గూగుల్ కీలక నిర్ణయం.. 3500 యాప్‌లపై కఠిన చర్యలు
టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లేస్టోర్ పాలసీ నిబంధనలు పాటించని యాప్‌లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 2022 సంవత్సరంలో భారత్‌లో ప్లేస్టోర్ పాలసీపై సమీక్ష నిర్వహించామని.. నిబంధనలు పాటించని 3500 లోన్ యాప్‌లపై చర్యలు తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది.
సుమారు 1.43 మిలియన్ యాప్‌ల కార్యకలాపాలు సాగించకుండా నిరోదించినట్లు మరియు మోసపూరిత లావాదేవీలు జరగకుండా చూసినట్లు గూగుల్ వెల్లడించింది. దాంతోపాటు 173,000 ఖాతాలపై నిషేధం విధించినట్లు తెలిపింది. మరియు సుమారు రూ. 16,350 కోట్లు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. వీటితో పాటు గత మూడు సంవత్సరాలుగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న 5,00,000 యాప్‌లను అడ్డుకున్నట్లు గూగుల్ వెల్లడించింది.

"భారత్‌లో 2022 సంవత్సరంలో 3500 లోన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు తీసుకున్నాం, మరియు కొన్నింటిని యాప్‌స్టోర్ నుంచి తొలగించాం. ఆ యాప్‌లు పాలసీ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. మరియు తమ పాలసీలపై నిరంతం సమీక్షిస్తున్నాం. మరియు వాటిని అప్‌డేట్ చేస్తున్నాం" అని గూగుల్ వెల్లడించింది.
ఈ లోన్‌యాప్‌ల వేధింపులు కారణంగా అనేక మంది వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ లోన్ యాప్‌ల నిర్వాహకుల వేధింపులతో అనేక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీటిపై చాలా కేసులు నమోదయ్యాయి. దీనిపై గతంలోనే గూగుల్ కొన్ని చర్యలు తీసుకుంది. తన ప్రైవసీ పాలసీలో కొన్ని మార్పులు చేసి పటిష్టం చేసింది. ఇటువంటి యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రవేశించేందుకు కఠినమైన నిబంధనలు అమలుచేస్తామని చెప్పింది.
ఇటువంటి లోన్‌యాప్‌లు ఆర్‌బీఐ నుంచి అనుమతి పొందాలని, ఆ వివరాలను లోన్లు ఇచ్చే సమయంలో డిక్లరేషన్‌లో పేర్కొనాలని స్పష్టం చేసింది. బ్యాంకింగేతర సంస్థల నుంచి లోన్లు ఇస్తే ఆ ఆ విషయాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొనాలని షరతులు విధించింది.
మరియు వ్యక్తిగత రుణాలు ఇచ్చే లోన్‌యాప్‌లు వినియోగదారుల ఫోన్ లోకేషన్, ఫోటోలు, వీడియోలు, కాల్, SMS వివరాలు సేకరించకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు 2023 మే 31 నుంచి అమల్లోకి వస్తాయని గూగుల్ సంస్థ గతంలోనే స్పష్టం చేసింది.
2023 సంవత్సరంలో ప్రకటనలకు సంబంధించి మరింత ప్రైవసీ- ఫ్రెండ్లీ పాలసీని తీసుకొస్తామని టెక్ దిగ్గజం ప్రకటన చేసింది. దీంతోపాటు మరో కీలక ప్రకటన చేసింది. ప్రైవసీ శాండ్‌బాక్స్ బీటా వెర్షన్ తీసుకొస్తామని, అయితే ప్రస్తుతానికి కొద్ది శాతం మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
దీంతో వినియోగదారులు, డెవలపర్‌లు తమ సమస్యలకు కొత్త పరిష్కారాలను కనుక్కోగలుగుతారని, వాటి ఫలితాలను అనుభవిస్తారని పేర్కొంది. డెవలపర్‌లు, పబ్లిషర్లు, రెగ్యులేటర్లు మరియు మరింత మందితో భాగస్వామై ప్రైవేట్ మొబైల్ ఎకోసిస్టమ్ దిశగా ప్రయాణం కొనసాగిస్తామని గూగుల్ తన బ్లాగ్‌లో వెల్లడించింది. ఈ ప్రైవసీ శాండ్‌బాక్స్ ద్వారా ఆన్‌లైన్‌లో తన వినియోగదారుల ప్రైవసీని కాపాడగలమని గూగుల్ వెల్లడించింది.
ఈ ప్రైవసీ శాండ్‌బాక్స్ క్రాస్ యాప్ ట్రాకింగ్, క్రాస్ సైట్ సమస్యలను తగ్గించి, వినియోగదారులకు మరింత భద్రత, సేవలను అందించగలమని భావిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








