100 శాతం వరకు PF విత్‌డ్రా.. పైనల్ సెటిల్‌మెంట్‌లోనూ కీలక మార్పులు..!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణంగా ప్రతి ఉద్యోగి నెలవారీ వేతనం నుంచి, మరియు సంస్థ తరఫున కొంత నగదు మొత్తాన్ని PF ఖాతాలో జమ అవుతుంది. ఈ నగదుపై వడ్డీని కూడా పొందవచ్చు. ఉద్యోగ విరమణ చేశాక, ఆ నగదును ఉపయోగించుకొనే వీలుంటుంది. అయితే మధ్యలో ఏదైనా అత్యవసరాల సమయాల్లోనూ కొంత మొత్తాన్ని తీసుకొనేందుకు వీలుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం :
అయితే గతంతో పోలిస్తే EPFO నిబంధనల్లో అనేక మార్పులు చేశారు. అనేక నిబంధనలను సరళతరం చేశారు. క్లైయిమ్‌లను తక్కువ సమయంలోనే పరిష్కరిస్తున్నారు. నిన్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగింది.

100 శాతం వరకు విత్‌డ్రా :
ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. PF ఉపసంహరణ పరిమితులను పెంచింది. దీంతోపాటు కొన్ని నిబంధనల్లో కీలక మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరియు ఫైనల్ సెటిల్‌మెంట్, ఫైనల్ పెన్షన్ గడువును పొడిగించారు. అర్హమైన బ్యాలెన్స్ నుంచి 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
మూడు కేటగిరీలుగా :
ఉద్యోగి తమ PF ఖాతా నుంచి పాక్షిక విత్‌డ్రా కోసం మూడు కేటగిరీలుగా విభజించింది. గృహ అవసరాలు, ముఖ్యమైన అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా విభజన చేసింది. విద్యా, అనారోగ్య పరిస్థితులను ముఖ్యమైన అవసరాలు కేటగిరీలో ఉంచింది.
గతంలో కారణాలు చూపాల్సిన పరిస్థితి :
గతంలో ప్రత్యేక పరిస్థితుల విభాగం కింద నిరుద్యోగం, సంస్థలు మూసివేత సహా ప్రకృతి విపత్తులు వంటి అనేక కారణాలు చూపాల్సిన వచ్చేది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇప్పుడు ఎటువంటి కారణాలు చూపకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా, వివాహానికి సంబంధించిన విత్‌డ్రా లిమిట్‌ను కూడా పెంచారు. PF ఖాతాలు కలిగిన ఉద్యోగులు విద్యకు సంబంధించిన అంశాల కోసం గరిష్ఠంగా 10 సార్లు నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే వివాహానికి సంబంధించి గరిష్ఠంగా 5 సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈ రెండింటిలో కేవలం 3 సార్లు విత్‌డ్రా చేసుకొనేందుకు మాత్రమే అవకాశం ఉండేది.
EPFO సభ్యులు తమ PF మొత్తంలో 25 శాతం కనీస నిల్వను కొనసాగించాల్సి ఉంటుంది. ఫైనల్ సెటిల్‌మెంట్‌ను ప్రస్తుతం 2 నెలల ముందుగా పొందడానికి అవకాశం ఉంది. దీన్ని 12 నెలలకు పెంచారు. అలాగే ఫైనల్ పెన్షన్ విత్‌డ్రా గడువు 2 నెలల నుంచి 36 నెలలకు పొడిగించారు.
PF ఖాతా నుంచి సులభంగా విత్‌డ్రా చేసుకొనేందుకు వీలుగా ATM తరహా కార్డులను తీసుకొస్తామని ఈ సంవత్సరం జూన్‌లోనే తీసుకొస్తామని తొలుత కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. అయితే అనేక కారణాలతో ఈ విధానం అమల్లోకి రాలేదు. కానీ ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిసింది. జనవరి 2026 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








