కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు కొనుగోలు చేయాలో తెలుసా..? ఈ రెండు అంశాలే డిసైడ్ చేస్తాయి..!
స్మార్ట్‌ఫోన్‌లను కొంత మంది యూజర్లు ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటారు. మరి కొంత మంది ఒకే స్మార్ట్‌ఫోన్‌ను ఏళ్ల తరబడి వినియోగిస్తుంటారు. అయితే అసలు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను (New Smartphone) కచ్చితంగా ఎప్పుడు కొనుగోలు చేయాలి అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా ఎదురైందా..?. ఫోన్ బాగానే పనిచేస్తోంది.. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా ఉంది. ఇప్పట్లో కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కొంతమంది భావిస్తుంటారు. కొత్త ఫోన్ కొనుగోలు చేయాలా వద్దా.. అని నిర్ణయం తీసుకొనేందుకు పైన తెలిపినవి ముఖ్యమైన కారణాలు కావు.
స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేసిన సమయంలో ఆ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు వివరాలను తయారీ సంస్థలు వెల్లడిస్తుంటాయి. ఆ ఫోన్ డిజైన్ సహా ప్రత్యేక ఫీచర్‌ల గురించి హైలెట్ చేస్తూ చెబుతుంటాయి. వీటితోపాటు చిప్‌సెట్, OS వివరాలను విడుదల చేసే సమయంలో మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రకటనను గమనించారా..?

వీటిని సరిగా గమనించరు :
కొత్త స్మార్ట్‌ఫోన్‌ల విడుదల సమయంలో చిప్‌సెట్, OS వివరాలతోపాటు ఆ హ్యాండ్‌సెట్ ఎన్ని సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందో ఆయా సంస్థలు వెల్లడిస్తుంటాయి. అయితే సరైన అవగాహన లేని కొంత మంది యూజర్లు ఈ అప్‌డేట్‌ల వివరాలను సరిగా గమనించరు.
ఇవే డిసైడ్ చేస్తాయి :
అయితే ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను ఎన్ని సంవత్సరాలపాటు వినియోగించాలో ఈ OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లు డిసైడ్ చేస్తాయి. మీరు చదివింది నిజమే. కొత్త ఫీచర్‌లతో సురక్షితంగా స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించాలంటే ఈ అప్‌డేట్‌లు ఎంతో ముఖ్యం, అయితే ఇటీవల విడుదల అవుతున్న అనేక స్మార్ట్‌ఫోన్ ఎక్కువ సంవత్సరాలపాటు అప్‌డేట్‌లను పొందుతున్నాయి.
7 సంవత్సరాల వరకు :
ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొన్ని శాంసంగ్, గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్లు.. ఏకంగా 7 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకోనున్నాయి. దీంతోపాటు వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు కూడా ఎక్కువ సంవత్సరాలపాటు అప్‌డేట్‌లను పొందనున్నాయి. ఇలా చాలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఎక్కువ సంవత్సరాలపాటు అప్‌డేట్స్‌ను అందిస్తున్నాయి.
OS అప్‌డేట్‌లు :
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు సుమారుగా సంవత్సరానికి ఒకసారి OS అప్‌డేట్‌లను అందిస్తున్నాయి. ఈ సంవత్సరం అందుబాటులోకి వస్తున్న హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 15 OS ను కలిగి ఉంటున్నాయి. అయితే ఈ OS అప్‌డేట్‌ల వల్ల కొత్త ఇంటర్‌ఫేస్ సహా కొత్త ఫీచర్‌లు అందుబాటులోకి వస్తాయి.
గూగుల్ విడుదల చేసే OS అప్‌డేట్‌లలో కొన్ని మార్పులు చేసి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు వినియోగించుకుంటున్నాయి. అయితే కొన్ని యాప్స్ లేటెస్ట్ OS వెర్షన్‌లను మాత్రమే సపోర్టు చేస్తున్నాయి. ఉదాహరణకు వాట్సాప్ ప్రతి సంవత్సరం పాత ఆండ్రాయిడ్ OS వెర్షన్‌లకు తన సపోర్టును నిలిపి వేస్తుంది. దీంతోపాటు కొన్ని బ్యాంకు సహా ఇతర సంస్థలు కూడా తమ సపోర్టును నిలిపి వేస్తున్నాయి.
సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసే సమయంలోనే ఎన్ని సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ సెక్యూరిటీ అప్‌డేట్‌లు మీకు ఎలా పనికొస్తాయి. 'స్మార్ట్‌ఫోన్ OS లేదా ఇతర యాప్స్‌లో భద్రతా లోపాలను గుర్తించాం. మీ స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి' అనే ప్రకటన ఎప్పుడైనా విన్నారా..?
ఇలాంటి సమయాల్లోనే సెక్యూరిటీ అప్‌డేట్‌లు మీ ఫోన్ సురక్షితంగా ఉండేలా చూస్తాయి. ఇటువంటి అప్‌డేట్‌లు కొన్నిసార్లు నెలవారీగా మరి కొన్నిసార్లు అవసరాలకు తగినట్లు సంస్థలు విడుదల చేస్తుంటాయి. సైబర్ మోసగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేయకుండా ఈ సెక్యూరిటీ అప్‌డేట్లు కాపాడతాయి.
ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు నిలిచిపోయిన తర్వాత సుమారు ఒకటి రెండు సంవత్సరాల పాటు ఈ సెక్యూరిటీ అప్‌డేట్‌లను స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అందిస్తుంటాయి. ఇవి ఫోన్ ఎల్లప్పుడూ అప్‌డేట్‌గా మరియు సురక్షితంగా ఉండేలా చూస్తాయి. అందువల్ల మీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌డేట్స్ అందుతున్నంత కాలం వినియోగించుకోవచ్చు. ఈ అప్‌డేట్స్ నిలిచిపోయాక వీలైనంత వేగంగా మరో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








