దేశంలో మరుగుదొడ్లు కంటే సెల్ ఫోన్సే ఎక్కువ

Posted By: Super

దేశంలో మరుగుదొడ్లు కంటే సెల్ ఫోన్సే ఎక్కువ

 

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్‌కె సింగ్ విడుదల చేసిన జనగణన నివేదిక-2011 ప్రకారం మన దేశంలో మరుగుదొడ్లు కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువగా ఉన్నాయని తేలింది. వివరాల్లోకి వెళితే దేశంలో టాయిలెట్లు అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్‌ది మొదటి స్థానం. జార్ఖండ్‌లో 77 శాతం ఇళ్లకు టాయిలెట్లు లేవు. ఆ తర్వాతి స్థానంలో ఒడిశా 76.6 శాతం, బీహార్ 75.8 శాతంతో ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 46.9 శాతం కుటుంబాలకే టాయిలెట్ సౌకర్యం ఉండగా, 49.8 శాతం కుటుంబాలకు టాయిలెట్ సౌకర్యం లేదు.

జనగణన నివేదిక ప్రకారం, దేశంలో 47.2 శాతం కుటుంబాలకు టీవీలు ఉండగా, 19.9 శాతం మంది మాత్రమే రేడియో లేదా ట్రాన్సిస్టర్ ఉపయోగిస్తున్నారు. అయితే, 86.6 శాతం జనాభా తమ సొంత ఇళ్లలో నివసిస్తుండటం విశేషం. వీరిలో 37.1 శాతం మంది ఒకే గది ఉన్న ఇళ్లలో నివసిస్తుండగా, 31.7 శాతం మంది రెండు గదుల ఇళ్లలో, 14.5 శాతం మంది మూడు గదుల ఇళ్లలో నివసిస్తున్నారు.

ఐతే, 63.2 శాతం కుటుంబాలకు టెలిఫోన్ సౌకర్యం ఉండగా, 53.2 శాతం జనాభా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లేతే లక్షదీవుల్లో టెలిఫోన్ల వాడే వారి సంఖ్య అత్యధికం. ఈ దీవుల్లో 93.6 శాతం కుటుంబాలకు టెలిఫోన్లు ఉన్నాయి. టెలిఫోన్ల వినియోగంలో ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ 90.8 శాతం, చండీగఢ్ 89.2 శాతం ఉన్నాయి.

బహిరంగ ప్రదేశాల్లో బహిర్భూమికి వెళ్లే అలవాటు వెనుక సాంస్కృతిక, సాంప్రదాయక కారణాలు ఉన్నాయని, చదువు లేకపోవడం కూడా దీనికి కారణమని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ చంద్రమౌళి అన్నారు. గ్రామీణ జనాభాలో 62.5 శాతం మంది ఇప్పటికీ పుల్లలు, కట్టెలనే ఇంధనంగా ఉపయోగిస్తున్నారని, 44.8 శాతం మంది రవాణా కోసం సైకిళ్లపైనే ఆధారపడుతున్నారని, ఇంటర్నెట్ సౌకర్యంతో కంప్యూటర్లు ఉపయోగిస్తున్న జనాభా దేశంలో కేవలం 3.1 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot