భారత్‌లో పాగా కోసం అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్స్ మల్లగుల్లాలు

Posted By: Staff

భారత్‌లో పాగా కోసం అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్స్ మల్లగుల్లాలు

అంతర్జాతీయ ఫ్యాషన్ దిగ్గజాల కన్ను భారత్‌పై పడింది. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కానీ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లు మాత్రం భారత్‌లో పాగా కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బ్రిటిష్ దిగ్గజం జాక్ విల్స్, ఇటలీకి చెందిన రైఫిల్ జీన్స్, అమెరికాకు చెందిన మైకేల్ కోర్స్, ఇంకా డజనుకుపైగా అంతర్జాతీయ ఫ్యాషన్ దిగ్గజాలు భారత మార్కెట్‌ను కొల్లగొట్టడానికి తమ వంతు కసరత్తు చేస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల్లో అవి స్టోర్స్‌ను తెరవనున్నాయి. భారత భాగస్వాములతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు చర్చలు జరుపుతున్నాయని, కొన్ని డీల్స్ దాదాపు ఖరారయ్యే స్థాయిలోనే ఉన్నాయని న్యాయ సేవల సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు. రిలయన్స్ రిటైల్, షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్, ఫ్యూచర్ బ్రాండ్ సంస్థలు విదేశీ దిగ్గజ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాయని సమాచారం.

ప్రస్తుత నిబంధనల ప్రకారం సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో 51 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ఇక మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలోకి ఎలాంటి ఎఫ్‌డీఐలను అనుమతించరు. అయితే ఈ ఫ్యాషన్ కంపెనీలు లెసైన్సింగ్ రూట్‌ను ఎంచుకుంటున్నాయి. ఈ విధానం కింద ఈ సంస్థల స్థానిక భాగస్వాముల ద్వారా బ్రాండింగ్, మార్కెటింగ్, విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టవచ్చు. దేశీయ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడానికి, ప్రస్తుతమున్న భాగస్వాములను మార్చుకోవడానికి, కొత్తగా మరికొంత మందిని చేర్చుకోవడానికి లెసైన్సింగ్ విధానం వీలు కల్పిస్తోందని ఒక రిటైల్ నిపుణుడు వివరించారు.

భారత్‌లో లగ్జరీ బ్రాండ్ బట్టల మార్కెట్ విలువ రూ.2,000 కోట్లని అంచనా. ఇది సంఘటిత బ్రాండెడ్ గార్మెంట్స్ మార్కెట్లో 10 శాతానికి సమానం. ఇది ఏటికేడాది 30 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. తమ తమ దేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఈ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. భారత్‌ది పెద్ద మార్కెట్ అని, అవకాశాలు అపారమని, ఈ సదవకాశాన్ని వదులుకోకూడదని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి.

ఇక ఇప్పటికే భారత్‌లో విక్రయాలు జరుపుతున్న విదేశీ కంపెనీలు తమ భాగస్వాముల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. 2006లో భారత్‌లోకి ప్రవేశించిన రైఫిల్ జీన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఈ కంపెనీ తన స్థానిక భాగస్వామిని మార్చుకోవాలని చూస్తోంది. కాల్విన్ క్లెయిన్, డీకేఎన్‌వై, హ్యుగో బాస్, గ్యాస్, మ్యాంగో, బ్రియోని, ఇంకా ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. డీజిల్, మిస్ సిక్స్‌టీ కంపెనీలు ఇప్పటికే తమ భాగస్వాములను మార్చుకున్నాయి. డీజిల్ అర్వింద్‌తో తెగదెంపులు చేసుకొని రిలయన్స్ బ్రాండ్స్‌తో జత కట్టగా, మిస్ సిక్స్‌టీ రిలయన్స్‌తో తెగదెంపులు చేసుకొని అర్వింద్‌తో జట్టు కట్టింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot