గూగుల్‌కు అనుకోని షాక్, దావా వేసిన తులసి గబ్బర్డ్
టెక్ ప్రపంచంలో ఎదురులేకుండా దూసుకుని వెళుతున్న టెక్ గెయింట్ గూగుల్‌కు అమెరికాలో ఊహించని షాక్ తగిలింది.ఈ షాక్ ఇచ్చింది ఎవరో కాదు. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ఓ హిందూ మహిళ. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ వ్యక్తిగా రికార్డు సృష్టించిన తులసీ గబ్బర్డ్ గూగుల్‌పై తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు.

తన ప్రచార ప్రకటనల ప్రసారాలపై గూగుల్ వివక్షా పూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ లాస్ఏంజిల్స్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. 50 మిలియన్ డాలర్ల (సుమారు 3వేల 452 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె సన్నిహితుల కథనం ప్రకారం ఆమె 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతోంది.

ఇదే మొదటిసారి
న్యూయార్క్ కథనం ప్రకారం ఒక రాజకీయ ప్రతినిధి టెక్ దిగ్గజంపై దావా వేయడం ఇదే మొదటిసారి. జూన్ 27-28 తేదీల్లో రాత్రిపూట ఆరు గంటలపాటు ప్రచారం తమ ప్రకటనల ఖాతాను గూగుల్ నిలిపివేసిందని గబ్బర్డ్ ప్రచార కమిటీ తులసి నౌ ఇంక్. ఆరోపించింది. తద్వారా తమకు 50 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. వెంటనే ఆ పరిహారం గూగుల్ చెల్లించాలని కోరింది.
తన ప్రచార అకౌంట్ గంటల తరబడి ఆఫ్‌లైన్‌లోనే ఉందనీ, గూగుల్ తమకు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే నిలిపివేసిందని గబ్బర్డ్ ఆరోపించారు. ఇంటర్నెట్ శోధనలో గూగుల్ గుత్తాధిపత్యం ఎంత ప్రమాదకరమైనదో గూగుల్ వైఖరి ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ధోరణి భావస్వేచ్ఛకు, నిష్పక్షపాత ఎన్నికలకు, అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. అయితే అమెరికా ప్రజల తరపున దీనిపై తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు.

స్పందించిన గూగుల్
మరోవైపు గబ్బర్డ్ ఆరోపణలపై స్పందించిన గూగుల్, తులసి గబ్బర్డ్ ఖాతాలో అసాధారణ యాక్టివిటీ మూలంగానే ఆ అకౌంట్ బ్లాక్ అయిందని వివరించింది. తమ సిస్టంలోని ఆటోమేటిక్ ఫ్రాడ్ ప్రివెన్షన్ ఫీచర్ కారణంగా తాత్కాలిక షట్‌డౌన్‌కు దారితీసిందని గూగుల్ పేర్కొంది. దీన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో
కాగా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి, అమెరికా కాంగ్రెస్‌లో మొట్టమొదటి హిందూ సభ్యురాలు తులసి గబ్బర్డ్ తెలిపారు. ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న, ప్రస్తుతం విదేశీ వ్యవహారాల కమిటీలో పనిచేస్తున్న 37ఏళ్ళ గబ్బర్డ్ మాట్లాడుతూ, తన ఎన్నికల ప్రచారంలో యుద్ధం, శాంతి ప్రధాన అంశాలుగా వుంటాయన్నారు. అమెరికన్లు ఎదుర్కొంటున్న పలు సవాళ్ళు తనను చాలా ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. వాటిని పరిష్కరించడంలో తాను సాయపడాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఎన్నికల ప్రచార బాధ్యతలు
అందరికీ ఆరోగ్య సంరక్షణ, క్రిమినల్ జస్టిస్ సంస్కరణలు, వాతావరణ మార్పులు వంటి పలు అంశాలను ఆమె ప్రస్తావించారు. కాగా దీనిపై డెమోక్రాట్ కార్యాలయం వెంటనే స్పందించలేదు. గబ్బర్డ్ సహాయకుడు రానియా బాట్రిస్ ఆమె ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తారు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని దీవి అమెరికన్ సమోవాలో జన్మించిన తులసి తల్లి కరోల్ పోర్టర్ హిందూ మతాన్ని ఇష్టపడేవారు. టీనేజరుగా వున్నపుడు తులసి కూడా హిందూ మతంలోకి మారారు.
2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు,
2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. తాను మరోసారి పోటీ చేస్తానని ట్రంప్ ప్రకటించారు.. ఆయనను పోటీకి చాలామంది డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆసక్తిగా ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి దాదాపు డజను మంది వరకు రేసులో ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పటికే భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిన్ పేరు ఉంది.


Click it and Unblock the Notifications








