రైల్వే షాకింగ్ నిర్ణయం.. ఇక వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు..!
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఒకటిగా ఉన్న ఇండియన్ రైల్వే (Indian Railway Waiting List Ticket) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం మే 1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రైల్వే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతోంది.
తాజాగా తీసుకున్న నిర్ణయం ఆధారంగా రైల్వే స్లీపర్ క్లాస్, AC లో వెయిటింగ్ లిస్ట్ టికెట్ కలిగి ఉన్న ప్రయాణికులు ఆయా కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు అవకాశం లేదు. ఇలా ప్రయాణం చేస్తే అధికారులకు చిక్కితే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మే 1 2025 నుంచి ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది.

గతంలో : రైల్వే టికెట్ల కోసం ఆన్‌లైన్ లేదా రైల్వే టికెట్ కౌంటర్ నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్ టికెట్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే.. స్లీపర్, AC కోచ్‌లతో ప్రయాణం చేసేందుకు అవకాశం లేదు. ఆయా టికెట్లు ఆటోమేటిక్‌గా క్యాన్సి్ల్ అవుతాయి. అయితే రైల్వే కౌంటర్‌లో తీసుకున్న టికెట్లతో వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నా ప్రయాణం చేయవచ్చు. అయితే వారికి ఆయా కోచ్‌లలో ఎటువంటి బెర్త్ ఉండదు.
కొత్త నిర్ణయం : అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన నిర్ణయం ఆధారంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు.. AC, స్లీపర్ క్లాస్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు వీలు లేదు. వారు జనరల్ బోగీల్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో AC, స్లీపర్ కోచ్‌లో ప్రయాణం చేస్తూ టికెట్ ఎగ్జామినర్‌కు పట్టుబడితే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
స్లీపర్ క్లాస్‌లో ప్రయాణం చేస్తూ పట్టుబడితే రూ.250 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే AC లో వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్రయాణం చేస్తూ పట్టుబడితే రూ.440 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే జరిమానా.. ప్రయాణికులు రైలు ఎక్కిన స్టేషన్ నుంచి తర్వాత వచ్చే స్టేషన్ వరకు మాత్రమే వర్తిస్తుంది.

జరిమానా చెల్లించిన తర్వాత వచ్చే స్టేషన్‌లో జనరల్ కోచ్‌కు మారాల్సి ఉంటుంది. TTE లకు ఇప్పటికే పూర్తి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్ కలిగిన ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాలని భావిస్తున్న వారికి ఈ నిర్ణయం ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది.
* గతంలో 120 వరకు రైల్వే టికెట్లను ముందస్తుగా బుకింగ్ చేసే అవకాశం ఉండేది. గత సంవత్సరం నవంబర్ నుంచి ఈ వ్యవధిని కుదించారు. ప్రస్తుతం 60 రోజుల ముందు వరకు మాత్రమే ముందస్తుగా రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
* ఇటీవలే ఇండియన్ రైల్వే స్వరైల్ పేరుతో సూపర్ యాప్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. అన్ని రకాల టికెట్ల బుకింగ్‌తోపాటు రైల్వేలో ఫిర్యాదులు, ఫుడ్, ట్రైయిన్ ట్రాకింగ్ వంటి అన్నింటినీ ఆ యాప్ ద్వారానే చేసేందుకు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








