వర్క్ ఫ్రం హోం పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.20.54 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు..!!
సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఆన్‌లైన్ జాబ్స్, పార్ట్‌టైం ఉద్యోగం, ఆన్‌లైన్ టాస్క్‌లు, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరిట వలవేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఉన్నత విద్యావంతులు కూడా ఈ తరహా ఘటనల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఘటనలో ఓ మహిళా డాక్టర్ నేరగాళ్ల చేతితో మోసపోయారు. ఏకంగా రూ.17 లక్షలు మోసపోయారు. తాజాగా గ్రేటర్ నోయిడాకు (Work From Home Scam in Greater Noida) చెందిన ఓ వ్యక్తిని వర్క్ ఫ్రం హోం ఉద్యోగం పేరుతో మోసం చేశారు.
గ్రేటర్ నోయిడా పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంవత్సరం జనవరిలో నోయిడాకు చెందిన సందీప్ కుమార్ అనే వ్యక్తికి వాట్సాప్‌లో వర్క్ ఫ్రం హోం పేరిట ఓ మెసెజ్ వచ్చింది. గూగుల్ మ్యాప్స్‌లో హోటళ్లకు రేటింగ్స్ ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నది ఆ మెసెజ్ సారాంశం. ఇంటి నుంచే పని చేయవచ్చని వాట్సాప్ మెసెజ్‌లో పేర్కొన్నారు.

అయితే ఇది నిజమని నమ్మిన బాధితుడు.. హోటళ్లకు రేటింగ్స్ ఇచ్చేందుకు అంగీకరించాడు. అనంతరం అతడ్ని ఓ టెలిగ్రాం గ్రూప్‌లో జాయిన్ చేశారు. అందులో సుమారు 100 ఉన్నారు. తొలుత కేవలం గూగుల్ మ్యాప్స్‌లో హోటళ్లకు రేటింగ్ ఇవ్వమని చెప్పారు. అనంతరం చిన్న చిన్న పెట్టుబడులు పెట్టాలని.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చని సూచించారు.
దీంతో నేరగాళ్లు మాటలు నమ్మిన బాధితుడు తొలుత రూ.50,000 పెట్టుబడి పెట్టారు. అయితే అనంతరం ఆ డబ్బును విత్‌డ్రా చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అలా క్రమంగా రూ.20,54,464 వరకు డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఆ నగదును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నం చేయగా.. రూ.5 లక్షలు ట్యాక్స్ కట్టాలని సూచించారు.
దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు నోయిడా సెక్టర్ 36 లోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక నష్టంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టెలిగ్రాం, ఫోన్ కాల్స్ ద్వారా చంపుతామని బెదిరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా IPC 420, 506 సెక్షన్‌లతోపాటు IT చట్టం ప్రకారం నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. రెండు రోజుల క్రితం ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎటువంటి అరెస్ట్‌లు జరగలేదని తెలుస్తోంది.
కొన్నిరోజుల క్రితం ముంబైకి చెందిన ఓ డాక్టర్ కూడా ఇదే తరహాలో మోసపోయారు. ఏకంగా రూ.17 లక్షలు కోల్పోయారు. ఆన్‌లైన్ టాస్క్‌ల పేరిట మహిళా డాక్టర్‌ను మోసం చేశారు. అదనపు ఆదాయం కోసం ఆశపడి.. భారీగా డబ్బులు కోల్పోయారు. ఈ కేసులోనూ దర్యాప్తు జరుగుతోంది.
ఈ తరహా ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటువంటి ఆఫర్లతో ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వచ్చినప్పుడు.. నేరుగా సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లు లేదా ఇతర మార్గా్ల్లో పూర్తి వివరాలను సేకరించాలని సూచిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని చెప్పేవారి మాటలు నమ్మవద్దని.. పూర్తి ధ్రువీకరణ లేకుండా ఇలాంటి ఉద్యోగాల్లో చేరవద్దని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications