మీ ఫోన్ దొంగల చేతికి చిక్కినా.. డేటా సేఫ్.. గూగుల్ తెచ్చిన కొత్త 'ఆటో-రీస్టార్ట్' ఫీచర్ అదుర్స్!!
Google Android auto-restart feature : ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గూగుల్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది మీ ఫోన్ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఒక పవర్‌ఫుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దాని పేరు 'ఆటో-రీస్టార్ట్ ఫీచర్'. ఇదేం చేస్తుందంటే.. మీరు మీ ఫోన్‌ను లాక్ చేసి, వరుసగా మూడు రోజుల పాటు అస్సలు వాడకుండా పక్కన పెట్టేశారనుకోండి, ఇది ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తుంది.
ఇటీవల విడుదలైన గూగుల్ ప్లే సర్వీసెస్ v25.14 అప్‌డేట్‌లో భాగంగా ఈ మార్పు వచ్చింది. వినడానికి చిన్న మార్పులా అనిపించినా, మీ విలువైన డేటాను కాపాడటంలో, దొంగలు, హ్యాకర్లకు చుక్కలు చూపించడంలో ఇది పెద్ద పాత్ర పోషిస్తుంది. మరి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

* ఇది ఎలా పనిచేస్తుంది?
ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌ను లాక్ చేసి, 72 గంటల పాటు (అంటే మూడు రోజులు) ఏమాత్రం ముట్టుకోకుండా వదిలేస్తే, ఈ కొత్త ఫీచర్ రంగంలోకి దిగి, మీ డివైజ్‌ను దానంతట అదే రీబూట్ (Restart) చేస్తుంది. ఇలా రీస్టార్ట్ అయిన వెంటనే, ఫోన్ 'బిఫోర్ ఫస్ట్ అన్‌లాక్' (BFU) అనే ప్రత్యేకమైన స్థితిలోకి వెళ్తుంది.
ఈ స్థితిలో, మీరు ఇంకా మీ పిన్, పాస్‌వర్డ్ లేదా వేలిముద్ర/ముఖం వంటి బయోమెట్రిక్స్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేయలేదు కాబట్టి, మీ డేటా మొత్తం పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అయి (అంటే, పటిష్టంగా లాక్ చేయబడి) ఉంటుంది. దీనివల్ల, ఎంత తెలివైన దొంగలు లేదా హ్యాకర్లు ప్రయత్నించినా మీ డేటాను చూడటం దాదాపు అసాధ్యం.
ఫోన్ BFU స్థితిలో ఉన్నప్పుడు, చట్టాన్ని అమలు చేసే అధికారులు లేదా డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులకు కూడా ఫోన్‌లోని సమాచారాన్ని యాక్సెస్ చేయడం చాలా కష్టతరం అవుతుంది. అసలు దీని వల్ల మనకేంటి లాభం? అనేక దా మీ డౌటు. ఇప్పుడు ఆ వివరాలే తెలుసుకుందాం.
* ప్రయోజనాలు
సాధారణంగా మనం ఫోన్‌ను ఒకసారి అన్‌లాక్ చేశాక, అది 'ఆఫ్టర్ ఫస్ట్ అన్‌లాక్' (AFU) అనే స్థితిలోకి వెళ్తుంది. ఈ స్థితిలో, మన డేటాలో కొంత భాగం డిక్రిప్ట్ అయి (లాక్ తీసివేయబడి), సులభంగా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ పోయినా లేదా దొంగల పాలైనా, అది ఎక్కువసేపు AFU స్థితిలోనే ఉంటే, మీ డేటాకు ప్రమాదం పొంచి ఉన్నట్లే.
అందుకే, మూడు రోజుల పాటు ఫోన్ వాడకపోతే, గూగుల్ దాన్ని బలవంతంగా రీస్టార్ట్ చేసి, అత్యంత సురక్షితమైన BFU స్థితికి తిరిగి తీసుకువస్తుంది. దీంతో మీ సమాచారం భద్రంగా లాక్ అయిపోతుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో ఈ సేఫ్టీ ఫీచర్ మరో లాగా పనిచేస్తుంది.
గూగుల్ పిక్సెల్ మొబైల్స్ లో లాక్ స్క్రీన్ మీద "Unlock for all features and data" (అన్ని ఫీచర్లు, డేటా కోసం అన్‌లాక్ చేయండి) అనే సందేశం కూడా కనిపిస్తుంది. ఫోన్ పూర్తిగా పనిచేయాలంటే అన్‌లాక్ చేయాలని ఇది మీకు గుర్తుచేస్తుంది.
* అన్ని ఫోన్లలో ఈ ఫీచర్ వస్తుందా..
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం వచ్చింది. త్వరలోనే టాబ్లెట్‌లకు కూడా వస్తుందని ఆశిస్తున్నారు. అయితే, ఆండ్రాయిడ్ టీవీ, వేర్ ఓఎస్ (వాచ్‌ల కోసం), ఆండ్రాయిడ్ ఆటో (కార్ల కోసం), ప్లే గేమ్స్ వాడే విండోస్ పీసీలకు మాత్రం ఈ ఫీచర్ వర్తించదు.
ఇది గూగుల్ ప్లే సర్వీసెస్ ద్వారా వస్తున్న అప్‌డేట్ కాబట్టి, దీనికోసం మీరు ప్రత్యేకంగా సిస్టమ్ అప్‌డేట్ చేయాల్సిన పనిలేదు. చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఏప్రిల్ 16న గూగుల్ విడుదల చేసిన చేంజ్‌లాగ్ (మార్పుల వివరాలు) ప్రకారం, భవిష్యత్తులో ఈ ఆటో-రీస్టార్ట్ ఫీచర్‌ను ఐచ్ఛికం (optional) చేయనున్నారు.
అంటే, మీకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా టాబ్లెట్‌ల వంటి డివైజ్‌లను ఎక్కువ కాలం రీస్టార్ట్ చేయకుండా వాడే యూజర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అప్‌డేట్ విడుదల అవుతున్నా, ఫీచర్ అందరి ఫోన్లలో యాక్టివేట్ అవ్వడానికి ఇంకొంచెం సమయం పట్టొచ్చు.
* దొంగలకు చెక్ పెట్టేందుకే ఈ మాస్టర్ ప్లాన్..
రీస్టార్ట్ అయ్యే ముందు మీకు ఏమైనా నోటిఫికేషన్ వస్తుందా? లేదా దీన్ని సెట్టింగ్స్‌లో మార్చుకునే అవకాశం ఇస్తారా? అనే విషయాలపై గూగుల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. నిజానికి, ఇలాంటి భద్రతా చర్యను గత సంవత్సరం ఆపిల్ కూడా "ఇనాక్టివిటీ రీబూట్" (కదలిక లేకపోతే రీబూట్) పేరుతో తీసుకొచ్చింది. దొంగల చేతికి చిక్కిన ఫోన్లను వారు వాడకుండా, అమ్మకుండా ఆపడమే ఈ రెండు కంపెనీల ప్రధాన లక్ష్యం.


Click it and Unblock the Notifications








