Inverter Vs Non Inverter AC : ఏసీని కొనుగోలు చేస్తున్నారా.. ఇన్వర్టర్ లేదా నాన్ ఇన్వర్టర్ ఏ మోడల్ బెస్ట్!
వేసవి వచ్చిందంటే చాలా మంది AC లేదా ఎయిర్ కూలర్‌లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా నమోదవుతున్న భారీ ఉష్ణోగ్రతల కారణంగా చల్లదనం కోసం AC లపై ఆధారపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ, నగరాల్లో అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏసీ (ఎయిర్ కండిషనర్) కొనుగోలు చేసే సమయంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఏసీ కొనుగోలు చేసే సమయంలో బ్రాండ్, స్టార్ రేటింగ్, సర్వీసింగ్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. దీంతోపాటు మీకు అవసరం అయిన సామర్థ్యం కలిగిన AC ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. గది విస్తీర్ణం ఆధారంగా 1 టన్ను లేదా 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన ఎయిర్ కండిషనర్‌ను ఎంచుకోవాలి.

దీంతోపాటు తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకొని, మెరుగైన పనితీరు కనబరిచే ఏసీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ కలిగిన ఏసీలను కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ బిల్లులు నియంత్రణలో ఉంటాయి. దీంతోపాటు ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలు కూడా విద్యుత్ బిల్లులు నియంత్రణలో ఉండేలా చేస్తాయి.
అయితే ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలు (Inverter Vs Non Inverter AC) అంటే ఏంటి..? వీటి మధ్య తేడాలు ఏంటి..? పనితీరులో ఎలాంటి ప్రభావం చూపుతుంది.
ఇన్వర్టర్ ఏసీలు అంటే చాలా మంది ఇంట్లోని ఇన్వర్టర్ ద్వారా కూడా ఈ AC లు పనిచేస్తాయనే భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. ఎయిర్ కండిషనర్‌లో ఇన్వర్టర్ మోడల్ అంటే ప్రత్యేకమైన టెక్నాలజీతో పనిచేసి, మెరుగైన పనితీరును అందిస్తుంది. ఏసీ ని కొనుగోలు చేసే సమయంలో ఈ రెండింటిలో తేడాలు తెలిస్తేనే, సరైన నిర్ణయం తీసుకోగలరు.
ఇన్వర్టర్ ఏసీ : ఇన్వర్టర్ ఏసీ (Inverter AC) అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. మరియు కంప్రెషర్ స్పీడ్‌ను రెగ్యులేట్ చేస్తుంది. గది చల్లగా మారిన తర్వాత, కంప్రెషర్ వేగం తగ్గుతుంది. పూర్తిగా ఆఫ్ కాకుండా తక్కువ వేగంతో కంప్రెషర్ పనిచేస్తుంది. ఫలితంగా నిరంతరం కూలింగ్‌ను అందిస్తుంది.
నాన్ ఇన్వర్టర్ ఏసీ : ఈ ఏసీ గదిని చల్లగా మార్చేందుకు (Non Inverter AC) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. గదిలో తగినంత చల్లదనం వచ్చాక.. కంప్రెషర్ ఆఫ్ అవుతుంది. గదిలో ఉష్ణోగ్రత పెరిగితే.. కంప్రెషర్ ఆన్ మళ్లీ అవుతుంది మరియు గదిలో చల్లదనం వచ్చేంత వరకు పనిచేస్తుంది. ఇలా ఆటోమేటిక్‌గా ఆన్, ఆఫ్ అవుతూ పనిచేస్తుంది.
ఇన్వర్టర్ ఏసీ కంప్రెషర్ తక్కువ వేగంతో నిరంతరం పనిచేస్తూ, అవసరం అయిన చల్లదనాన్ని అందిస్తుంది. ఫలితంగా విద్యుత్ బిల్లులు తక్కువగా వస్తాయి. మరియు మెరుగైన పనితీరును అందిస్తుంది. అదే నాన్ ఇన్వర్టర్ ఏసీ విషయానికి వస్తే.. నిరంతరం ఆన్ లేదా ఆఫ్ అవుతూ పనిచేస్తుంది. అంటే గదిలో తగినంత చల్లదనం ఉంటే కంప్రెషర్ ఆఫ్ అవుతుంది. గది వేడిగా ఉంటే మరోసారి ఆన్ అవుతుంది.
ఇలా తరచూ ఆన్ మరియు ఆఫ్ కావడం వల్ల ఎక్కువ విద్యుత్ ఛార్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. మరియు ఈ నాన్ ఇన్వర్టర్ ఏసీ కారణంగా గది ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు. తక్కువ విద్యుత్‌ను ఉపయోగించి, మెరుగైన పనితీరును పొందాలంటే ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications