వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ సృష్టికర్త బెర్నర్స్‌ లీ వెబ్ గురించి ఏమన్నారంటే...

Posted By: Staff

వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ సృష్టికర్త బెర్నర్స్‌ లీ వెబ్ గురించి ఏమన్నారంటే...

నేను కలగన్న వెబ్‌ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. ఇప్పడున్న దానికంటే భవిష్యత్తులో మరిన్ని కొత్త అంశాలు, అధిక వేగంతో వెబ్‌ ఉంటుంది' అని వెబ్‌ ఆవిష్కర్త సర్‌ టిమ్‌ బెర్నర్స్‌ లీ పేర్కొన్నారు. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను కనుగొన్న ఆయన వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ కన్సార్టియం డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మాదాపూర్‌లోని హైదరాబాద్‌ అంతర్జాతీయ ప్రదర్శనా కేంద్రం (హెచ్‌ఐసీసీ)లో జరుగుతున్న వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ 2011 సదస్సులో పాల్గొంటున్న టిమ్‌ గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆయా అంశాలపై ఆయన ఏమన్నారంటే..

ఇంటర్‌నెట్‌ వల్ల సామాజిక మార్పు సాధ్యం. అందరినీ కనెక్ట్‌ చేయడానికి నెట్‌ మంచి ఉపకరణం. ఇంటర్‌నెట్‌కు అనుసంధానం కావడం అనేది అందరి హక్కు. ఫిన్‌లాండ్‌ ఇప్పటికే మానవ హక్కుగా గుర్తించింది కూడా. ఈజిప్ట్‌లో ఆందోళనల సందర్భంలో ఆ దేశమంతటా నెట్‌ సర్వీసులు నిలిచిపోయాయి. దేశ అంతర్గత పరిస్థితులు ప్రపంచానికి తెలియకూడదన్న ఆలోచనలతో దేశాధ్యక్షుడి అనుచరులు మొత్తం నెట్‌ వ్యవస్థను స్తంభింప చేశారు. ఇలా ఎవరూ చేయకుండా అంతర్జాతీయ పర్యవేక్షణ అవసరం. ఐక్యరాజ్య సమితి, ఇతర సంస్థలు కీలకపాత్ర పోషించాలి. ఆయా దేశాల భాగస్వామ్యంలో ఇది ఏర్పడుతుందని భావిస్తున్నా.

ఇంటర్‌నెట్‌ వినియోగంలో వ్యక్తిగత, డేటా వివరాలకు భద్రత అత్యంత అవసరం. అనైతిక కార్యకలాపాలకు వెబ్‌ను వినియోగించకుండా నిరోధించడానికి ప్రతి దేశం తమ చట్టాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న వికీలీక్స్‌ మంచి నిఘా నేత్రమే. రాబోయే 5 ఏళ్లలో నెట్‌ వినియోగదారుల సంఖ్యతో పాటు వేగం కూడా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. 3జీ, 4జీ పరిజ్ఞానంతో గ్రామీణులూ వెబ్‌ వినియోగిస్తారు. మొబైల్‌ ద్వారా నెట్‌ వినియోగం భారీ మార్పులు తెస్తుంది. మరెన్నో కొత్త ఫీచర్లు జత చేరతాయి. ఉన్నత విద్యా పాఠశాలలు, యూనివర్సిటీల్లోని విద్యార్థులకు నెట్‌ అందుబాటులోకి వస్తే నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది.

ఆకర్షించే ఫీచర్స్‌, అధిక కంటెంట్‌ (విషయం)ను అందిస్తేనే వెబ్‌సైట్‌కు ఆదరణ లభిస్తుంది. ఎప్పటికప్పుడు నవీకరణం చేస్తేనే అగ్రస్థాయి లభిస్తుంది. వినియోగదారులు ఎక్కువైతే సైట్‌ ఓపెన్‌ కావడం ఆలస్యమై, మళ్లీ వేరే సైట్‌కు మొగ్గుచూపుతారు. పారదర్శకత ముఖ్యం: ఇంటర్‌నెట్‌ ప్రొవైడర్లు అన్ని వెబ్‌సైట్‌లు సమాన వేగంతో బ్రౌజ్‌ చేయగలిగే అవకాశం కల్పించాలి. ఒక్కో వెబ్‌సైట్‌ అధిక వేగంతో మరికొన్ని నెమ్మదిగా ఓపెన్‌ అవ్వడం వల్ల వినియోగించేవారి సంఖ్య మారిపోతుంది. నైతికతపై ప్రసార మాధ్యమాలు కూడా కన్నేసి, పారదర్శకతకు ప్రయత్నించాలి. మహిళలు స్వేచ్ఛగా బయటకు వెళ్లి చదవలేని పరిస్థితులు ఉన్న చోట, ఇంటిలో నుంచే అభ్యసించేందుకు ఆన్‌లైన్‌ కోర్సులు ఉపకరిస్తున్నాయి. వెబ్‌ను గ్రామీణులకు చేరువ చేసేందుకు వెబ్‌ కమ్యూనిటీ కృషి చేయాలి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting