కొత్త సంస్థను ప్రారంభించిన ఎలాన్ మస్క్.. టార్గెట్ ఫిక్స్..!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ట్విట్టర్, టెస్లా సహా మరిన్ని సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్న ఎలాన్ మస్క్.. కొత్త స్టార్టప్‌కు సంబంధించిన వెబ్ సైట్‌ను బుధవారం ప్రారంభించారు.
xAI పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన స్థార్టప్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. బుధవారం ఈ స్టార్టప్‌కు చెందిన వెబ్‌సైట్ ఆవిష్కరణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వం యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు.

xAI స్టార్ట్‌ప్‌కు ఎలాన్ మస్క్ నాయకత్వం వహించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన టీమ్‌ను కూడా మస్క్ ప్రకటించారు. ఈ బృందంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటిని ఆవిష్కరించిన ఓపెన్‌ఏఐలో పనిచేసిన ఇంజినీర్లు ఉన్నాయి. ChatGPTకు ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫాం ఏర్పాటు ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
అయితే గతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై నిర్వహించిన సమావేశంలో మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. AI అభివృద్ధి తాత్కాలిక నిలుపుదల చేయాలని, మరియు ఈ రంగంపై స్పష్టమైన నియంత్రణ ఉండాలని మస్క్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
జులై 14న ట్విట్టర్ స్పేసెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు xAI వెల్లడించింది. X కార్పొరేషన్‌తో ఈ కొత్త సంస్థ వేరుగా ఉంటుందని, కానీ ట్విట్టర్, టెస్లా సహా ఇతర సంస్థలతో కలిగి పనిచేస్తుందని xAI వెబ్‌సైట్ పేర్కొంది. ప్రస్తుతం ఈ కొత్త స్టార్టప్ తమ ఉద్యోగులను నియమించుకుంటోంది. అనుభవం కలిగిన ఇంజినీర్లు, పరిశోధకులను నియమించుకుంటున్నట్లు తెలిపింది.
xAI బృందానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విస్తృతమైన అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్‌లను కలిగి ఉందని సంస్థ తెలిపింది. వీరికి గతంలో గూగుల్‌కు చెందిన డీప్‌మైండ్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి సంస్థల్లో ఏఐ విభాగంలో పనిచేసిన అనుభవం ఉందని పేర్కొంది. టోరంటో యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసిన అనుభవం ఎగ్జిక్యూటివ్‌ల సొంతమని xAI స్టార్టప్ వెల్లడించింది.
అయితే AI అభివృద్ధిలో ఎలాన్ మస్క్ ప్రవేయం ఉంది. కానీ గతంలో జరిగిన ఓ సదస్సులో AI అభివృద్ధిపై తాత్కాలిక నిలిపివేత అవసరం అని కొందరు దిగ్గజ సంస్థల సీఈవోలు పిలుపునిచ్చారు. ఈ బృందంలో ఎలాన్ మస్క్ కూడా సభ్యుడుగా ఉన్నారు.
xAI స్టార్టప్ స్థాపించడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడం, భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేయడమే ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్న ఎలాన్ మస్క్ ఈ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడో వేచిచూడాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చాట్‌జీపీటీ ద్వారా కీలక ముందడుగు పడింది. గత సంవత్సరం చివర్లో ఓపెన్ ఏఐ స్టార్టప్ ChatGPTను ఆవిష్కరించింది. దీన్ని ఏఐ రంగంలో కీలక పరిణామంగా భావిస్తారు. అనంతరం టెక్ దిగ్గజం గూగుల్ ఈ సంవత్సరం మార్చిలో బార్డ్ పేరిట ఏఐ బోట్‌ను విడుదల చేసింది.
మే నుంచి బార్డ్ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటు పలు సంస్థలు కూడా ఏఐ రంగంలో సత్తా చాటేందుకు కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం xAI స్టార్టప్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








