బెంగళూరు టెకీని నిండా ముంచిన సైబర్ నేరగాళ్లు.. రూ.11 కోట్లు ఎంత తెలివిగా కొట్టేశారో తెలుసా?
ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్లు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. కానీ పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకోలేకపోతున్నారు. ఇటీవల బెంగళూరు నార్త్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక భారీ సైబర్ మోసానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల కరణ్, ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల తరుణ్ నటానిలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
అంతకుముందు, ఇదే కేసులో గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల బులియన్ వ్యాపారి ధావల్ భాయ్ షాను అరెస్టు చేశారు. ఈ మోసంలో బాధితుడు విజయ్ కుమార్ కె.ఎస్. అనే 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. స్టాక్ ట్రేడింగ్‌లో తన ప్రారంభ పెట్టుబడి రూ.50 లక్షలను పదేళ్లలో ఏకంగా రూ. 11 కోట్లకు పెంచుకున్నాడు. కానీ, ఒక నెల వ్యవధిలోనే "డిజిటల్ అరెస్ట్" అని పిలిచే ఒక పక్కా సైబర్ స్కామ్ ద్వారా ఆ మొత్తాన్ని పూర్తిగా కోల్పోయాడు.

* మోసం మొదలైందిలా..
2024, నవంబర్ 11న, విజయ్ కుమార్‌కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అధికారిగా చెప్పుకునే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఆ కాలర్, విజయ్ డాక్యుమెంట్స్ ఉపయోగించి చట్టవిరుద్ధమైన ప్రకటనలు, సందేశాలు పంపారని, దీనివల్ల ముంబైలో అతనిపై పోలీస్ కేసులు నమోదయ్యాయని అబద్ధాలు చెప్పాడు. అంతే విజయ్‌కు గుండెలు అదిరిపోయాయి.
ఆ తర్వాత ఒక నకిలీ "పోలీస్ అధికారి" విజయ్‌తో మాట్లాడుతూ, నరేష్ గోయల్ అనే వ్యక్తి అతని ఐడెంటిటీని ఉపయోగించి రూ. 6 కోట్లు లాండరింగ్ చేశాడని చెప్పాడు. అతన్ని అరెస్టు చేస్తామని, అతని కుటుంబ సభ్యులు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడతారని బెదిరించారు. దీని నుంచి తప్పించుకోవడానికి, విజయ్‌ను ఒక నెల వ్యవధిలో గుజరాత్‌కు చెందిన బులియన్ వ్యాపారికి రూ.11.83 కోట్లు బదిలీ చేయమని బలవంతం చేశారు.
మోసగాళ్లు విజయ్‌ను భయభ్రాంతులకు గురి చేయడానికి అన్ని హద్దులు దాటారు. వారు అతన్ని ఒక వర్చువల్ ప్లాట్‌ఫామ్‌పై విచారించారు. మోసం నిజమని నమ్మించడానికి ఒక ఫేక్ సుప్రీం కోర్టు విచారణను కూడా నిర్వహించారు. వాళ్ల దెబ్బకి విజయ్ ఎంతలా భయపడ్డాడో మనం ఊహించుకోవచ్చు. ఆ భయంతోనే అతను వారు చెప్పినట్లే కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు.
* పోలీసులు కేసును ఛేదించిన తీరిది..
2024, డిసెంబర్ 12న, విజయ్ తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తులో రూ.7.5 కోట్లు ధావల్ భాయ్ షా ఖాతాకు బదిలీ అయినట్లు తేలింది. ఆ డబ్బు బంగారం కొనుగోలు కోసం అని షా చెప్పాడు. బంగారాన్ని మోసగాళ్ల అనుచరులకు అందజేసినట్లు తెలిపాడు.
పోలీసులు ఈ మోసంలో ఫేక్ సిమ్ కార్డులు ఉపయోగించినట్లు గుర్తించారు. ఒక సిమ్ కార్డు గుజరాత్‌లో యాక్టివేట్ అయింది, కానీ భారతదేశంలో ఉపయోగించలేదు. మరింత దర్యాప్తు కరణ్‌కు దారితీసింది. కరణ్ దుబాయ్‌కు సిమ్ కార్డులు పంపుతున్నట్లు గుర్తించారు. కరణ్ ఈ సిమ్ కార్డులను ఢిల్లీలో మొబైల్ షాపు యజమాని అయిన తరుణ్ నటాని నుంచి సేకరించాడు. ఈ తీగ లాగితే డొంక కదిలినట్టు అయ్యింది.
ఈ ఆపరేషన్‌కు దుబాయ్‌లో ఉన్న నీల్ భాయ్ అనే వ్యక్తి సూత్రధారి అని నిందితులు వెల్లడించారు. దొంగిలించిన డబ్బును బంగారంగా మార్చి, భారతదేశంలో విక్రయించి, ఆ వచ్చిన డబ్బును హవాలా మార్గాల ద్వారా దుబాయ్‌కు పంపారు. ఈ దొంగల తెలివైన ప్లాన్‌కు పోలీసులు సైతం అవాక్కయ్యారు.
* రికవరీ ప్రయత్నాలు
పోలీసులు రూ.3.75 కోట్లు ఉన్న ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అయితే, చాలా డబ్బు ఇప్పటికే హవాలా వ్యాపారం ద్వారా తరలించబడి ఉంటుందని వారు భావిస్తున్నారు. మిగిలిన నిధులను గుర్తించడానికి, అసలైన సూత్రధారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఇటీవల కాలంలో బాగా ఎక్కువవుతున్నాయి. దీని పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండటం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








