మించారు. వారి మాటలు నమ్మిన సదరు మహిళ.. తొలుత రూ.1000 పెట్టుబడిగా పెట్టింది. దాని ద్వారా ఆమెకు రూ.1300 తిరిగివచ్చాయి. అలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు.
వరుసగా లాభాలు వస్తుండడంతో మొత్తంగా రూ.23.5 లక్షలు పెట్టుబడి పెట్టింది. అనంతరం ఆమెకు ఎటువంటి డబ్బు తిరిగి రాలేదు. దీంతో ఆమె నేరగాళ్లను సంప్రదించేందుకు ప్రయత్నం చేశారు. నేరగాళ్లు ఆమెకు అందుబాటులోకి రాలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన మహిళ.. ఏప్రిల్ 10న ఢిల్లీలోని నార్త్‌ఈస్ట్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు మహమ్మద్ దౌద్‌గా గుర్తించారు. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో నిందితుడిని గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.8.55 లక్షలు రికవరీ చేశారు. దీంతోపాటు ఒక ఫోన్, 17 సిమ్ కార్డులు, 11 బ్యాంకు ATM కార్డులు, 15 చెక్‌బుక్‌లు, రెండు స్టాంపులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
దీంతోపాటు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం నగదును 11 వేర్వేరు బ్యాంకులకు బదిలీ చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దౌద్ మరో వ్యక్తితో కలిగి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.
** నేవీ ముంబైలో ఓ మహిళను పార్ట్‌టైం జాబ్ పేరుతో మోసం చేశారు. నేవీ ముంబై సైబర్ పోలీసుల కథనం ప్రకారం.. 37 సంవత్సరాల మహిళ ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉంది. అయితే అదనపు ఆదాయం కోసం ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఓ వ్యక్తి ఆమెకు పార్ట్‌టైం ఉద్యోగం ఇచ్చారు.
సంస్థలు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇవ్వాలని సూచించారు. ఇలా అధికంగా డబ్బు సంపాదించవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించి కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. దీంతో ఆమె తన పని ప్రారంభించింది. అనంతరం తమతో పెట్టుబడులు పెట్టాలని.. అధికంగా సంపాదించవచ్చని సూచించారు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన సదరు మహిళ.. విడతల వారీగా నేరగాళ్ల ఖాతాకు ఏకంగా రూ.54,30,000 బదిలీ చేసింది.
ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య కాలంలో ఈ నగదును నేరగాళ్ల బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేసింది. అయితే నేరగాళ్లు ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేసిన మహిళ.. తన డబ్బును వెనక్కి తీసుకొనేందుకు ప్రయత్నం చేసింది. దీంతో ఆమె కాల్స్ సహా మెసెజ్‌లకు స్పందించడం నేరగాళ్లు ఆపేశారు. దీంతో మోసపోయానని గుర్తించిన మహిళ నేవీ ముంబైలోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Click it and Unblock the Notifications








