ఆన్‌లైన్‌లో ఉచిత ప్రకటనల కోసం గూగుల్‌ గ్లోబల్‌ మార్కెట్‌ ఫైండర్‌

Posted By: Staff

ఆన్‌లైన్‌లో ఉచిత ప్రకటనల కోసం గూగుల్‌ గ్లోబల్‌ మార్కెట్‌ ఫైండర్‌

అంతర్జాతీయంగా ఖాతదారులను అన్వేషించడం దేశీయ చిన్న, మధ్య తరహా ఉత్పత్తిదారులకు కష్టం. నాణ్యమైన ఉత్పత్తులున్నా దేశీయంగా మార్కెటింగ్‌కే వ్యాపార సంస్థలు పరిమితమవుతున్నాయి. తమ ఉత్పత్తులకు ఏ దేశాల్లో డిమాండ్‌ ఉంది, ఎక్కడి ఖాతాదారులను ఆకట్టుకోవచ్చో తెలియని వారే ఎక్కువ. ఆన్‌లైన్‌లో ఉచితంగా ప్రకటనలకు అవకాశం కల్పించి, చూసిన వారి సంఖ్యకు (క్లిక్‌లకు) అనుగుణంగా రుసుం వసూలు చేసే పద్ధతికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ గూగుల్‌ శ్రీకారం చుట్టింది. గూగుల్‌ ఇండియా భారత్‌ కోసమే గూగుల్‌ గ్లోబల్‌ మార్కెట్‌ ఫైండర్‌ను ఆవిష్కరించింది.

దేశంలో 80 లక్షల మేర చిన్న, మధ్య తరహా వ్యాపారసంస్థలు (ఎస్‌ఎంబీ) ఉన్నాయని అంచనా. తక్కువ ఖర్చుతో ఖాతాదారులను అన్వేషించడం, పెట్టిన ఖర్చుకు అనుగుణంగా సంపాదన, పెట్టుబడులపై సత్వర ఆర్జన (రిటర్న్‌) ఈ సంస్థల యజమానులకు ముఖ్యం. వీరికి సరికొత్త మార్కెట్లను పరిచయం చేయడమే లక్ష్యంగా గూగుల్‌ నూతన టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఉన్న ట్రాన్స్‌లేషన్‌ టూల్‌సాయంతో ప్రకటనలు 56 భాషల్లోకి తర్జుమా అవుతాయి. అవసరం ఉన్నవారు ఈ ప్రకటనలపై క్లిక్‌ చేస్తేనే, ఛార్జి పడుతుంది.

ప్రకటనలు ఇచ్చేవారికి సాయపడేందుకు గూగుల్‌ దేశంలో కాల్‌సెంటర్‌లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో జెన్‌ ప్యాక్‌, ఢిల్లీలో వి కస్టమర్‌ వీటిని నిర్వహిస్తున్నాయి. దాదాపు 200 మంది ఉద్యోగులు ఈ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కాల్‌సెంటర్‌ల సాయంతో రోజూ దాదాపు 1,000 ఎస్‌ఎంబీల నిర్వాహకులతో మాట్లాడుతున్నామని, త్వరలో రోజూ 3,000 మందితో సంప్రదింపులు జరిపేలా కాల్‌సెంటర్‌లను పెంచుతామని గూగుల్‌ ఇండియా ఆన్‌లైన్‌ సేల్స్‌ అధిపతి శ్రీధర్‌ శేషాద్రి 'న్యూస్‌టుడే'తో చెప్పారు. ప్రకటనలు, వెబ్‌ డిజైనింగ్‌ వంటి వాటికి దేశవ్యాప్తంగా తమకు 100 మందికి పైగా భాగస్వాములు ఉన్నారని ఆయన తెలిపారు. సంప్రదాయ చీరలు, పెయింటింగ్స్‌, పూల విక్రయదారులు కూడా ఆన్‌లైన్‌ ద్వారా దేశ, విదేశాల్లో కొత్త ఖాతాదారులకు చేరువ అవుతున్నారని ఆయన చెప్పారు. మొత్తం విక్రయాల్లో ఆన్‌లైన్‌ ప్రకటనల ద్వారా జరిగేవి 10-85 శాతం వరకు ఉంటున్నాయని తెలిపారు. ఈ ఏడాదిలో మార్కెట్‌ ఫైండర్‌ను మరింత విస్తృతం చేయడం లక్ష్యమని పేర్కొన్నారు.

భారత్‌లో ఆన్‌లైన్‌లో జరిగే విక్రయాల (ఇ కామర్స్‌) విలువ రూ.11 వేల కోట్లు ఉంటుందని శ్రీధర్‌ చెప్పారు. ఇందులో 70% వాటా రవాణా రంగానిదే అన్నారు. టిక్కెట్ల విక్రయం ద్వారా ఐఆర్‌సీటీసీ అతిపెద్ద ఆన్‌లైన్‌ విక్రయదారుగా ఉందని ఆయన పేర్కొన్నారు. దాదాపు పెద్ద సంస్థలన్నీ రూ.100-250 కోట్ల మేర ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ విక్రయాల్లో ప్రతి త్రైమాసికానికీ నూరుశాతం వృద్ధి లభిస్తోందని ఆయన చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot