గూగుల్ సూపర్ ఫీచర్.. ఇక అలాంటి ఫోటోలకు చెక్ పెట్టినట్టే...!!
ఇంటర్నెట్ వినియోగదారులకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు లేదా కొందరు ప్లాన్ ప్రకారం కొన్ని ఫోటోలను వైరల్ చేస్తుంటారు. ప్రజలు కూడా అవే నిజమైన ఫోటోలు అనుకొని భ్రమపడతారు. అయితే దీనిపై గూగుల్ కీలక ప్రకటన చేసింది. ఫేక్ ఫోటోలను గుర్తించే విధంగా కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేసే "About this image" అనే ఫీచర్‌ను తీసుకొస్తామని తెలిపింది. ఈ వేసవికే ఈ టూల్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్ నకిలీ ఫోటోలు, వీడియోలను గుర్తిస్తుందని తెలిపింది. తొలుత ఈ ఫీచర్ అమెరికాలో ఇంగ్లీష్ వెర్షన్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నదానికి టెక్ దిగ్గజం గూగుల్ స్పష్టమైన ప్రకటన చేయలేదు.

ఈ టూల్ అందుబాటులోకి వస్తే.. ఇంటర్నెట్ వినియోగదారులు.. ఏమైనా ఫోటోల కోసం సెర్చ్ చేస్తుంటే.. ఆ ఫోటోలు ఏ సందర్భంలో తీసినవో తెలియజేస్తుంది. తొలుత ఆ ఫోటో ఎక్కడ కనిపించిందనే దానిపైనా స్పష్టం చేస్తుంది. ఆ సమాచారంతో మనం చూస్తున్న ఫోటోలపై ఓ స్పష్టత వస్తుంది. ఆ ఫోటోను నమ్మవచ్చా లేదా మరో ఫోటో కోసం వెతకాలా అనేది తెలుస్తోంది.
About the image ఫీచర్ అందుబాటులోకి వస్తే.. గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో వచ్చిన ఫోటోలపై ఉండే "మూడు చుక్కలు" లపై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. లేదా గూగుల్ లెన్స్ లేదా గూగుల్ యాప్స్ ద్వారా కూడా ఫోటో నిజమైనదా కాదా తెలుసుకోవచ్చు.
ఈ సంవత్సరం చివరలో ఈ ఫీచర్ అందుబాటులో వచ్చే అవకాశం ఉందని తన బ్లాగ్‌లో గూగుల్ వెల్లడించింది. అందుబాటులోకి వచ్చిన తర్వాత డెస్క్‌టాప్ లేదా మొబైల్ క్రోమ్ బ్రౌజర్‌లో ఫోటోలపై రైట్‌క్లిక్ చేయడం గానీ లేదా లాంగ్ ప్రెస్ చేయడం వల్ల గానీ ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.
దీంతో పాటు గూగుల్ మరో కీలక ప్రకటన కూడా చేసింది. జెనరేటివ్ ఇమేజ్ క్యాపబిలిటి ఫీచర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పింది. దీని ద్వారా ఏఐ ఆధారంగా రూపొందించిన ఫోటోలకు ఒరిజినల్ మార్క్ ఉంటుందని వెల్లడించింది. పబ్లిషర్లు మరియు ఇతరులు ఈ తేడాను గుర్తించవచ్చని పేర్కొంది. మీరు ఏవైనా ఫోటోల కోసం గూగుల్‌లో వెతుకుతున్నప్పుడు.. "ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించబడిన ఫోటో" అనే క్యాప్షన్ చూపిస్తుంది.
"విశ్వసనీయమైన, నాణ్యమైన, వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికే గూగుల్ సెర్చ్ రూపొందించబడింది. ఎప్పటికప్పుడు మారుతున్న వెబ్‌లో ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మేలు జరుగుతుందని గూగుల్ తన బ్లాగులో తెలిపింది.
ఉదాహరణకు About the result టూల్ అందుబాటులోకి వస్తే.. మరింత త్వరగా సమాచారం చూడగలుగుతారు. మరియు సమాచారానికి మూలం ఎక్కడో తెలుసుకోగలుగుతారు. అప్పుడు మీకో స్పష్టత వస్తుంది. అందుబాటులోకి వచ్చిన సమాచారం నమ్మదగినది కాదో లేదో తెలుస్తుంది. మార్చిలో ఐదు మార్గాలను తాము ప్రాతిపాదించామని దాని ద్వారా మీకు వచ్చిన సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చని గూగుల్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది.


Click it and Unblock the Notifications








