ఆపదలో ఆదుకునే హెల్మెట్!

Posted By: Prashanth

ఆపదలో ఆదుకునే హెల్మెట్!

 

ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే అది మన ప్రాణాలను కాపాడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఆ సమయంలో మనం అపస్మారక స్థితిలో ఉంటే.. ఏదో నిర్జన ప్రదేశంలో ప్రమాదం జరిగితే.. చిత్రంలోని ఐస్‌డాట్ క్రాష్ సెన్సర్ హెల్మెట్ పెట్టుకుంటే.. ఆ సమయంలోనూ అది మన ప్రాణాలకు కాపాడుతుంది! ఈ హెల్మెట్ బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించి ఉంటుంది. ప్రమాదం జరిగితే.. వెంటనే మన సంబంధీకులకు.. అంబులెన్స్‌కు సమాచారం పంపుతుంది! జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ హెల్మెట్‌లో ఉండే సెన్సర్ ఏదైనా ప్రమాదం జరిగినట్లు గుర్తిస్తే.. వెంటనే ఫోన్ అలారం మోగిస్తుంది. ఆ తర్వాత కౌంట్ డౌన్ మొదలువుతుంది.

హెల్మెట్... ప్రయాణ సందర్భాల్లో

ఇది మనం ఎంచుకున్నదాన్ని బట్టి 15 సెకన్ల నుంచి 60 సెకన్ల వరకూ ఉంటుంది. ఆ సమయంలో లోపల మనం అలారంను ఆపకుంటే.. ఇందులో మనం నమోదు చేసిన ఎమర్జెన్సీ నంబర్లన్నిటికీ ప్రమాదం జరిగిందన్న సమాచారం వెళ్లిపోతుంది. అంతేకాదు.. బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడిన దాన్ని బట్టి.. ప్రమాద తీవ్రతను సైతం ఇది సరిగ్గా అంచనా వేస్తుందట! ప్రమాదం ఎక్కడ జరిగిందన్న విషయంతోపాటు సదరు వ్యక్తికి అంతకుముందు నుంచే ఆరోగ్య సమస్యలు అంటే గుండెజబ్బు, మధుమేహం వంటివి ఉన్నట్లయితే.. ఆ వివరాలనూ పంపుతుంది. మీకో విషయం తెలుసా? ఈ హెల్మెట్ రూపకల్పన ఆలోచన రావడానికి ఓ భారతీయు చెఫ్ కారణమని దీన్ని తయారుచేసిన కంపెనీ ఐస్‌డాట్(అమెరికా) చెబుతోంది. ప్రముఖ సైక్లిస్ట్‌ల వద్ద చెఫ్‌గా పనిచేసిన బిజూ థామస్ ఓసారి ఒంటరిగా బైక్ వెళ్తుండగా.. ప్రమాదం జరిగిందట. అయితే, ఆ సమయంలో తీవ్రమైన ప్రమాదం జరిగి ఉంటే.. తన ప్రాణాలు దక్కేవి కావని.. తాను ఎక్కడున్నది కూడా కనుక్కోవడం కష్టమయ్యేదని ఆయన చెప్పారు. దీంతో ఐస్‌డాట్‌కు ఈ హెల్మెట్ ఆలోచన వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి రానున్న ఈ హెల్మెట్ రేటు రూ.10 వేలకు పైనే.. దీంతోపాటు ఈ సేవల కోసం ఏటా రూ.500 అదనంగా కట్టాల్సి ఉంటుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting