సాఫ్ట్‌వేర్ రంగం పూర్వ వైభవం అంచనాలు వేస్తున్న నిపుణులు

Posted By: Staff

సాఫ్ట్‌వేర్ రంగం పూర్వ వైభవం అంచనాలు వేస్తున్న నిపుణులు

ముంబై: సాఫ్ట్‌వేర్ రంగం గతవైభవం సాధించే దిశగా కదులుతోందా? మరోసారి టెక్నాలజీలో మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోందా..? ప్రస్తుతం పరిశ్రమ పనితీరును పరిశీలిస్తే, సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడినట్లే కనపడుతోందని, కొత్త రికార్డులు సాధించే దిశగా కదులుతోందని ఎనలిస్టులు అంటున్నారు. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో మాత్రమే పరిశ్రమ పనితీరు మసకబారింది. ఇది తప్పితే గత సంవత్సరమంతా ఐటి రంగం పనితీరు బాగానే ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

ఈ జోరును పరిగణనలోకి తీసుకుంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐటి రంగం అదరగొట్టడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. సాధారణంగా చివరి త్రైమాసికంలో టెక్నాలజీ వ్యయాన్ని తగ్గించుకునే కంపెనీలు కొత్త సంవత్సరంలో బడ్జెట్ల ప్రణాళికలను సిద్ధం చేసుకోవడంలో మునిగిపోతాయి. అందుకే మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీల పనితీరు ఓమాదిరిగానే ఉంటుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మాత్రం మినహాయింపు ఉంటుందని, ఈ కంపెనీ ఒక్కటే లాభాల జోరును నిలబెట్టుకుంటుందని వారు చెబుతున్నారు.

జపాన్ ప్రభావం కూడా కాస్త ఈ సంవత్సరం సాప్ట్ వేర్ రంగంపై పడింది. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు జపనీస్ మార్కెట్‌లో ఎక్స్‌పోజర్ ఎక్కువ. ఈ మధ్యకాలంలో జపాన్ భూకంపం, సునామీ విపత్తులతో అతలాకుతలమైంది. ఈ కారణంగా హెచ్‌సిఎల్ లాభాల జోరుకు బ్రేకులు పడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అంటోంది. ఒకటి రెండు త్రైమాసికాల పాటు విప్రో పనితీరు మెరుగుపడకపోవచ్చని అంచనా వేసింది.

చివరి త్రైమాసికంలో వాల్యూమ్‌ల వృద్ధిరేటు 4.1-5.2 శాతానికి పరిమితమవుతుందని, ఇబిఐటి మార్జిన్లలో మెరుగైన పనితీరు నమోదు కావచ్చని చెబుతోంది. ఇదిలా ఉండగా, ఐటి కంపెనీల టర్నోవర్ మెరుగ్గానే ఉంటుందని ఎడెల్‌వీస్ క్యాపిటల్ అభిప్రాయపడింది. రూపాయి విలువ ఒక శాతం వరకూ తగ్గడం సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వరంగా మారిందని, ఈ త్రైమాసికంలో లాభాలు పెరగవచ్చని అంచనా వేసింది. ఈ నెల 15న ఇన్ఫోసిస్ ఫలితాలు వెలువడనున్నాయి. ఉద్యోగుల వలసల రేటు పెరగడం, గ్లోబల్ ఎకానమీల్లో అనిశ్చిత పరిస్థితులు, కరెన్సీ రేట్లలో హెచ్చుతగ్గుల ప్రభావం టిసిఎస్, ఇన్ఫోసిస్‌లపై ఉంటుందని అంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot