పండుగల సీజన్‌లో ఆఫర్‌లు అంటూ మెయిల్, మెసేజ్‌లు వస్తున్నాయా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
పండుగల సీజన్ సందర్భంగా ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు సహా సంస్థలు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్నాయి. ఈ సేల్ సందర్భంగా అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో మరింత డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. వరుస పండుగల ఆఫర్‌లతో వినియోగదారులు కూడా ఈ సేల్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ పద్ధతుల్లో వినియోగదారులను మోసం చేసేందుకు (Online Scams) ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు.
సైబర్ నేరగాళ్లు మోసాలు ఎలా చేస్తారు .. ? : సాధారణంగా ఈ తరహా సేల్‌లో సమయంలో డిస్కౌంట్ ఆఫర్‌లు, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఆయా సంస్థలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల పేరుతో ఈ-మెయిల్, SMS లను పంపిస్తుంటారు.

వాటిలోని హానికర లింక్స్ పైన క్లిక్ చేస్తే, మీ బ్యాంకు ఖాతా హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో అందులోని నగదును దోచుకొనే అవకాశం ఉంది. అందువల్ల ఈ తరహా ఆఫర్ల పేరుతో వచ్చే లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆయా లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు.
మీరు ఏదైనా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భావిస్తే సంబంధిత సంస్థల వెబ్‌సైట్‌లు లేదా ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలోకి నేరుగా వెళ్లి తనిఖీ చేసుకోవాలి. ఆయా వెబ్‌సైట్‌లు, యాప్‌ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ తరహా ఆఫర్ల పట్ల ఎటువంటి అజాగ్రత్తగా వ్యవహరించినా.. క్రెడిట్ కార్డు సహా ఇతర సున్నితమైన బ్యాంకింగ్ వివరాలను నేరగాళ్లు కొల్లగొట్టే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఇటువంటి పండుగల సమయంలో ఆఫర్‌ల పేరుతో వచ్చే SMS లు, ఇ-మెయిల్‌ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. తొలుత మీకు వచ్చిన ఇ-మెయిల్ అడ్రస్‌ను సరిగా పరిశీలించాలి. సైబర్ నేరగాళ్ల దగ్గర నుంచి వచ్చే ఇ-మెయిల్‌లలో అక్షర దోషాలు ఉంటాయి. వీటిని గుర్తించేందుకు ప్రయత్నం చేయాలి.
దీంతోపాటు చెల్లింపుల సమయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటి భద్రత ప్రమాణాలు కలిగిన వ్యవస్థల ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలి. దీంతోపాటు పరిమితకాల ఆఫర్‌లు అంటూ వచ్చే సందేశాలను పక్కన పెట్టడం ఉత్తమం. ఈ తరహా వాటిలో నకిలీవే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
దీంతోపాటు కొనుగోళ్ల సమయంలో OTP ను ఎవరికీ షేర్ చేయవద్దు. సంస్థలు ఎప్పుడు కూడా OTP ల సమాచారం చెప్పాలని వినియోగదారులకు ఎటువంటి మెయిల్ లేదా SMS, కాల్స్ చేయవని గుర్తించాలి. దీంతోపాటు సైబర్ మోసాలకు గురైనట్లు భావిస్తే బ్యాంకులు సహా సైబర్ క్రైం పోర్టల్, సైబర్ పోలీస్ స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలి.
ప్రస్తుత పండుగల సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీవాళీ స్పెషల్ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపాళీ పేరుతో సేల్ నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఇవాళ్టి నుంచే ప్రారంభం అయింది. అక్టోబర్ 31 వరకు సేల్ జరగనుంది. దీంతోపాటు అనేక సంస్థలు కూడా దీపావళి సందర్భంగా ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్నాయి. ఆపిల్, షియోమీ, రియల్‌మి, ఐకూ తరహా సంస్థలు దీపావళి సందర్భంగా సేల్ నిర్వహిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








