గూగుల్ 'ఏఐ ఏజెంట్స్'.. ఆఫీస్ పనులన్నీ వాటంతట అవే చేసుకుపోతాయి..
Google AI Workspace: సాధారణంగా మనం సాఫ్ట్‌వేర్‌కు కమాండ్ ఇస్తేనే పని చేస్తుంది. కానీ, మీరు చెప్పకముందే మీ అవసరాలను గుర్తించి, పనులను చక్కబెట్టే టెక్నాలజీ ఉంటే ఎంత బాగుంటుంది? గూగుల్ (Google) ఇప్పుడు ఆ కలను నిజం చేస్తోంది. 'వర్క్‌స్పేస్ స్టూడియో' (Workspace Studio) పేరుతో ఒక కొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తోంది. ఇది మీ ఆఫీస్ పనులను ఆటోమేట్ చేసే 'ఏఐ ఏజెంట్స్'ను సృష్టిస్తుంది.
కేవలం చాట్‌బాట్స్ కాదు.. అంతకు మించి..
ఇప్పటి ఏఐ చాట్‌బాట్స్ కేవలం సందేశాలు రాయడానికో, చిన్న సాయం చేయడానికో పనికొచ్చేవి. కానీ గూగుల్ తీసుకొస్తున్న ఈ కొత్త టెక్నాలజీ.. పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే 'డిజిటల్ ఉద్యోగుల' లాంటిది. ఈ ఏఐ ఏజెంట్లు మీ ఈమెయిల్స్ చదవడం, ఏది ముఖ్యమో గుర్తించడం, మీటింగ్స్ షెడ్యూల్ చేయడం, స్ప్రెడ్‌షీట్స్ అప్డేట్ చేయడం లాంటివన్నీ మీ ప్రమేయం లేకుండానే చేసుకుపోతాయి.

అసలు ఏంటి ఈ వర్క్‌స్పేస్ స్టూడియో?
ఇది గూగుల్ రూపొందించిన ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్. డెవలపర్లు, కంపెనీలు తమకు కావాల్సినట్లుగా 'ఇంటెలిజెంట్ ఏజెంట్స్'ను ఇక్కడ తయారు చేసుకోవచ్చు. ఇవి జీమెయిల్ (Gmail), డాక్స్ (Docs), షీట్స్ (Sheets), డ్రైవ్ (Drive), క్యాలెండర్ (Calendar) వంటి అన్ని గూగుల్ యాప్స్‌తో కలిసి పనిచేస్తాయి.
ఉదాహరణకు కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను ఒక ఏజెంట్ ఆటోమేటిక్‌గా గుర్తించి, వాటి అర్జెన్సీని బట్టి వేరు చేసి, ఒక షీట్‌లో నమోదు చేసి, సంబంధిత ఉద్యోగికి పని అప్పగించగలదు. దీని కోసం క్లిష్టమైన కోడింగ్ కూడా అవసరం లేదు.
కంపెనీలకు పెద్ద ఊరట..
వ్యాపారాలు పెరుగుతున్న కొద్దీ పనులను ఆటోమేట్ చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. రకరకాల టూల్స్ వాడటం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. గూగుల్ ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తోంది. వర్క్‌స్పేస్ స్టూడియో ద్వారా అన్ని ఆటోమేషన్ పనులు ఒకే చోట, భద్రంగా, సులభంగా నిర్వహించుకోవచ్చు. ఇప్పటికే గూగుల్ టూల్స్ వాడుతున్న వారికి ఇది ఎంతో కలిసొస్తుంది.
మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐకి గట్టి పోటీ..
ఈ రేసులో గూగుల్ ఒక్కటే లేదు. మైక్రోసాఫ్ట్ (Microsoft) తన ఆఫీస్ యాప్స్ కోసం 'కోపైలట్ స్టూడియో'ను, ఓపెన్ ఏఐ (OpenAI) కూడా తమ ఏజెంట్లను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే, కోట్లాది మంది ఇప్పటికే గూగుల్ వర్క్‌స్పేస్ వాడుతుండటం గూగుల్‌కు ఉన్న అతిపెద్ద బలం. కేవలం డాక్స్, షీట్స్ వాడటమే కాకుండా, వాటిని అసిస్టెంట్లుగా మార్చుకునే అవకాశం ఇది కల్పిస్తుంది.
సవాళ్లు కూడా ఉన్నాయి..
టెక్నాలజీ ఎంత బాగున్నా కొన్ని ప్రశ్నలు రాకమానవు. ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌కు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి? డబ్బులు, కస్టమర్ల విషయంలో ఏఐ తీసుకునే నిర్ణయాలను గుడ్డిగా నమ్మొచ్చా? అనే సందేహాలు ఉన్నాయి. రియల్ టైమ్ ఆఫీస్ వర్క్‌లో వచ్చే అనూహ్య సమస్యలను ఈ ఏజెంట్లు ఎంతవరకు తట్టుకోగలవనేది చూడాలి.
కానీ ఉత్పాదకత పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని గూగుల్ నమ్ముతోంది. వర్క్‌స్పేస్ స్టూడియోతో గూగుల్ తన విజన్‌ను స్పష్టం చేసింది. భవిష్యత్తులో కేవలం స్మార్ట్ డాక్యుమెంట్లు ఉంటే సరిపోదు.. మనతో పాటు పని పంచుకునే తెలివైన సిస్టమ్స్ కావాలి. గూగుల్ ప్రయత్నం సఫలమైతే, రాబోయే రోజుల్లో ఏఐ కేవలం మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు.. మనతో కలిసి ఆఫీస్ పనులను చకచకా పూర్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








