ఓటర్-ఆధార్ లింక్ చట్టబద్ధం.. కానీ తప్పనిసరి కాదు! సాంకేతిక అంశాలపై ఈసీ త్వరలో భేటీ..!
Linking Aadhaar with Voter ID: ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధమైంది. దీని కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిపుణులతో త్వరలోనే సాంకేతిక చర్చలు మొదలుపెట్టనుంది. ఓటర్ల గుర్తింపు ప్రక్రియను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోనున్నారు. అయితే, ఇది చట్టాల ప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.
* లింక్ చేయడం పూర్తిగా మీ ఇష్టం.. తప్పనిసరి కాదు..
ఆధార్‌ను ఓటర్ కార్డుతో లింక్ చేయడం అనేది పూర్తిగా స్వచ్ఛందమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఎవరినీ బలవంతం చేయబోమని హామీ ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆధార్ లింక్ చేసుకోవడానికి ఇష్టపడకపోతే, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించమని స్పష్టం చేసింది.

ఇంతకుముందు పార్లమెంటులో ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. 2023 ఏప్రిల్‌లో కేంద్రం మాట్లాడుతూ.. ఆధార్ లింక్‌కు ఎలాంటి లక్ష్యం లేదా గడువు తేదీని నిర్ణయించలేదని తెలిపింది. అంటే ఈ ప్రక్రియ హడావుడిగా కాకుండా, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నెమ్మదిగా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.
* చట్టం, రాజ్యాంగం ప్రకారమే అన్నీ.. పక్కా భద్రత!
ఈ ఆధార్ అనుసంధాన ప్రక్రియ రాజ్యాంగం, చట్టాల్లోని నిబంధనల ప్రకారమే జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, భారతీయ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఆధార్ కార్డు అనేది గుర్తింపును ధృవీకరించే సాధనం మాత్రమే. ఈసీ తెలిపిన ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్లు 23(4), 23(5), 23(6) ప్రకారం ఈ ప్రక్రియ ఉంటుంది.
2021లో ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం ద్వారా ఈ సెక్షన్లలో మార్పులు చేశారు. దీంతో ఓటర్ల గుర్తింపును నిర్ధారించడానికి ఎన్నికల నమోదు అధికారులు ఓటర్ల నుంచి ఆధార్ వివరాలను అడగవచ్చు. కానీ ఇది కూడా పూర్తిగా స్వచ్ఛందమే. దీనివల్ల ఎవరూ కూడా ఇబ్బందులకు గురికారు, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
* ముఖ్యమైన అధికారులతో మీటింగ్.. ఆ తర్వాతే నిర్ణయం..
ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక పెద్ద మీటింగ్ జరిగింది. కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి, న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి శాసన కార్యదర్శి, MeitY కార్యదర్శి, UIDAI CEO వంటి ముఖ్య ప్రభుత్వ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాంకేతిక సంప్రదింపులకు సంబంధించిన ప్రణాళిక గురించి ఈ మీటింగ్‌లో చర్చించారు.
* టైమ్ లైన్ ఫిక్స్ కాలేదు.. తొందరేం లేదు..
ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం కోసం ఎన్నికల సంఘం సాంకేతిక చర్చలు మొదలు పెడుతున్నా, దీనికి ఇంకా కచ్చితమైన గడువు తేదీ అంటూ ఏదీ లేదు. ఇది చట్టపరమైన భద్రతలు, సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని చాలా నెమ్మదిగా, క్రమంగా జరిగే ప్రక్రియ అని ఈసీ తెలిపింది. ఆధార్-ఓటర్ ఐడీ లింకింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు.


Click it and Unblock the Notifications








