ఈ నంబర్‌ల నుంచి మీకు ఫోన్‌లు వస్తున్నాయా.. అయితే వెంటనే ఏం చేయాలో తెలుసా?
సైబర్ నేరాలు భారత్ లో రోజురోజుకు పెరుగుతున్నాయి. అనేక మంది బాధితులు లక్షల రూపాయలు కోల్పోతున్నాయి. కొత్త మార్గాల్లో, టెక్నాలజీని ఉపయోగించుకొని.. సైబర్ నేరగాళ్లు మోసాలకు (Cyber Crimes) పాల్పడుతున్నారు. ఇటీవల కాలం లో డిజిటల్ అరెస్ట్ పేరు తో అనేక మందిని భయపెట్టి.. లక్షల రూపాలను దోచుకున్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నవారు ఎక్కువగా విదేశాల నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.
సైబర్ నేరాలపై 7.4 లక్షల ఫిర్యాదులు :
గతంలో ప్రధాని మోడీ డిజిటల్ అరెస్ట్ ల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) కీలక వివరాలను వెల్లడించింది. ఈ పోర్టల్ ఆధారంగా ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు సైబర్ నేరాలపై 7.4 లక్షలకు పైగా ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది.

ఆ దేశాల కేంద్రంగానే నేరాలు :
రొమాన్స్ స్కామ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ లపై ఎక్కువగా ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. ఈ తరహా నేరాలు ఎక్కువగా మయన్మార్, కంబోడియా, లావోస్ దేశాల కేంద్రంగా జరుగుతున్నాయని తెలిపింది. 2023 సంవత్సరంలో సైబర్ నేరాలపై 15.56 లక్షలు, 2022 లో 9.66 లక్షలు, 2021 లో 4.52 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు NCRP వెల్లడించింది.
సంచార్ సాతీ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు :
తాజాగా టెలికాం మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. +77, +89, +85, +86, +84 కోడ్ లతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ తరహా కాల్స్ పై సంచార్ సాతీ వెబ్‌సైట్ లో sancharsaathi.gov.in వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించింది.
ఇటీవల పోలీస్ అధికారి తరహాలో ఓ విద్యార్థికి ఫోన్ కాల్ వచ్చింది. సదరు విద్యార్థి ఫోన్ నంబర్ పై ఫిర్యాదులు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతోపాటు పోలీసుల నుంచి సర్టిఫికేట్ ను తీసుకు రావాలని లేకుంటే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో విద్యార్థి తన బ్యాంకు వివరాలను.. నేరగాళ్ల కు షేర్ చేశాడు. ఈ ఘటనలో సదరు విద్యార్థి రూ.7.29 లక్షల పోగొట్టుకున్నారు.
తొలి 10 నెలల్లోనే భారీగా దోపిడి :
కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ సంవత్సరం తొలి 10 నెలల్లోనే ప్రజలు సుమారు రూ.2,140 కోట్లు కోల్పోయినట్లు తెలిపింది. ఈ తరహా ఘటనల్లో SBI, ED, RBI వంటి సంస్థలతోపాటు పోలీసుల పేరుతో కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. మభ్యపెట్టి, బెదిరింపులకు పాల్పడి లక్షల రూపాయలను దోచుకుంటున్నారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.120.3 కోట్లు దోపిడి :
నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ గతంలో వెల్లడించిన వివరాల ఆధారంగా డిజిటల్ అరెస్ట్ రూ.120.3 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు రూ.222.58 కోట్లు, రొమాన్స్ / డేటింగ్ కేసుల్లో రూ.13.23 కోట్లు, ట్రేడింగ్ స్కామ్ లలో రూ.1420.48 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








