ఆ కంపెనీ కొనుగోలుతో ఇన్పోసిస్ చరిత్రలో కొత్త నాంది

Posted By: Staff

ఆ కంపెనీ కొనుగోలుతో ఇన్పోసిస్ చరిత్రలో కొత్త నాంది

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవలనందిస్తున్న దేశంలోనే రెండో పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ ఓ అమెరికన్ కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 45-50 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు అంచనా. టార్గెట్ కంపెనీ పబ్లిక్ సర్వీసులు, హెల్త్‌కేర్ విభాగంలో కార్యకలాపాలను కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇటీవల కొంతకాలంగా ఇన్ఫోసిస్‌పై మార్కెట్ వర్గాలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కంపెనీ చేతిలో భారీగా నగదు నిల్వలుండటమే దీనికి కారణం. కంపెనీ వీటిని ఎలా వినియోగిస్తుందన్న ఆసక్తి ఇటు విశ్లేషకుల్లోనూ, అటు ఇన్వెస్టర్లలోనూ నెలకొని ఉంది. అయితే అమెరికన్ కంపెనీ కొనుగోలుపై ఇన్ఫోసిస్ పెదవి విప్పనప్పటికీ డీల్ దాదాపు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి నెలకొల్పిన ప్రమాణాలను పాటిస్తూ ఇన్ఫోసిస్‌ను సరికొత్త బాటలో నడిపేందుకు సిద్ధమని చైర్మన్‌గా పదవి చేపట్టిన కేవీ కామత్ గత నెలలో ప్రకటించారు. ఈ బాటలో ఇతర కంపెనీల కొనుగోళ్లు, వ్యూహాల్లో మార్పులు తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు.

ఇన్పోసిస్ కొనుగోలు చేయనున్న కంపెనీ ఆదాయం 30-50 కోట్ల డాలర్ల మధ్య ఉండొచ్చునని తెలిపాయి. ఈ కొనుగోలు ఇన్ఫోసిస్ వృద్ధికి అత్యంత వ్యూహాత్మకంగా పనిచేయనుంది. కాగ్నిజెంట్ వంటి ప్రత్యర్థి కంపెనీలు పబ్లిక్ సర్వీసుల విభాగంలో పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ కొనుగోలు పూర్తయితే ఇన్ఫోసిస్ చరిత్రలోనే అతి పెద్ద కొనుగోలుగా నిలవనుంది. గతంలో మెక్‌కానిష్ వంటి కంపెనీలను సొంతం చేసుకున్నప్పటికీ అవన్నీ 50 కోట్ల డాలర్లలోపువే. ఇంతక్రితం యాక్సాన్‌ను కొనేందుకు ఇన్ఫోసిస్ భారీ స్థాయిలో బిడ్ వేసినప్పటికీ, చివరికి హెచ్‌సీఎల్ తన్నుకుపోయిన విషయం అందరికి తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot