మీ ఇంటి పనులన్నీ చేసేందుకు ఈ రోబోలు వచ్చేస్తున్నాయ్.. వాటి విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Humanoid Robots To Do Household Chores : మన ఇంటి పనులన్నీ రోబోలే చేసేస్తే... అబ్బా, ఎంత బాగుంటుంది కదా. మనం హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ కల ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పటికే వాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు వంటివి మన ఇళ్లలోకి వచ్చేశాయి కానీ, పూర్తిగా మనిషిలా పనిచేసే రోబోల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాం. అయితే, ఆ రోజులు మరీ అంత దూరంలో లేవనిపిస్తోంది.
ఇటీవలి టెక్నాలజీ అభివృద్ధి చూస్తుంటే, త్వరలోనే ఈ రోబోలను మన ఇళ్లలో చూసే అవకాశం ఉందనిపిస్తుంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఇంటి పనుల కోసం తయారు చేసిన రోబోలను పరిచయం చేశాయి. అవి ఎలా ఉండబోతున్నాయో, వాటి విశేషాలు ఏంటో వివరంగా చూసేద్దాం పదండి.

* 1X నియో గామా: ప్రత్యేకంగా ఇళ్ల కోసమే
టెస్లా రోబో పరిశ్రమల కోసం అయితే, 1X నియో గామా (1X NEO Gamma) రోబో ప్రత్యేకంగా ఇళ్లలో వాడకం కోసమే రూపొందించబడింది. మెత్తటి బట్ట లాంటి బాడీ, కమ్యూనికేషన్ కోసం వెలిగే "చెవి రింగులు"తో ఇది చూడ్డానికి అంత భయంగా ఉండదు, ఇంటి వాతావరణానికి సరిపోయేలా ఉంటుంది.
- ఈ రోబో ప్రత్యేకత ఏంటంటే
ఇది ఇంతకుముందు ఎప్పుడూ చూడని వస్తువులను కూడా పట్టుకోగలదు. అంతేకాదు, మనం మాట్లాడే భాషను అర్థం చేసుకుంటుంది, కొన్నిసార్లు హావభావాలతోనూ (బాడీ లాంగ్వేజ్) సమాధానం ఇస్తుంది. ఇది మనిషిలా అనిపించేలా చేస్తుంది. గామా ఇంకా అమ్మకానికి రాలేదు కానీ, నిజమైన ఇళ్లలో దీన్ని పరీక్షిస్తున్నారు. దీని తర్వాతి వెర్షన్ వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చు.
* టెస్లా ఆప్టిమస్: హై-టెక్ సహాయకుడు
ఎలాన్ మస్క్ మొదటిసారి టెస్లా హ్యూమనాయిడ్ రోబో గురించి చెప్పినప్పుడు, ఒక మనిషి రోబో కాస్ట్యూమ్ వేసుకుని స్టేజి మీదకు వచ్చాడు. దాంతో చాలామందికి ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం కలగలేదు. కానీ, కేవలం కొద్ది సంవత్సరాల్లోనే టెస్లా ఆ ఆలోచనను నిజమైన రోబోగా మార్చేసింది.
టెస్లా ఆప్టిమస్ తాజా వెర్షన్ ఇప్పటికే టెస్లా ఫ్యాక్టరీలలో అటూ ఇటూ నడుస్తోంది. టెస్లా కార్లలో వాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రాసెసింగ్ సిస్టమ్స్‌తోనే ఈ రోబో పనిచేస్తుంది. కాబట్టి, ఇది ఇంట్లోనూ, పరిశ్రమల్లోనూ రకరకాల పనులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఒక్కో రోబో ధర సుమారు 30,000 డాలర్లు (దాదాపు రూ.25 లక్షలు) ఉండొచ్చని మస్క్ చెబుతున్నా, టెస్లా గతంలో చెప్పిన ధరలను చూస్తే దీన్ని పూర్తిగా నమ్మలేం. టెస్లా కంపెనీకి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే ఈ ప్రాజెక్ట్‌పై ప్రభావం పడొచ్చు. ఆప్టిమస్ అందుబాటులోకి వస్తే మాత్రం, ఇంటి రోబోటిక్స్ రంగంలో ఇదొక పెద్ద మార్పు తీసుకురాగలదు.
* న్యూరా రోబోటిక్స్ 4NE-1: మీ భవిష్యత్తు పనివాడు
న్యూరా రోబోటిక్స్ (Neura Robotics) వారి 4NE-1 కూడా ఇంటి పనులే లక్ష్యంగా వస్తున్న మరో హ్యూమనాయిడ్ రోబో. ప్రచార వీడియోలలో ఇది సులభంగా బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం, చివరికి డ్రింక్స్ అందించడం వంటి పనులు చేస్తున్నట్లు చూపించారు. దీని సాంకేతిక వివరాలు పూర్తిగా తెలియరాలేదు.
ఇందులో అధునాతన కాగ్నిటివ్ AI (బాగా ఆలోచించగల కృత్రిమ మేధ) ఉందని, మనుషులకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండేందుకు చాలా సెన్సార్లు అమర్చారని న్యూరా కంపెనీ చెబుతోంది. ఇది 180 సెం.మీ (5'11") ఎత్తు, 176 పౌండ్ల (సుమారు 80 కిలోలు) బరువు ఉంటుంది.
టెస్లా ఆప్టిమస్ కంటే కొంచెం చిన్నది, బరువు తక్కువ. కానీ మోయగల బరువు (పేలోడ్) కూడా తక్కువే. దీని ప్రత్యేకత ఏంటంటే, అవసరాన్ని బట్టి దీని చేతులను మార్చుకోవచ్చు. ఇది నిర్దిష్ట పనులకు అనువుగా ఉంటుంది.
* పుడు D9: మార్కెట్‌కు సిద్ధం..
అన్నింటికంటే మార్కెట్లోకి రావడానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది పుడు రోబోటిక్స్ (Pudu Robotics) వారి D9. ఇది ఇప్పటికే ప్రీ-సేల్ కోసం అందుబాటులో ఉంది. కొనడానికి ఆసక్తి ఉన్నవారి నుంచి కంపెనీ ఎంక్వైరీలు కూడా స్వీకరిస్తోంది. D9లో "మల్టీమోడల్ AI" వాడారని, దీనివల్ల ఇది "మనుషుల స్థాయిలోనే" సంభాషించగలదని కంపెనీ వెల్లడించింది.
అంతేకాదు ఇది మాటలు గుర్తించడం, ఆదేశాలు పాటించడం, కచ్చితత్వంతో కదలడం వంటివి చేయగలదని కంపెనీ చెబుతోంది. నిర్మాణం, సామర్థ్యంలో ఇది టెస్లా ఆప్టిమస్‌ను పోలి ఉన్నప్పటికీ, D9 వాణిజ్యపరంగా విజయవంతమయ్యే మోడల్‌గా ప్రచారం చేయబడుతోంది. కాబట్టి, రోబోలను ముందుగా కొనాలనుకునేవారికి ఇది చాలా వాస్తవికమైన ఎంపిక కావచ్చు.
* యూనిట్రీ G1: ధర తక్కువే కానీ...
ఆన్‌లైన్‌లో తరచూ కనిపించే హ్యూమనాయిడ్ రోబోలలో యూనిట్రీ G1 (Unitree G1) ఒకటి. ఇది చేసే బ్యాక్‌ఫ్లిప్‌లు, చురుకైన విన్యాసాల వల్ల బాగా పాపులర్ అయింది. అయితే, దీన్ని ప్రధానంగా ఇంటి పనుల కోసం తయారుచేయలేదు. G1 తన మూడు వేళ్ల గ్రిప్పర్లతో వస్తువులను పట్టుకోగలదు, కదిలించగలదు.
కానీ, దీన్ని రిమోట్ కంట్రోల్‌తో లేదా ప్రోగ్రామింగ్ ద్వారా నడిపించాలి. దీని ప్రారంభ ధర 16,000 డాలర్లు (దాదాపు రూ.13 లక్షలు). ప్రస్తుతం కొనగలిగే హ్యూమనాయిడ్ రోబోలలో ఇది చాలా చవకైన వాటిలో ఒకటి. దీనికి పూర్తి స్వయంప్రతిపత్తి (సొంతంగా పనిచేయడం) లేకపోయినా, భవిష్యత్తులో వచ్చే వెర్షన్లు మరింత తెలివిగా మారి ఇంటి పనుల్లో సాయపడొచ్చు.
* ఇంటి రోబోల శకం మొదలవుతోందా..
మనిషిలాంటి రోబోలు ఇకపై సైన్స్ ఫిక్షన్ కథల్లోని ఊహలు కావు. అవి ఇంకా చాలా ఖరీదైనవే, వాటి సామర్థ్యాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. అయినా, కంపెనీలు చాలా వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. రాబోయే ఐదు సంవత్సరాలలో, బాగా ధనిక కుటుంబాల్లో ఇంటి పనులు చేసే రోబోలు కనిపించవచ్చు.
మరో పదేళ్లలో, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా వాటిని కొనగలిగే స్థాయికి రావచ్చు. పూర్తిగా సొంతంగా పనిచేసే రోబోలు మన ఇళ్లలో డిష్‌వాషర్ల లాగా సర్వసాధారణం అవ్వడానికి ఇంకా సమయం పట్టొచ్చు. కానీ, భవిష్యత్తు మనకు మరింత చేరువవుతోంది. అలసట లేని రోబో సహాయకుడు ఇంట్లో ఉండాలనే మన కల త్వరలోనే నిజం కావచ్చు.


Click it and Unblock the Notifications