గుజరాత్ ఇన్పోసిస్ క్యాంపస్‌‍కు 'భూమే' ప్రధాన సమస్య

Posted By: Staff

గుజరాత్ ఇన్పోసిస్ క్యాంపస్‌‍కు 'భూమే' ప్రధాన సమస్య

అహ్మదాబాద్‌: దేశంలోని టాప్‌ ఐటి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ను తమ రాష్ట్రంలోకి ఆహ్వానించాలని గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తున్నా ముడి పడడం లేదు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే గుజరాత్‌లో నిర్మాణ రంగంలో మార్కెట్‌ ధరలు ఆకాశాన్ని తాకుతుండడమే దీనికి కారణం. తాజాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం 41 ఎకరాల భూమిని మెగా ఇండస్ట్రియల్‌ పాలసీలో భాగంగా ఇన్ఫోసిస్‌కు ఇచ్చేందుకు సిద్ధమైనా, ఆ భూమికి సర్కారు నిర్ణయించిన ధర చాలా ఎక్కువగా ఉందని ఇన్ఫోసిస్‌ అభిప్రాయపడింది.

ఇదే విషయాన్ని గుజరాత్‌ సెక్రటేరియేట్‌కు వివరిస్తూ, తక్కువ ధరకు భూమిని ఇస్తే తాము కార్యాలయాన్ని ప్రారంభించేందుకు యోచిస్తామని తెలిపింది. ఇప్పటికే తాము గుజరాత్‌ ప్రభుత్వానికి మనసులోని మాటను వెల్లడించామని, వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. గతంలో సత్యం కంప్యూటర్స్‌కు ఇచ్చి ఆ తరువాత వెనక్కు తీసుకున్న భూమితో పాటు జిఐడిసి ఎలక్ట్రానిక్స్‌ ఎస్టేట్‌లో ఉన్న ఖాళీ స్థలాన్ని ఇన్ఫోసిస్‌ పరిశీలించిందని, ఈ రెండింటిలో ఏదో ఒక చోట సంస్థ కేంద్రం ప్రారంభమవుతుందని భావిస్తున్నామని గుజరాత్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థికమండలిని అభివృద్ధి చేయాలని ఇన్ఫీ భావిస్తోందని, బిపిఒ క్యాంపస్‌తో పాటు డెవలపింగ్‌ సెంటర్‌నూ ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోందని వివరించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting