న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ ఫైలింగ్ నుంచి ఏడాదికి రూ.5 లక్షలకన్నా తక్కువ సంపాదనా పరులను మినహాయిస్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు 85 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందనున్నారు. ఆర్థిక శాఖ అధికారి ఒకరు ఈ విషయం తెలిపారు. 2011 ఫైనాన్స్ బిల్లులో పేర్కొన్న ప్రకారం, 2011 జూన్ 1 నుంచీ కొత్త విధానం అమల్లోకి రానుంది.
ఇందుకు సంబంధించి వేతన ఉద్యోగులకు జారీచేసే ఫామ్16నే ఇక ఐటీ రిటర్న్‌గా పరిగణించడం జరుగుతుంది. కేవలం వేతనం తప్ప మరే ఆదాయం లేని ఉద్యోగులు ఫామ్ 16తో పాటు ప్రత్యేకంగా ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయడం వల్ల ‘డూప్లికేషన్’ సమస్య ఏర్పడుతోంది. దీని నివారణకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.