CNAP : తెలియని ఫోన్ నంబర్‌ల నుంచి కాల్స్ వచ్చినా వారి పేర్లు తెలిసిపోతాయి..!
కొత్త నంబర్‌ల నుంచి ఫోన్‌లు లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు వారి వివరాలు తెలుసుకొనేందుకు ట్రూకాలర్, భారత్ కాలర్ ఐడీ. యాంటీ స్పామ్ వంటి థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగిస్తున్నాం. ఇక నుంచి అటువంటి యాప్‌ల అవసరం ఉండకపోవచ్చు. కేంద్ర టెలికాం శాఖ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. దీంతో ఎవరు మీకు ఫోన్ చేస్తున్నారో తెలిసిపోనుంది.
టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) తాజాగా BSNL, జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కీలక ఆదేశాలు జారీచేసింది. కాలర్ ఐడీ నేమ్ ప్రజంటేషన్ (CNAP) సర్వీసులను వెంటనే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. గత సంవత్సరమే ఈ సర్వీసులపై టెలికాం సంస్థలకు టెలికాం శాఖ సూచనలు చేసింది. అప్పటి నుంచి టెస్టింగ్ దశలో ఉంది.

ఈ సర్వీసులను వెంటనే అమల్లోకి తీసుకురావాలని టెల్కోలకు DoT సూచించింది. CNAP సర్వీసులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మోసపూరిత కాల్స్‌ను కట్టడి చేసే అవకాశం ఉంది. ఫలితంగా సైబర్ నేరాల బారిన పడకుండా తప్పించుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ సర్వీసులు ఎలా పనిచేస్తాయి.
ప్రస్తుతం తెలియని నంబర్‌ల నుంచి కాల్స్, మెసెజ్‌లు వచ్చినప్పుడు వారి వివరాలు తెలుసుకొనేందుకు థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగిస్తున్నారు. ట్రూకాలర్, భారత్ కాలర్ ఐడీ. యాంటీ స్పామ్ వంటి యాప్స్‌లు క్లౌడ్ సోర్స్ డేటా ఆధారంగా వివరాలను అందిస్తాయి. అందువల్ల కచ్చితమైన వివరాలు తెలిసే అవకాశం లేదు. అయితే CNAP సర్వీసు ద్వారా మాత్రం సిమ్ కార్డు కొనుగోలు చేసినప్పుడు సమర్పించిన గుర్తింపు కార్డులోని పేరు డిస్‌ప్లే కానుంది.
CNAP సర్వీసుల ద్వారా కొత్త నంబర్‌లతో కాల్స్ వచ్చినప్పుడు వారి నంబర్‌తోపాటు పేరు కూడా డిస్‌ప్లే కానుంది. ఫలితంగా మార్కెటింగ్ కాల్స్, నకిలీ కాల్స్‌ను కట్టడి చేసే అవకాశం ఉంటుందని టెలికాం మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కొత్త ఫోన్ నంబర్‌లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ CNAP సర్వీసుల ప్రారంభం మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.
2022 సంవత్సరంలోనే CNAP సర్వీసులపై టెలికాం రెగ్యూలేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. టెలికాం శాఖకు సిఫార్సులు చేసింది. ట్రాయ్ ప్రతిపాదనలపై అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనంతరం టెల్కోలకు మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఈ కొత్త వ్యవస్థపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవసీకి భంగం కలుగుతుందని చెబుతున్నారు.
దీంతోపాటు ఇప్పటి నుంచి కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసేందుకు బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు టెలికాం మంత్రిత్వ శాఖకు ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. నకిలీ సిమ్ కార్డులతో మోసాలకు పాల్పడేవారిని కట్టడి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సిమ్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలకు నియంత్రించేందుకు గతంలోనే కొత్త సిమ్ కార్డుల కొనుగోళ్లపై టెలికాం శాఖ పరిమితి విధించింది. దీని ఆధారంగా ఆధార్ కార్డుతో గరిష్ఠంగా 9 సిమ్ కార్డులను తీసుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకొనేందుకు Sancharsaathi వెబ్‌సైట్‌ను సందర్శించాలి.


Click it and Unblock the Notifications








