రైలు ప్రయాణికులకు శుభవార్త.. నిజంగా ఎగిరి గంతేస్తారు!
IRCTC Rules : భారతీయ రైల్వే ఇటీవల సాధారణ ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన సహా, అదనపు రైళ్లు, హాల్ట్‌ల ప్రకటనలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో ఇటీవల సమూల మార్పులు చేశారు. గతంలో ఏజెంట్లు, మధ్యవర్తుల కారణంగా అవసరం అయిన వారికి రైలు టికెట్లు అందుబాటులో ఉండేవి కాదు. ఈ సమస్యకు రైల్వే బోర్డు చెక్ పెట్టింది.
నకిలీ ఐడీలను డిలీట్ చేయడంతోపాటు తత్కాల్ సహా సాధారణ టికెట్ల బుకింగ్‌కు (Indian Railways) ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్‌తో అనుసంధానం చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ను ఎంటర్ చేశాకే, టికెట్ బుకింగ్ అయ్యేలా మార్పులు చేసింది. దీంతోపాటు ఏజెంట్ల బుకింగ్ సమయాల్లో మార్పులు చేసింది.

రైల్వే మంత్రి కీలక ప్రకటన :
తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వివరాలను వెల్లడించారు. IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసిన టికెట్లను (Confirmed Tickets only) ఇతర తేదీలకు మార్చుకొనే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఎలాంటి విధానం ఉందంటే :
ప్రస్తుతం మీరు బుకింగ్ చేసుకున్న తేదీలో కాకుండా, ఇతర తేదీల్లో ప్రయాణం చేయాల్సి వస్తే.. ముందుగా మీ దగ్గర ఉన్న టికెట్‌ను రద్దు చేసుకొని, కొత్త తేదీతో మరో టికెట్‌ను బుకింగ్ చేసుకుంటున్నారు. క్యాన్సిలేషన్ ఛార్జీలను కూడా చెల్లించాల్సి వస్తోంది.
కొత్త నిబంధన అమల్లోకి వస్తే :
అయితే కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించిన వివరాల ఆధారంగా.. ఆన్‌లైన్ ద్వారా రైలు టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు.. వాటిని రద్దు చేయకుండానే ఇతర తేదీలకు మార్చుకొనే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కన్ఫర్మ్ అయిన టికెట్లకే ఈ సౌకర్యం వర్తిస్తుంది.

ప్రయాణికులు కోరుకున్న తేదీల్లో టికెట్లు అందుబాటులో ఉంటేనే, మార్చుకొనేందుకు (Reschedule) అవకాశం ఉంటుంది. టికెట్ ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటే ప్రయాణికులు అదనపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ముందుగా బుకింగ్ చేసుకున్న టికెట్ ధర రూ.430 ఉంది అనుకోండి. మీరు మార్చుకోవాలనుకున్న తేదీలో టికెట్ ఛార్జీ రూ.500 ఉంటే.. ఈ మధ్య వ్యత్యాసం రూ.70 ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది.
* అక్టోబర్ 1 వ తేదీ నుంచి రైల్వే ఓ కొత్త నిబంధనను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ అథెంటికేషన్ నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. బుకింగ్ ప్రారంభం అయిన తొలి 15 నిమిషాల వరకు ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసిన IRCTC యూజర్లు మాత్రమే టికెట్లను బుకింగ్ చేసుకొనేందుకు వీలుంటుంది.
ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయని యూజర్లు తొలి 15 నిమిషాలు టికెట్లు బుకింగ్ చేయలేరు. IRCTC యాప్, వెబ్‌సైట్ నుంచి బుకింగ్ చేసుకొనే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. రైలు టికెట్లు బుకింగ్ ముందస్తు గడువు ప్రస్తుతం 60 రోజులుగా ఉంది. గతంలో ఈ గడవు 120 రోజులుగా ఉండేది.


Click it and Unblock the Notifications








