ఆల్ఫెబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్
టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అత్యున్నత బాధ్యతలను చేపట్టారు. గూగుల్ వ్యవస్ధాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ మాతృసంస్థ అల్ఫాబెట్ నుంచి వైదొలగడంతో ఆ కంపెనీ సీఈఓగా సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 21 సంవత్సరాల కిందట గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌ను స్ధాపించిన పేజ్, బ్రిన్‌లు కంపెనీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు.

సుదీర్ఘకాలంగా కంపెనీ రోజువారీ నిర్వహణ కార్యకలాపాల్లో తలమునకలైన తాము ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నామని, సంస్థకు తమ సలహాలు సూచనలు అందిస్తామని పేజ్, బ్రిన్‌లు బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. వెబ్ సెర్చింగ్, ఇతర టాస్క్‌లను వేగవంతం చేసేందుకు కృత్రిమ మేథ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై జరుగుతున్న కసరత్తును ఇక సుందర్ పిచాయ్ మున్ముందుకు తీసుకువెళ్లనున్నారు. మేనేజ్‌మెంట్‌లో ప్రక్షాళన నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొని లాభాలపై దృష్టిసారించేందుకు అల్ఫాబెట్‌కు ఇది మంచి అవకాశమని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.

ఒకప్పటి దిగ్గజం యాహూను పక్కకు నెట్టేసి.. ఇంటర్నెట్‌లో సెర్చికి పర్యాయపదంగా మారిన గూగుల్‌ను సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్ 1998లో ఆరంభించారు. పేజ్ తొలి సీఈవో కాగా... తర్వాత 2001 నుంచి 2011 దాకా ఎరిక్ ష్మిట్ ఆ హోదాలో కొనసాగారు. తర్వాత పేజ్ మళ్లీ కొన్నాళ్ల పాటు సీఈవోగా వచ్చారు. 2015లో హోల్డింగ్ కంపెనీగా అల్ఫాబెట్‌ను ఏర్పాటు చేసినప్పట్నుంచీ బ్రిన్, పేజ్.. గూగుల్‌లో కీలక పాత్ర పోషించడాన్ని తగ్గించుకున్నారు.

సుందర్ పిచాయ్ తమిళనాడులోని మదురైలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీరు కాగా తల్లి స్టెనోగ్రాఫర్. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేస్తూ అక్కడే తన జీవిత భాగస్వామి అంజలిని కలిశారు. తరవాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ చేశారు. ఎంబీఏ అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు.

కీలకమైన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టును విజయవంతం చేశాక కంపెనీలో ఆయన వేగంగా ఎదిగారు. 2013లో ముఖ్యమైన ఆండ్రాయిడ్ డివిజన్ ఇన్‌చార్జిగా... తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్ సీఈవో అయ్యారు. దాంతోనే పలు అల్ఫాబెట్ ప్రాజెక్టులూ ఆయన పరిధిలోకి వచ్చాయి. ఇటీవల ఉద్యోగుల నిరసనల్లాంటి వాటితో పాటు పలు వివాదాలను సమర్థంగా ఎదుర్కొన్న తీరు.. అల్ఫాబెట్ సీఈవో పీఠానికి ఆయన్ను మరింత దగ్గర చేశాయి.

గూగుల్‌కు సారథ్యం వహించడంతో పాటు ఇతర అనుబంధ సంస్థల్లో అల్ఫాబెట్ పెట్టుబడులన్నింటినీ ఆయనే చూస్తారు‘ అని పేజ్, బ్రిన్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ బోర్డు సభ్యులుగా, షేర్‌హోల్డర్లుగా, సహ-వ్యవస్థాపకులుగా గూగుల్, అల్ఫాబెట్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ‘దాదాపు 15 సంవత్సరాలుగా.. అల్ఫాబెట్ ఏర్పాటులోనూ, గూగుల్ సీఈవోగా, అల్ఫాబెట్ డైరెక్టరుగా సుందర్ పిచాయ్ మాతో కలిసి నడిచారు. అల్ఫాబెట్ భవిష్యత్తుపైన, సవాళ్లను టెక్నాలజీ సాయంతో అధిగమించేలా చేయగలిగే సంస్థ సామర్థ్యంపైనా మాకున్నంత నమ్మకం ఆయనకూ ఉంది‘ అని పేజ్, బ్రిన్ తెలిపారు.


Click it and Unblock the Notifications








