శాటిలైట్ ఇంటర్నెట్: ఎయిర్‌టెల్ దూకుడుతో మస్క్‌కు షాక్.. త్వరలో ప్రతి పల్లెలోనూ చౌక ధరలకే ఇంటర్?
భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ రంగం వేడెక్కుతోంది. ఎయిర్‌టెల్ సంస్థ ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ ఛైర్మన్ రాజన్ భారతి మిట్టల్ ఇటీవల తమ శాటిలైట్ టెలికాం సర్వీస్ లాంచ్ కావడానికి రెడీగా ఉందని ప్రకటించారు. గుజరాత్, తమిళనాడులలో రెండు బేస్ స్టేషన్లతో సహా అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతి లభిస్తే చాలు, సేవలు మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

* గ్లోబల్ ప్లేయర్స్‌తో పోటీ
ఎయిర్‌టెల్ సంస్థ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్, అమెజాన్ ప్రాజెక్ట్ కుయిపర్ వంటి గ్లోబల్ కంపెనీలతో పోటీ పడనుంది. అంతేకాకుండా, దేశీయంగా రిలయన్స్ జియో కూడా ఈ రేసులో ఉంది. ఇప్పటికే ఎయిర్‌టెల్ 635 శాటిలైట్స్ ప్రయోగించింది.
ఎయిర్‌టెల్ ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్లో శాటిలైట్ సర్వీసులు అందిస్తోంది. ఇప్పుడు భారతదేశంలో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని చూస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు అందుబాటు ధరల్లో ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని మిట్టల్ నొక్కి చెప్పారు.
* స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం ఎదురుచూపులు
ఎయిర్‌టెల్ తన సేవలను ప్రారంభించడానికి ముందు స్పెక్ట్రమ్ కేటాయింపు (Spectrum allocation) అనేది ఒక ముఖ్యమైన అడ్డంకి. శాటిలైట్ ఇంటర్నెట్ కోసం స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియను, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది.
టెలికాం సంస్థలు లైసెన్స్ ఫీజులు చెల్లించి వేలం ద్వారా స్పెక్ట్రమ్ పొందినట్లే, శాటిలైట్ సంస్థలు కూడా అదే విధంగా చెల్లించాలని మిట్టల్ పేర్కొన్నారు.
* నెట్ అందని ప్రాంతాలకు వరం..
సాధారణ నెట్‌వర్క్స్ చేరుకోలేని గ్రామీణ, సముద్ర, రక్షణ రంగాలలో శాటిలైట్ సేవలు చాలా ఉపయోగకరమని మిట్టల్ అన్నారు. వేలం ద్వారా స్పెక్ట్రమ్ కేటాయింపును అతను సమర్థిస్తున్నారు.
అయితే మారుమూల ప్రాంతాలకు అందించే శాటిలైట్ సేవలకు వేరే ధరలు, నియంత్రణలు ఉండాలని ఆయన సూచించారు. దీనివల్ల సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని అభిప్రాయపడ్డారు.
* శాటిలైట్ ఇంటర్నెట్‌లో పోటీ
ఎయిర్‌టెల్ సంస్థ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్, అమెజాన్ ప్రాజెక్ట్ కుయిపర్ (Project Kuiper) వంటి అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడనుంది. స్టార్‌లింక్ కోరినట్లు భారత ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయించాలని నిర్ణయించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంటే త్వరలోనే స్టార్ లింక్ ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండొచ్చు అని అంటున్నారు.
ఇక, దేశీయంగా రిలయన్స్ జియో సైతం ఈ రేసులో ఉంది. అయితే, స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
* వేలం కావాలంటున్న జియో, ఎయిర్‌టెల్
రిలయన్స్ జియో అధినేత ఆకాష్ అంబానీ, ఎయిర్‌టెల్ మాదిరిగానే, శాటిలైట్ సేవలకు వేలం ద్వారా స్పెక్ట్రమ్ కేటాయించాలని కోరుతున్నారు. అయితే స్టార్‌లింక్, ప్రాజెక్ట్ కుయిపర్ మాత్రం వేలం లేకుండా పరిపాలనాపరమైన కేటాయింపు (Administrative allocation)ను కోరుతున్నాయి.
* గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో అందుబాటు ధరలు
ఎయిర్‌టెల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఉంటాయని మిట్టల్ హామీ ఇచ్చారు. భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లో 4G, 5G నెట్‌వర్క్స్ బలంగా ఉన్నాయని, అక్కడ శాటిలైట్ సర్వీసులు అంతగా అవసరం లేదని ఆయన అన్నారు.
సాధారణ నెట్‌వర్క్స్ లేని ప్రాంతాల్లో విశ్వసనీయమైన బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడమే లక్ష్యంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తామని తెలిపారు.
* త్వరలో సేవలు ప్రారంభం
ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఎయిర్‌టెల్ తన సేవలను ప్రారంభిస్తుంది. తక్కువ ధరలకు ఇంటర్నెట్ సర్వీసులు అందించి స్టార్‌లింక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. స్టార్‌లింక్ అధిక ధరల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ చౌక ధరలకే సేవలు అందిస్తానని చెప్పడం విశేషం.


Click it and Unblock the Notifications








