2020లో ఐటి రంగంలో 10 మిలియన్ ఉద్యోగాలు

Posted By: Staff

2020లో ఐటి రంగంలో 10 మిలియన్ ఉద్యోగాలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 2011 ముసాయిదా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి కపిల్ సిబల్ శుక్రవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కపిల్ సిబల్ మాట్లాడుతూ 2020 కల్లా అదనంగా కోటి మంది నిపుణులైన ఉద్యోగులను తయారు చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ ఐటీ పాలసీని ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. అంతర్జాతీయ ఐటీ శక్తిగా భారత్ స్థానాన్ని మరింతగా పటిష్టం చేయడం, 2020 కల్లా ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమలో 20 వేల కోట్ల డాలర్ల (రూ.10 లక్షల కోట్లు) ఎగుమతులు, మొత్తం ఆదాయం 30 వేల కోట్ల డాలర్లు (రూ.15 లక్షల కోట్లు) సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఐటీ విధానానికి రూపొందించిందని ఆయన తెలిపారు .

ప్రస్తుతం ఎగుమతులు 5,900 కోట్ల డాలర్లు, మొత్తం రాబడులు 8,800 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. భారత ఐటీ రంగం ఆదాయంలో 80 శాతం ఎగుమతులదేనని సిబల్ వివరించారు. ఈ రంగంలో ప్రస్తుతం 25 లక్షల మంది నిపుణులైన ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. క్లౌడ్ ఆధారిత టెక్నాలజీలు, సేవలు, మొబైల్ ఆధారిత వాల్యూ యాడెడ్ సర్వీసుల విషయంలో అంతర్జాతీయంగా మరింత వాటా కొల్లగొట్టడంపైన కూడా ఈ ముసాయిదా విధానం ప్రధానంగా దృష్టి సారించింది.

ప్రజల ప్రతిస్పందన కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలి కమ్యూనికేషన్ల డిపార్ట్‌మెంట్ల వెబ్‌సైట్‌ల్లో ఈ ముసాయిదాను నెల రోజుల పాటు అందుబాటులోకి ఉంచుతున్నామని వివరించారు. ఎస్‌ఎంఈలకు ద్ర వ్య ప్రయోజనాలు కల్పించడం లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించామని పేర్కొన్నారు. డెరైక్ట్ ట్యాక్సెస్ కోడ్(డీటీసీ) అమలు కోసం వేచి చూస్తున్నామని, చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు ప్రోత్సహాకాలందించేలా ఒక ఫ్రేమ్‌వర్క్‌ని రూపొందిస్తామని సిబల్ వివరించారు. డీటీసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలకు ప్రోత్సాహాకాలివ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని కపిల్ సిబల్ చెప్పారు. పదేళ్ల ట్యాక్స్ హాలిడేని ఇచ్చే పథకం ముగిసిపోయిందని ఆయన గుర్తు చేశారు.

ఇది ఇలా ఉంటే ఐఐటీ విద్యలో నాణ్యత కొరవడుతోందని, ఇలాంటి సంస్థలను దేశవ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అభిప్రాయాలతో సిబల్ విబేధించారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయగల సత్తా మనకుందని సిబల్ వివరించారు. ఈ విద్యాసంస్థల్లో చేరేలా ప్రతి విద్యార్థికి తగినంత సత్తా, ప్రోత్సాహం ఉండేలా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ ఎన్‌ఐఐటీ యూనివర్శిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో సిబల్ మాట్లాడారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot