iPhone 15 ప్రో మోడళ్లు వేడెక్కుతున్నాయా.. ఆపిల్ చెబుతున్న కారణాలు ఇవే?
ఆపిల్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూసిన iPhone 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు సెప్టెంబర్ 12న నిర్వహించిన వండర్‌లస్ట్ కార్యక్రమంలో విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుంచి డెలివరీలు ప్రారంభం అయ్యాయి. అయితే ఐఫోన్ 15 ప్రో మోడళ్లు వేడెక్కుతున్నాయని కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై ఆపిల్ సంస్థ స్పందించింది. ఈ సమస్యను గుర్తించామని, దానిపై పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
త్వరలో రానున్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఈ సమస్యకు చెక్‌పెడతామని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్, ఉబర్ వంటి కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లకు ఇటీవల వచ్చిన అప్‌డేట్‌ల సిస్టమ్‌ను ఓవర్‌లోడ్ చేసినట్లు ఆపిల్ తెలిపింది (Apple New Phones). ఫలితంగా సాధారణం కంటే ఫోన్లు వేడెక్కుతున్నాయని స్పష్టం చేసింది.

సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాంలు సహా ఆపిల్ కమ్యూనిటీ ఫోరంలో అనేక మంది ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్ల యూజర్లు.. తమ డివైస్‌లు వేడెక్కుతున్నాయని ఫిర్యాదు చేశారు. కొన్నిసార్లు 80 ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుతోందని, అలాంటి సందర్భాల్లో ఫోన్లు సరిగ్గా పట్టుకోలేకపోతున్నామని ఫిర్యాదు చేశారు.
ఆపిల్ కొత్తగా తీసుకొచ్చిన A17 బయోనిక్ ప్రాసెసర్ మరియు టైటానిక్ ఛాసిస్ ఇందుకు కారణమని భావిస్తున్నట్లు వినియోగదారులు చెప్పారు. అయితే ఈ సమస్యలపై డెవలపర్‌లతో కలిగి పనిచేస్తున్నట్లు ఆపిల్ పేర్కొంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లు వెడెక్కేందుకు టైటానియం ఫ్రేమ్, అల్యూమినియం సబ్‌స్ట్రక్టర్ కారణం కాదని ఆపిల్ సంస్థ స్పష్టం చేసింది.
MacRumors నివేదిక ప్రకారం ఐఫోన్ 15 ప్రో మోడళ్లు సాధారణం కంటే వేడెక్కేందుకు కారణమైన పరిస్థితులను గుర్తించినట్లు తెలిపింది. బ్యాక్‌గ్రౌండ్ యాక్టివీటి సహా iOS 17లో బగ్ కూడా ఇందుకు కారణమని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. దీంతోపాటు థర్డ్ పార్టీ యాప్‌లు కూడా కారణమని తెలిపింది. అప్‌డేట్ వెర్షన్‌తో ఈ సమస్య పరిష్కారం కానుందని చెప్పింది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఇప్పటికే 302 వెర్షన్‌ను విడుదల చేసింది.
* ఐఫోన్ 15 USB-C ఛార్జింగ్ పోర్టు అన్ని రకాల USB-C టైప్ పవర్ అడాప్టర్లను సపోర్టు చేయకపోవచ్చని ఓ నివేదిక అంచనా వేస్తోంది. ఇదే సమస్యను కొంత మంది వినియోగదారులు సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడిస్తున్నారు. అనేక సందర్భాల్లో పవర్ బ్యాంక్ ద్వారా ఐఫోన్ 15 ఫోన్లను ఛార్జింగ్ చేసేందుకు వీలుకావడం లేదని, అందుకు బదులుగా పవర్ బ్యాంక్‌లు ఛార్జింగ్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందుకు ఐఫోన్ 15లో ఉన్న రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కారణమని భావిస్తున్నారు. ఇతర ఆపిల్ పరికరాలైన వాచ్, ఎయిర్‌పాడ్స్‌లోను ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. చాలా పవర్ బ్యాంక్‌లతో ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఇదే సమస్య ఉత్పన్నం అవుతోందని ఓ వినియోగదారుడు తెలిపాడు.
ఐఫోన్ 15 ప్రో బేసి వేరియంట్ ధర రూ. 1,39,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్ రూ.1,59,900గా ఉంది. బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం రంగుల్లో గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్ చిప్ ఆధారంగా పనిచేస్తాయి.


Click it and Unblock the Notifications








