అంచనాలకు మించిన లాభాలను నమోదు చేసిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

Posted By: Staff

అంచనాలకు మించిన లాభాలను నమోదు చేసిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఏకీకృత నికరలాభం 33 శాతం వృద్ధితో రూ.468.20 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది రూ.350.30 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం సైతం 31.5 శాతం పెరిగి రూ.3132.1 కోట్ల నుంచి రూ.4138.2 కోట్లకు చేరుకున్నాయి. 'వరుసగా రెండో త్రైమాసికంలో 30 శాతానికి పైగా ఆదాయ వృద్ధిని సాధించి మార్కెట్‌ వాటాను పెంచుకున్నాం. మార్జిన్లనూ పెంచుకున్నామ'ని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వైస్‌ ఛైర్మన్‌, సీఈఓ వినీత్‌ నాయర్‌ పేర్కొన్నారు. కీలక మార్కెట్లు, సేవల్లో పెట్టుబడులపై కంపెనీ ముందు చూపే మెరుగైన ఆర్థిక ఫలితాలకు కారణమైందని వివరించారు.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నాలుగో త్రైమాసికంలో స్థూలంగా 7534 మందిని; నికరంగా 1153 ఉద్యోగులను చేర్చుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 73420కు చేరుకుంది. గత 12నెలల్లో కంపెనీ 58 కొత్త క్లయింట్లను సంపాదించగా నాలుగో త్రైమాసికంలో 11 ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఇందులో 8 ప్రస్తుత క్లయింట్లతోనే కుదుర్చుకోవడం విశేషం.

100% డివిడెండు: రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.2 డివిడెండును కంపెనీబోర్డు సిఫారసు చేసింది. మరో పక్క మెరుగైన ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో రూ.525.95 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని చేరి చివరకు 9.93% లాభంతో రూ.522.85 వద్ద ముగిశాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot