సైబర్ దాడులకు గురవుతున్నఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్‌

Posted By: Super

సైబర్ దాడులకు గురవుతున్నఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్‌

న్యూయార్క్‌: గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సైబర్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అత్యాచార యత్నం ఆరోపణలపై సంస్థ అధిపతి డోమినిక్‌ స్ట్రాస్‌ కాన్‌ను అరెస్టు చేయడానికి కొన్ని నెలల ముందు నుంచే దాడులు జరుగుతున్నట్లు తాజాగా వెల్లడైంది. ఈ దాడి గురించి ఐఎంఎఫ్‌ డైరెక్టర్లకు ఇటీవల తెలియజేశారు. అయితే దీన్ని బహిర్గతం చేయలేదు. దీనిగురించి తెలుసుకున్న పలువురు అధికారులు మాట్లాడుతూ.. ఈ సైబర్‌ దాడి చాలా ఆధునికమైందని, తీవ్రమైందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించేందుకు ఐఎంఎఫ్‌ ప్రతినిధి డేవిడ్‌ హాలీ తిరస్కరించారు.

''ఓ ఘటనపై మేం దర్యాప్తు జరుపుతున్నాం. సంస్థ పూర్తిస్థాయిలో పనిచేస్తోంది'' అని ఆయన పేర్కొన్నారు. సంక్షోభాలకు చేరువలో ఉన్న కొన్ని దేశాలకు సంబంధించిన సున్నితమైన డేటా ఐఎంఎఫ్‌ వద్ద ఉంది. ఇందులో మార్కెట్‌ను పెనుమార్పులకు లోనుచేసే సమాచారంతోపాటు దేశాల నేతలతో జరిపిన సంభాషణలు, వారితో సాగించిన ఉత్తరప్రత్యుత్తరాలు ఉన్నాయి. చాలా దేశాల్లో ఈ సమాచారం రాజకీయ డైనమైట్‌లా పనిచేస్తుందని ఐఎంఎఫ్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే తాజా సైబర్‌ దాడుల్లో ఎలాంటి సమాచారాన్ని తస్కరించారన్నది తెలియరావడంలేదు.

ఈ ఘటనతో బెంబేలెత్తిన ప్రపంచ బ్యాంకు.. ఐఎంఎఫ్‌తో సమాచారాన్ని మార్పిడి చేసుకునే లింక్‌ను తెగతెంపులు చేసింది. ఏ దేశం నుంచి దాడి జరిగిందన్నది కూడా స్పష్టంకాలేదు. స్పియర్‌ ఫిషింగ్‌ అనే పద్ధతి ద్వారా సైబర్‌ దాడి జరిగిందని తెలుస్తోంది. ఇందులో ఒక అక్రమ వెబ్‌ లింక్‌ను పంపడం ద్వారా ఐఎంఎఫ్‌ అధికారిని బోల్తా కొట్టిస్తారు. దీన్ని క్లిక్‌ చేస్తే సదరుకంప్యూటర్‌లోని డేటా సైబర్‌ నేరగాళ్లకు చేరుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot