బ్రెయిన్‌ క్యాన్సర్‌ కావాలా ఐతే సెల్‌ఫోన్‌ వాడాల్సిందే

Posted By: Staff

బ్రెయిన్‌ క్యాన్సర్‌ కావాలా ఐతే సెల్‌ఫోన్‌ వాడాల్సిందే

పారిస్‌: అదేపనిగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇవి కొన్ని రకాల మెదడు క్యాన్సర్ల ముప్పును పెంచే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. ఫ్రాన్స్‌లోని లియోన్‌లో జరిగిన సమావేశంలో ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) తమ పరిశోధన ఫలితాలను ప్రకటించింది. ఈ పరిశోధనలో 14 దేశాల నుంచి 31 మంది శాస్త్రవేత్తలు పాలు పంచుకున్నారు. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌, బ్రెయిన్‌ ట్యూమర్లకు గల సంబంధంపై ఇప్పటివరకు అందుబాటులో గల శాస్త్రీయ సమాచారాన్ని ఏఐఆర్‌సీ సమీక్షించింది.

సెల్‌ఫోన్‌ను.. డీడీటీ పురుగుమందు, వాహనాల నుంచి వెలువడే పెట్రోలు పొగ వంటి క్యాన్సర్‌ కారకాల (2బీ) విభాగంలో చేర్చింది. ''సెల్‌ఫోన్లతో ఎంతోకొంత ముప్పు పొంచి ఉన్నట్టు తేలింది. కాబట్టి క్యాన్సర్లు, సెల్‌ఫోన్లకు గల సంబంధంపై నిశితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది'' అని ఏఐఆర్‌సీ అధ్యక్షుడు జోనాథన్‌ సామెట్‌ అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్లతో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉండొచ్చని మాత్రమే వెల్లడైంది గానీ.. అదింకా నిర్ధారణ కాలేదన్న విషయాన్ని గుర్తించాలనీ ఏఐఆర్‌సీ పేర్కొంది. అంతేకాకుండా మొబైల్ ఫోన్స్ వాడుతున్నటువంటి వారు ఈ క్రింది సూచనలు పాటిస్తే కొంత వరకు కాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చునని వారు సూచించారు.

హెడ్‌సెట్‌ వాడడం

రేడియేషన్‌ ప్రభావం నుంచి మెదడును రక్షించుకోవటానికి ఇది చాలా తేలికైన మార్గం. ఇది ఫోన్‌ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్‌ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.

మెసేజ్‌లు పంపడం

వీలైనప్పుడల్లా లిఖిత సందేశాలు పంపటమూ మంచిదే. ఈ సమయంలో సెల్‌ఫోన్‌ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్‌ ప్రభావమూ దానిపై పడదు.

అలారం గడియారంలా వద్దు

మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్‌ నుంచి రేడియేషన్‌ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది. దీంతో సెల్‌ఫోన్‌ విద్యుదస్కాంత క్షేత్ర ప్రభావం నుంచి మెదడును కాపాడుకోవచ్చు.

జేబులో మొబైల్ పెట్టుకోవద్దు

సెల్‌ఫోన్‌ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని కొందరు వైద్యుల అభిప్రాయం. ఇది ఆడవారిలో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్నీ తెచ్చిపెట్టొచ్చనీ వివరిస్తున్నారు. కాబట్టి వీలైనప్పుడల్లా సెల్‌ఫోన్‌ని దూరంగా ఉంచటం మేలు. బయటకు వెళ్లినపుడు ప్యాంటు, చొక్కా జేబుల్లో కన్నా సంచీలో వేసుకోవటం మంచిది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot