ఆపరేషన్ థాయ్‌లాండ్, చీకటి గుహలో ఏం జరుగుతోంది
చీకటి గుహలో చిక్కిన 13 మంది కోసం ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తోంది
చీకటి గుహలో రెండు వారాలు!తినడానికి తిండిలేదు. బతికి ఉండటమే అసాధ్యం అనుకున్నారు. అయినా బతకాలనే ధైర్యం వారిని ఇంకా ఈ భూమి మీద ఉండేలా చేస్తోంది. ఆ గుహల్లోని వారు క్షేమంగా తిరిగిరావాలని ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తోంది. చావుకు తెగించి మరీ సాహసిస్తున్న ఆ పిల్లల ధైర్యానికి నిజంగా సలాం కొట్టాల్సిందే. వారిని అలా ముందుకు నడిపిస్తున్న కోచ్ కి సెల్యూట్ చేయాల్సిందే. థాయ్‌ల్యాండ్‌లో 25 ఏళ్ల వయసున్న కోచ్‌తోపాటు గుహల్లో చిక్కుకున్న 12 మంది ఫుట్‌బాల్ క్రీడాకారుల కథే ఇది. వీరిలో నలుగురు విద్యార్థులను రెస్క్యూ టీం బయటకు తీసుకువచ్చింది. మిగతా పిల్లలను తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.

12 మంది ఆటగాళ్లు, ఒక కోచ్
థాయ్‌లాండ్ లోని ఓస్కూల్లో వైల్డ్ బోర్ అనే ఫుట్‌బాల్ జట్టుకు పాతికేళ్ల ఎకపాల్ అనే సహయక కోచ్ గా చేరారు. ఈ జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉన్నారు. అంతా 11 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు పిల్లలు!

గతనెల 23న..
కాగా వీరంతా గతనెల 23న ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు. తమలో ఒకరి పుట్టిన రోజు వేడుకలను జరుపుకొనేందుకు సైకిళ్లపై అక్కడికి దగ్గర్లోని ‘థామ్‌లాంగ్' గుహల్లోకి వెళ్లారు!

అక్కడి నుంచి దారి తప్పారు
అయితే అక్కడి నుంచి దారి తప్పారు. అదే సమయంలో జోరున వర్షం మొదలైంది. వాన నీరు గుహల్లోకి చొచ్చుకొస్తోంది. ఆ నీళ్ల నుంచి తప్పించుకునేందుకు... కుర్రాళ్లంతా మరింత లోపలికి వెళ్లారు. అలా వెళుతూనే ఉన్నారు. చివరికి... గుహ ప్రవేశ మార్గం నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు వెళ్లి అక్కడ ఆగిపోయారు.

ఈనెల 3న పిల్లల ఆచూకి
పిల్లలు, కోచ్ కోసం అన్వేషణ మొదలైంది. రోజులు గడిచేకొద్దీ ఆశలు అడుగంటుతున్నాయి. చివరికి.. బ్రిటన్‌కు చెందిన నిపుణులైన డైవర్స్ రిచర్డ్ స్టాంటన్, జాన్ వోలాంథెన్... ఈనెల 3న పిల్లలను గుర్తించారు. వారికి ఆహార పదార్థాలు అందించి, ధైర్యం చెప్పారు. తోడుగా మరికొందరు డైవర్లు వచ్చారు.

నలుగురు విద్యార్థుల్నీ..
ఈ ఆపరేషన్ విజయవంతంగా సాగుతోంది. థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించేందుకు తొలిరోజు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చారు.

కోచ్‌తో పాటు మిగిలిన 8 మంది విద్యార్థుల్ని..
కోచ్‌తో పాటు మిగిలిన 8 మంది విద్యార్థుల్ని రక్షించేందుకు సోమవారం ఆపరేషన్ ప్రారంభిస్తామని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. గుహ నుంచి బయటకు వచ్చిన వీరిని సైనిక హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్పేస్‌ఎక్స్
చిన్నారుల్ని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్, బోరింగ్ కంపెనీ నిపుణుల్ని ఘటనాస్థలానికి పంపినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, స్పేస్‌ఎక్స్ అంతరిక్ష సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ తెలిపారు. పిల్లల్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన చిన్న సబ్‌మెరైన్‌ను పంపామన్నారు.

13 మంది అత్యంత నిపుణులైన విదేశీ డైవర్లు..
13 మంది అత్యంత నిపుణులైన విదేశీ డైవర్లు, ఐదుగురు థాయ్‌ల్యాండ్ డైవర్లు రంగంలోకి దిగారు! తమతోపాటు ఆక్సిజన్ సిలిండర్లు, స్కూబా సూట్‌లు తీసుకెళ్లారు. అటూ ఇటూ దారి తప్పకుండా, ఆసరాగా పట్టుకునేందుకు పనికొచ్చేలా... గుహ ముఖ ద్వారం నుంచి పిల్లలున్న చోటుదాకా బలమైన తాడును కట్టారు.

ఒక్కో డైవర్ రెండేసి చొప్పున..
ఒక్కో డైవర్ రెండేసి చొప్పున 12 లీటర్ల సామర్థ్యమున్న ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లారు. ఒకటి... తమకు. మరొకటి పిల్లాడికి! ఇద్దరు డైవర్లు ఒక్కో పిల్లాడిని చొప్పున... మొత్తం నలుగురు బాలలను బయటికి తీసుకొచ్చారు.

క్షేమంగా రావాలని కోరుకుందాం.
ఆదివారం రాత్రి చీకటి పడటంతో ‘ఆపరేషన్'కు తాత్కాలిక విరామమిచ్చారు. కోచ్, మిగిలిన పిల్లలను సోమవారం బయటికి తీసుకువస్తారు.వీరంతా క్షేమంగా రావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications








