7.81 లక్షల సిమ్ కార్డులు, 83,668 వాట్సాప్ అకౌంట్స్, 3962 స్కైప్ ఖాతాలు బ్లాక్.. ఎందుకంటే..?
భారత్‌లో సైబర్ నేరాలు రోజూ ఎక్కడో చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అవగాహన లేకపోవడం, అత్యాశ కారణంగా అనేక మంది నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇప్పటికే ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో (Digital frauds) మోసాలు ఎక్కువయ్యాయి. అనేక మంది బాధితులుగా మారుతున్నారు.
ఏకంగా గతంలో ప్రధాని మోడీ డిజిటల్ అరెస్ట్ పై తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రభుత్వాల స్థాయిలో తీసుకుంటున్న చర్యలను కూడా వెల్లడించారు. దీంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేశారు. ప్రజలు ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేయాలని సూచించారు.

మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం తర్వాత కేంద్ర హోం శాఖ కూడా డిజిటల్ అరెస్ట్‌లతోపాటు ఇతర సైబర్ నేరాలపై వచ్చిన ఫిర్యాదులతోపాటు తీసుకున్న చర్యలపై ప్రకటన చేసింది. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్‌లో ఈ డిజిటల్ మోసాలపై కీలక ప్రకటన చేశారు.
నకిలీ డాక్యుమెంట్స్‌తో సిమ్ కార్డులు పొంది, సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి సిమ్ కార్డులు బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసినట్లు తెలిపారు. డిజటల్ అరెస్ట్‌ల కోసం వినియోగించే 83,668 వాట్సాప్ అకౌంట్స్, 3962 స్కైప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపారు.
నిబంధనలకు విరుద్దంగా పొందిన డివైజ్‌లను దుర్వినియోగం చేయకుండా ఉండేలా 2,08,469 IMEI నంబర్‌లను కూడా బ్లాక్ చేసినట్లు బండి సంజయ్ చెప్పారు. ఇప్పటి వరకు 13.36 లక్షల ఫిర్యాదులు అందినట్లు చెప్పిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్.. దీని ద్వారా సుమారు రూ.4386 కోట్లు కాపాడినట్లు తెలిపారు.
డిజిటల్ మోసాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రియల్‌టైమ్‌లోనే అనుమానాస్పద చర్యలను గుర్తించేందుకు వీలుగా వీటిని ఉపయోగిస్తారని తెలుస్తోంది.
అయితే సైబర్ నేరాలతోపాటు స్పామ్ నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర కమ్యూనికేషన్‌ల శాఖ (DoT), వాట్సా్ప్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి. వాట్సాప్ నెట్‌వర్క్ ద్వారా ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనుంది. ఇటీవలే మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కప్లాన్, కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా భేటీ అయ్యారు.
DoT, వాట్సాప్ ఒప్పందంలో భాగంగా ఆన్‌లైన్ నేరాలు, స్పామ్ పై వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నాయి. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల కోసం టెలికాం వనరులను దుర్వినియోగంపై ముందస్తు చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా DoT డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్‌ఫాంలు అందించిన సమాచారాన్ని వాట్సాప్ వినియోగించుకుంటుంది.
దీంతోపాటు టెలికాం శాఖ అధికారులు, సంచార్ మిత్రా, టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లు, ఫీల్డ్ యూనిట్స్ కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. స్పామ్ కాల్స్, నేరాలు, దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌లపై ఫిర్యాదులు సహా ఇతర ఫిర్యాదుల స్వీకరణ కోసం తీసుకొచ్చిన సంచార్ సాథీ వెబ్‌సైట్, యాప్ మరింత మందికి చేరేలా వాట్సాప్ చర్యలు తీసుకోనుంది.
సంచార్ సాథీ ద్వారా ఆన్‌లైన్ స్కామ్, స్పామ్ పై ఫిర్యాదు చేయడం సహా ఇతర సమాచారం కోసం వాట్సాప్ విస్తృత ప్రచారం చేస్తుంది. ఈ సమాచారం హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ వంటి భాషల్లో ఈ వివరాలు అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








