గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్‌లపై అప్రమత్తం చేస్తుంది!
ప్రస్తుతం టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే టెక్నాలజీని ఉపయోగించి కొందరు నేరగాళ్లు వ్యక్తిగత, సున్నిత సమాచారాన్ని దొంగలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా గూగుల్ తన క్రోమ్ (Google Chrome) యూజర్ల భద్రతను మెరుగుపరిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది.
తాజాగా గూగుల్ సరికొత్త సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్ ను (Google Chrome Safe browsing) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మాల్వేర్ అటాక్ సహా సైబర్ అటాక్‌ల సమయంలో వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానుంది.

ఆన్‌లైన్ భద్రత ప్రస్తుతం పెద్ద సవాల్‌గా మారిన నేపథ్యంలో గూగుల్ తాజా ఫీచర్ వినియోగదారులకు మెరుగైన భద్రతను కల్పిస్తుంది. ఈ ఫీచర్ ప్రధానంగా ఫిష్సింగ్, మాల్వేర్ అటాక్ లపై దృష్టిపెడుతుందని తెలిపింది. వెబ్‌సైట్‌లను సందర్శించే సమయంలో అప్రమత్తం చేస్తుంది. 25 శాతం ఫిష్సింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు గూగుల్ తెలిపింది. రియల్ టైం ట్రాకింగ్ మెరుగ్గా పనిచేస్తుందని గూగుల్ భావిస్తోంది.
గూగుల్ సంస్థ తన ట్రాకింగ్ మెకానిజాన్ని రియల్‌టైం ఫంక్షన్‌తో అనుసంధానం చేసింది. ఫలితంగా మెరుగైన ఫలితాలను అందిస్తుంది. మీరు ఏదైనా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు క్యాచీ ఆధారంగా వెబ్‌సైట్ భద్రతను టెస్టింగ్ చేస్తుంది. ఆ వెబ్‌సైట్ URL ను ప్రైవసీ సర్వర్ పంపించి రియల్ టైంలోనూ భద్రతను పర్యవేక్షిస్తుంది.

అనంతరం ఆ URL తన డేటాబేస్ లో ఉంటే, ముందస్తుగా అప్రమత్తం చేస్తుంది. అయితే ఇందుకు ఎక్కువ సమయం తీసుకొనే అవకాశం లేదని తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లోనే వెబ్‌సైట్ భద్రతను గూగుల్ తనిఖీ చేస్తుందని, ఎటువంటి భద్రతా లోపాలు గుర్తించినా వెంటనే వినియోగదారులను అప్రమత్తం చేస్తుందని తెలిపింది.
* కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం గూగుల్ క్రోమ్ యూజర్లకు కీలక హెచ్చరిక చేసింది. ఈ బ్రౌజర్‌లో ఇటీవల భద్రతా లోపాలు గుర్తించినట్లు తెలిపింది. ఫలితంగా ఆయా కంప్యూటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటూ అప్రమత్తం చేసింది. మార్చి 8న విడుదల చేసిన నివేదిక ప్రకారం గూగుల్ క్రోమ్‌లో అనేక లోపాలను గుర్తించినట్లు పేర్కొంది.
దీని ద్వారా అటాకర్లు ఆయా కంప్యూటర్లపై దాడి చేసే అవకాశం ఉంది. ఈ లోపాలను ఉపయోగించి ప్రత్యేక వెబ్‌పేజీల ద్వారా సైబర్ దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని CERT కోరింది. మైక్రోసాఫ్ట్ విండోస్, Macలో గూగుల్ క్రోమ్ వెర్షన్ 122.0.6261.111/.112 ముందున్న వెర్షన్‌లు ప్రభావితం అయినట్లు పేర్కొంది.
దీంతోపాటు లినిక్స్ 122.0.6261.111 కూడా ప్రభావిత జాబితాలో ఉన్నట్లు తెలిపింది. అయితే తన బ్రౌజర్‌లో భద్రతా లోపాలను గూగుల్ గుర్తించిందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం CERT పేర్కొంది. ఈ భద్రతా లోపాలను సవరిస్తూ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications








