AP వాట్సాప్ గవర్నెన్స్ 'మన మిత్ర' ను ఎలా ఉపయోగించాలి.. వాట్సాప్‌లో RTC టికెట్లు ఎలా బుకింగ్ చేయాలి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను (AP Whatsapp Governance) తీసుకొచ్చింది. దీని ద్వారా 161 సేవలను అందించనున్నట్లు వెల్లడించింది. మన మిత్ర పేరుతో (Mana Mitra) ఈ సర్వీసులను లాంచ్ చేసింది. భవిష్యత్ లో మరిన్ని విభాగాలను ఈ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపింది. ఫలితంగా వాట్సాప్ ద్వారానే వివిధ రకాల సర్టిఫికేట్‌లతోపాటు ఫిర్యాదులను కూడా చేసేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం 9552300009 వాట్సాప్ నంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎన్నో సేవలు :
మన మిత్ర ద్వారా దేవాలయాల దర్శన టికెట్లు, ఆర్టీసీ బస్ టికెట్లతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా వివిధ రకాల సర్టిఫికేట్‌లను పొందవచ్చు. విద్యుత్ ఛార్జీలు చెల్లింపు, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించిన సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చు. ఇన్‌కమ్ సర్టిఫికేట్, EWS, OBC, ట్రేడ్ లైసెన్స్, ల్యాండ్ రికార్డులు సహా ఇతర సర్టిఫికేట్‌లను పొందవచ్చు.

ఎమర్జీన్సీ సమయంలో :
దీంతోపాటు ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల సమయంలో కోట్లాది మంది ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ సేవలు వినియోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. భారీ వర్షాలు, వరదలు, విద్యుత్ అంతరాయానికి సంబంధించిన వివరాలు సహా ఇతర అత్యవసర పరిస్థితుల్లో మన మిత్ర సేవలు ఉపయోగపడనున్నాయి.
RTC బస్ టికెట్ల బుకింగ్ :
ప్రస్తుతం 161 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకొచ్చామని.. భవిష్యత్‌లో మరో 360 కి పైగా సర్వీసులను ఇందులోకి తీసుకొస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఏపీఎస్‌ఆర్‌టీసీ టికెట్లు కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఇటీవల సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు :
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా బుకింగ్ చేసుకున్న టికెట్లను అనుమతించాలని అధికారులు, డిపో మేనేజర్‌లను ఆదేశించింది. సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. అయితే ఈ సేవలను వాట్సాప్ ద్వారా ఎలా పొందాలి.
9552300009 వాట్సాప్ నంబర్ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 9552300009 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌ను ఓపెన్ చేసి సెర్చ్ చేయాలి. ఈ నంబర్‌కు వెరిఫైడ్ టిక్ మార్క్ ఉందో లేదో ముందు తనిఖీ చేసుకోవాలి. చాట్ బార్‌లో Hi అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
- ఏపీ ప్రభుత్వ పౌర సేవలకు స్వాగతం అని మీకో మెసేజ్ వస్తుంది.
- చివరలో మీకు 'సేవను ఎంచుకోండి' అనే మెనూ తరహా ఆప్షన్ కనిపిస్తుంది.
- అనంతరం మీకు కొన్ని ప్రభుత్వ శాఖల వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
- మీకు కావాల్సిన సమాచారం కోసం శాఖలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
- మీ దరఖాస్తు, ఫిర్యాదు వివరాలు సహా స్టేటస్‌ను కూడా తెలుసుకొనేందుకు అవకాశం ఉంది.
- ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను కూడా మన మిత్ర ద్వారా అందించవచ్చు.
* మన మిత్ర ద్వారా APSRTC బస్ టికెట్లను ఎలా బుకింగ్ చేసుకోవాలి.
- తొలుత 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేయాలి.
- అనంతరం మీకు వచ్చిన ఆప్షన్‌లలో RTC ను ఎంచుకోవాలి.
- ఆర్టీసీ టికెట్ బుకింగ్/ రద్దు అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- ప్రాంతం, సమయం, తేదీ వంటిని నమోదు చేయాలి.
- అందుబాటులో ఉన్న బస్సు సర్వీసులు, సీట్ల వివరాలను కనిపిస్తాయి.
- మీకు కావాల్సిన బస్సు సర్వీసులను ఎంచుకొని, అక్కడే పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
- అనంతరం మీ వాట్సాప్ నంబర్‌కు టికెట్ వస్తుంది.
ఈ టికెట్‌ను అనుమతించాలని ప్రభుత్వం ఇప్పటికే RTC అధికారులను ఆదేశించింది.


Click it and Unblock the Notifications








