ఆన్‌లైన్‌లో మీరు కొనుగోలు చేసిన వస్తువులు నకిలీ లేదా ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవాలి..!
గతంలో ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేందుకు అధిక శాతం ప్రజలు దుకాణాలు, షాపింగ్ మాల్స్ కు వెళ్లి కొనుగోలు చేసేవారు. అనంతరం ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పులు వస్తున్నాయి. ఇ-కామర్స్ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. ఆర్డర్ చేసిన కొన్ని రోజుల్లోనే నేరుగా ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నాయి. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలు కూడా ఇప్పటికే పట్టణ, నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి.
సులభంగా కొనుగోళ్లు :
క్విక్ కామర్స్ సంస్థలు కొన్ని గంటల్లోనే కోరుకున్న వస్తువులను ఇంటికే డెలివరీ చేస్తున్నాయి. దీంతో చిరు దుకాణాలు సహా చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే వినియోగదారులకు ఇ-కామర్స్, క్విక్ కామర్స్ సంస్థల వల్ల అధిక ప్రయోజనం చేకూరుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే సులభంగా వస్తువులను కొనుగోలు చేయగలుగుతున్నాం.

ఇటీవల వచ్చిన ఓ నివేదిక ఆధారంగా ఆన్‌లైన్ డెలివరీ సంస్థల కారణంగా చిరు దుకాణాలు క్రమంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలిసింది. అయితే వినియోగదారులకు మాత్రం ఈ విధానం వల్ల ఉపయోగాలు ఉంటున్నా.. నకిలీ వస్తువులు, డ్యామేజీ అయిన వస్తువులతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బీఐఎస్ అధికారుల తనిఖీలు :
తాజాగా BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్ శివారులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు సిటీలోని అమెజాన్ గోదాముల్లో BIS అధికారులు తనిఖీలు చేశారు. ISI రిజిస్ట్రేషన్ మార్క్‌లేని 2783 ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటీ ధర సుమారు రూ.50 లక్షలుగా ఉంటుందని తెలిసింది.
BIS స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల్లో 150 స్మార్ట్‌వాచ్‌లు, 15 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 30 సీసీ కెమెరాలు, 10 ప్రెజర్ కుక్కర్లు, 16 మిక్సర్లు, 1937 స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్, 170 మొబైల్ ఛార్జర్‌లు, 326 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌లు సహా ఇతర వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీలోనూ :
దీంతోపాటు ఢిల్లీలోని అమెజాన్ గోదాంలోనూ BIS తనిఖీలు చేసింది. సరైన ధువీకరణ లేని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 3500 పైగా ఉత్పత్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి విలువ సుమారు రూ.70 లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది.
దీంతో ఇ-కామర్స్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై BIS అధికారులు ప్రజలు, వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. మీరు కొనుగోలు చేసిన ఉత్పత్తులు నకిలీవా లేదా ఒరిజినల్ అని తెలుసుకొనేందుకు BIS ప్రత్యేక యాప్‌ను కలిగి ఉందని, ఆ యాప్ ద్వారా స్కాన్ చేసి, వస్తువులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు.
ఉత్పత్తులు నకిలీ లేదా ఒరిజినల్ అని తెలుసుకొనేందుకు BIS Care యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లనూ అందుబాటులో ఉందని తెలిపారు. ఆయా స్టోర్‌ల నుంచి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
అనంతరం మీరు కొనుగోలు చేసిన ఏదైనా వస్తువు పై ఉన్న ISI నంబర్ ను ఆ యాప్‌లో నమోదు చేయాలి. నమోదు చేసిన వెంటనే మీకు ఆ వస్తువుకు సంబంధించిన వివరాలు కనిపిస్తే.. ఒరిజినల్‌గా గుర్తించాలని, ఎటువంటి వివరాలు రాకుంటే సదరు వస్తువు నకిలీదని తెలుసుకోవాలని సూచించారు.
ఇలాంటి నకిలీ ఉత్పత్తులను గుర్తించినప్పుడు BIS కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయని, ఆఫర్ల పేరిట నకిలీ వస్తువులు విక్రయించే ప్రయత్నాలు జరుగుంటాయని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








