ఎలాన్ మస్క్ ప్లాన్ బెడిసి కొట్టిందా.. నిప్పులు చిమ్ముకుంటూ నేలరాలుతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాలు..
Starlink satellites falling: 2025, జనవరి అంతరిక్ష చరిత్రలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా 120 స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూమి వాతావరణంలోకి దూసుకొచ్చి నిప్పులు చిమ్ముకుంటూ కాలి బూడిదయ్యాయి. ఇవి ఆకాశంలో అద్భుతమైన కాంతి పుంజంలా కనిపించాయి. ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ లెక్కల ప్రకారం.. రోజుకు దాదాపు నాలుగు నుంచి ఐదు స్టార్‌లింక్ ఉపగ్రహాలు కక్ష్య నుంచి పడిపోతున్నాయి. ఇది ఊహించని వేగంతో జరుగుతోంది, శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఇంతకీ ఏం జరుగుతోంది? స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఎందుకు ఇలా రాలిపోతున్నాయి? స్టార్‌లింక్ అనేది ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్‌ఎక్స్ రూపొందించిన ఓ వినూత్న ఇంటర్నెట్ సేవ. మారుమూల ప్రాంతాల్లో సైతం తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే దీని లక్ష్యం.

2024, జనవరి నాటికి దాదాపు 7,000 స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూమి కక్ష్యలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే పాత ఉపగ్రహాలను ఐదేళ్లకోసారి కొత్త, అత్యాధునిక మోడళ్లతో మార్చేయాలన్నది స్పేస్‌ఎక్స్ ప్లాన్. పాత ఉపగ్రహాలను రిటైర్ చేస్తున్న భాగంలోనే ఇది ఇలా జరుగుతోంది.
* ఫస్ట్ జనరేషన్ శాటిలైట్స్
స్పేస్‌ఎక్స్ తన మొదటి తరం (జెన్1) ఉపగ్రహాలను కొత్త వెర్షన్ల కోసం వదిలించుకుంటోంది. మొత్తం 4,700 జెన్1 ఉపగ్రహాల్లో 500కి పైగా వాటి జీవిత కాలాన్ని పూర్తి చేసుకున్నాయి. వీటిని భూమికి తిరిగి పంపించి వాతావరణంలో మండిపోయేలా ప్రోగ్రామ్ చేశారు. అందుకే ఈ ఉపగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి.
* ఇది ప్రమాదకరమా, భయపడాలా..
స్పేస్‌ఎక్స్ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఈ ఉపగ్రహాలు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో పూర్తిగా కరిగిపోయేలా డిజైన్ చేశారట. అంటే ఇవి అంతరిక్షంలో వ్యర్థాలను వదలవు, భూమిపై ప్రజలకు ఎలాంటి ప్రమాముండదని స్పేస్‌ఎక్స్ హామీ ఇస్తోంది. కానీ శాస్త్రవేత్తల ఆందోళన వేరే ఉంది. పర్యావరణంపై వీటి ప్రభావం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
* పర్యావరణానికి ముప్పు పొంచి ఉందా..
ఒక్కో స్టార్‌లింక్ ఉపగ్రహం కాలి బూడిదయ్యేటప్పుడు లోహపు ఆవిర్లు వాతావరణంలోకి విడుదలవుతాయట. 2023లో జరిగిన ఒక అధ్యయనంలో.. అలాస్కాపై 60,000 అడుగుల ఎత్తులో సేకరించిన ఏరోసోల్స్‌లో 10% అల్యూమినియం వంటి లోహాలు ఉపగ్రహాల నుండి వచ్చినవేనని తేలింది. ఒక్కో జెన్1 స్టార్‌లింక్ ఉపగ్రహం కాలిపోతే దాదాపు 30 కిలోల అల్యూమినియం ఆక్సైడ్ విడుదలవుతుంది.
ఈ పదార్థం ఓజోన్ పొరను దెబ్బతీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. 2016-2022 మధ్య వాతావరణంలో ఈ అల్యూమినియం ఆక్సైడ్లు ఎనిమిది రెట్లు పెరిగాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉపగ్రహాల పతనం పెరగడంతో సమస్య మరింత జటిలమవుతోంది. ఇది వాతావరణ రసాయన శాస్త్రంలో నియంత్రణ లేని ప్రయోగంగా మారుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
* విమాన ప్రయాణాలకు ముప్పు ..
స్టార్‌లింక్ మాత్రమే కాదు.. అంతరిక్ష వ్యర్థాలు కూడా భూమికి పడిపోతున్నాయి. రాకెట్ శకలాలు వంటివి రద్దీగా ఉండే విమాన మార్గాలపై పడే అవకాశం ఏటా 26% ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. విమానాన్ని ఢీకొట్టే ప్రమాదం తక్కువగా ఉన్నా.. అంతరిక్ష వ్యర్థాలు పడితే విమాన ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చు, విమానయాన సంస్థలకు అదనపు ఖర్చులు తప్పకపోవచ్చు.


Click it and Unblock the Notifications