అయ్యో.. ఫ్లిప్‌కార్ట్ చెప్పిన కారణం చూసి షాక్ అయిన యూజర్లు..!
నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ రూ.79,999 ధరకు ఈ సంవత్సరం జులై నెలలో భారత్‌లో విడుదల అయింది. నథింగ్ తొలి ఫ్లాగ్‌షిప్ మోడల్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపినా, అధిక ధర కారణంగా వెనక్కి తగ్గారు. అయితే దసరా సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నిర్వహించిన సేల్‌లో ఈ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ధరకు తీసుకొస్తామని నథింగ్ తెలిపింది.
దీంతో ఈ హ్యాండ్‌సెట్ (Nothing Phone 3 Smartphone) సేల్ కోసం అనేక మంది ఎదురు చూశారు. సేల్ ప్రారంభం కాగానే ఆర్డర్ చేసుకున్నారు. డెలివరీ సమయం దగ్గరపడుతున్న సమయంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి, అంతా షాక్ అయ్యారు. ఫ్లిప్‌కార్ట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విడుదల సమయంలో ధర ఎలా ఉంది :
భారత్ మార్కెట్ లో ఈ ఫోన్ రూ.79999 కు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 లో భాగంగా రూ.59999 ఆఫర్ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 మోడల్స్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా మరింత అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది.
అయితే రూ.27 వేల ధరకే :
అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ ఏకంగా రూ.27000 ధరకు అందుబాటులోకి వచ్చింది. అది కూడా ఎటువంటి స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ఛేంజీ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం బ్యాంకు ఆఫర్ల ద్వారానే ఈ ధరను పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ అయింది. అయితే ఇక్కడే అసలు సమస్య ప్రారంభం అయింది.
ఫ్లిప్‌కార్ట్ నుంచి షాకింగ్ మెసేజ్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ ను చూసిన యూజర్లు నథింగ్ ఫోన్ 3 మోడల్‌ను ఆర్డర్ చేసుకున్నారు. ఫోన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అంతా భావించారు. కానీ షాకింగ్‌గా ఫ్లిప్‌కార్ట్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. సెల్లర్ ఈ ఫోన్ ధరను తప్పుగా చూపారని (The price of the product incorrectly listed by seller), అందువల్ల మీ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసినట్లు మెసేజ్ రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Flipkart sellers are now cancelling Nothing Phone 3 orders placed yesterday at ₹26K. Lucky are those who bought it via Flipkart Minutes and got theirs delivered last night. pic.twitter.com/bdqrAqTCsl
— Abhishek Yadav (@yabhishekhd) October 11, 2025
ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ యూజర్లకు మాత్రం డెలివరీలు :
అయితే కొంత మంది యూజర్లు మాత్రం ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసిన యూజర్లకు మాత్రం ఫోన్ డెలివరీ కావడం గమనార్హం. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా కేవలం నిమిషాలు, గంటల వ్యవధిలోనే డెలివరీ చేస్తారు కనుక ఆయా ఆర్డర్‌లను క్యాన్సిల్ చేయడం కుదరలేదు. ఇందుకు సంబంధించి ఓ యూజర్ చేసిన పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను టిప్‌స్టర్ అభిషేక్ యాదర్ షేర్ చేశారు.
ఫ్లిప్‌కార్ట్‌పై యూజర్ల ఆగ్రహం! :
సరైన కారణం లేకుండా ఆర్డర్‌లు క్యాన్సిల్ చేయడంపై ఫ్లిప్‌కార్ట్ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ లో గతంలోనూ ఇలాంటి సమస్యలు వచ్చాయని పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా సుమారుగా అలాంటి పరిస్థితే ఎదురైంది.


Click it and Unblock the Notifications








