భారత్‌లో పాపులర్ అవుతున్న మట్టి కుండ కూలర్లు.. తక్కువ ఖర్చుతో వేసవి తాపం నుంచి ఉపశమనం..!
Mud Pot Air Coolers : భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో ఉపశమనం కోసం ఒక చవకైన, పర్యావరణానికి మేలు చేసే కూలింగ్ ఆప్షన్ బాగా పాపులర్ అవుతోంది. అదే మట్టి కుండ కూలర్ (Mud Pot Air Cooler). గతంలో కేవలం మంచినీళ్లు చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగించిన మట్టి కుండలు, ఇప్పుడు వినూత్నంగా రూపాంతరం చెందాయి.
ఖరీదైన ఏసీలు లేదా ఎలక్ట్రిక్ కూలర్లు కొనలేని వారికి, ఇవి తక్కువ ఖర్చుతోనే వేడి నుంచి ఉపశమనం అందించే అద్భుతమైన పరికరాలుగా మారుతున్నాయి. మట్టి కుండలు ఎందుకంత స్పెషల్? ఇవి ఎలా పనిచేస్తాయ్, వీటి ధర ఎంత వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* ఇవి ఎలా పనిచేస్తాయి..?
మట్టి కుండలకు చిన్న చిన్న రంధ్రాలు (Porous) ఉంటాయి. దీనివల్ల లోపల ఉన్న నీరు నెమ్మదిగా కుండ గోడల ద్వారా బయటకు వచ్చి ఆవిరవుతుంది. ఈ ప్రక్రియ గాలిలోని వేడిని లాగేసి, గాలిని సహజంగా చల్లబరుస్తుంది. మనం కుండలో నీళ్లు పోస్తే ఫ్రిజ్‌లో పెట్టకపోయినా చల్లగా ఉండటానికి కారణం ఇదే.
మట్టి కుండ కూలర్లు కూడా ఇదే సూత్రంపై పనిచేస్తాయి. వీటిని చేతులతో తయారుచేస్తారు. లోపల నీళ్లు పోయడానికి ఖాళీ స్థలం ఉంటుంది. పైన ఒక చిన్న ఎలక్ట్రిక్ ఫ్యాన్ పెడతారు. ఈ ఫ్యాన్ గాలిని కుండ లోపలికి పంపిస్తుంది. ఆ గాలి, ఆవిరవుతున్న నీటిని, చల్లని కుండ ఉపరితలాన్ని తాకుతూ బయటకు వచ్చినప్పుడు, అది చాలా చల్లగా మారుతుంది.
* ఇంకా చల్లదనం కోసం చిన్న చిట్కా..
కొంతమంది అమ్మకందారులు ఇంకా ఎక్కువ కూలింగ్ కోసం కుండ చుట్టూ తడి గుడ్డ చుట్టమని కూడా సలహా ఇస్తున్నారు. ఈ అదనపు తేమ వల్ల నీరు ఇంకా వేగంగా ఆవిరై, గాలి ఉష్ణోగ్రత మరింత తగ్గుతుంది.
* చాలా తక్కువ ధర, ఎక్కువ ప్రయోజనం
ఈ మట్టి కూలర్ల పాపులారిటీకి అతి పెద్ద కారణం వాటి ధర. ఎయిర్ కండీషనర్ (AC) కొనాలంటే కనీసం రూ.25,000 పైనే ఖర్చవుతుంది. మామూలు ఎలక్ట్రిక్ కూలర్లు కూడా రూ.6,000 నుంచి మొదలవుతాయి. కానీ ఈ మట్టి కుండ కూలర్లు కేవలం రూ.2,000 నుంచి రూ.6,000 మధ్య ధరల్లోనే దొరుకుతున్నాయి.
ఒకే ఫ్యాన్ ఉన్న మోడల్ (Single-fan version) వ్యక్తిగత అవసరాలకు లేదా చిన్న గదులకు సరిపోతుంది, దీని ధర కేవలం రూ.2,600 మాత్రమే. రెండు ఫ్యాన్లు ఉన్న మోడల్ (Double-fan model) కాస్త ఎక్కువ కూలింగ్ ఇస్తుంది, దీని ధర రూ.3,900.
ఇంకా పెద్ద గదుల కోసం జంబో వెర్షన్ (Jumbo version) కూడా ఉంది, దీని ధర సుమారు రూ.6,000. వీటికి కరెంటు కూడా చాలా తక్కువ కాలుతుంది, ఎందుకంటే కేవలం చిన్న ఫ్యాన్ తిరగడానికే పవర్ అవసరం. అందుకే ఇవి ఇళ్లకు, చిన్న షాపులకు, వ్యాపారాలకు ఉపయోగపడతాయి.
* చేతివృత్తుల వారికి చేయూత, పర్యావరణానికి మేలు
ఈ కొత్త ట్రెండ్ వల్ల సంప్రదాయ కుమ్మరులకు (Potters) కూడా మంచి జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులోని చిన్న కుమ్మరులు ఈ కూలర్లను చేతులతో తయారుచేసి పల్లెల్లో, పట్టణాల్లో అమ్ముతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఇది వారి నైపుణ్యానికి కొత్త ఊతమివ్వడమే కాక, వారికి ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా మారింది. కేవలం నీళ్లు నిల్వ చేసే కుండలే కాదు, ఇప్పుడు ఏకంగా ఇళ్లను, షాపులను చల్లబరిచే పరికరాలను తయారు చేస్తున్నారు. అదీ సహజసిద్ధంగా, వాటికి ఫుల్ గిరాకీ ఉంటోంది.
* వాడకం సులభం, పర్యావరణానికి భారం కాదు
చాలా మంది వినియోగదారులు, ముఖ్యంగా పొడిగా, వేడిగా ఉండే ప్రాంతాల్లో, ఈ కూలర్లతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇవి ఏసీల లాగా గది ఉష్ణోగ్రతను పూర్తిగా తగ్గించకపోయినా, ఉన్నంతలో గదిని చల్లగా, హాయిగా మారుస్తాయి. వీటిని వాడటం చాలా సులభం, పెద్దగా శబ్దం రాదు.
గోడకు బిగించాల్సిన (Installation) అవసరం లేదు. సహజమైన మట్టితో తయారుచేయడం వల్ల, ఇవి పూర్తిగా భూమిలో కలిసిపోతాయి (Biodegradable). ప్లాస్టిక్ పరికరాల వలె కీడు చేయవు. తక్కువ కరెంటు వాడకం వల్ల బిల్లు తగ్గుతుంది, పర్యావరణానికి హాని చేసే గ్రీన్ హౌస్ వాయువులు విడుదల కావు.
* దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ
మట్టి కుండ కూలర్లు ఇప్పుడు కేవలం పల్లెటూళ్లకే పరిమితం కాలేదు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో కూడా కుటుంబాలు కరెంటు ఆదా చేయడానికి ఏసీలతో పాటు వీటిని వాడుతున్నాయి. చిన్న దుకాణదారులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసేవాళ్లు మధ్యాహ్నం పూట ఎండ వేడిమి నుంచి తమ షాపులను, కస్టమర్లను కాపాడుకోవడానికి వీటిపై ఆధారపడుతున్నారు.
* సోషల్ మీడియాలో వైరల్, లభ్యత మాటేమిటి..?
ప్రస్తుతం స్థానిక కుమ్మరులు, రోడ్డు పక్కన అమ్మేవారి దగ్గరే ఇవి ఎక్కువగా దొరుకుతున్నాయి. కానీ నెమ్మదిగా ఆన్‌లైన్ మార్కెట్లలోకి (Online Marketplaces) కూడా వస్తున్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయో, వీటిని ఇంకా మెరుగ్గా ఎలా వాడుకోవచ్చో చూపిస్తూ చిన్న చిన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో వీటిపై ఆసక్తి ఇంకా పెరుగుతోంది.
అయితే, కుండల తయారీ సంప్రదాయం బలంగా లేని ప్రాంతాల్లో వీటి లభ్యత (Availability) ఇంకా తక్కువగానే ఉంది. కానీ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, త్వరలోనే మరిన్ని చోట్ల, మరింత మంది అమ్మకందారులు వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. దాంతో పేదవారికి కూడా వేసవి నుంచి ఉపశమనం లభిస్తుంది.
* వేసవిలో ఓ సరికొత్త చల్లని మార్పు
మట్టి కుండ కూలర్లు ఆధునిక ఏసీలను పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు. కానీ, అధిక ఖర్చు లేకుండా, పర్యావరణానికి హాని చేయకుండా చల్లదనాన్ని కోరుకునే వారికి ఇవి ఒక తెలివైన, మధ్యస్థ మార్గాన్ని చూపిస్తున్నాయి. ఖర్చు తక్కువ, ఉపయోగం ఎక్కువ, భూమికి భారం కాదు. ఇలా సంప్రదాయానికి ఒక సరికొత్త కూల్ టచ్ ఇస్తూ, ఈ మట్టి కుండ కూలర్లు వేసవిలో ఉపశమనం కోసం అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తున్నాయి.


Click it and Unblock the Notifications