నీలి రంగులో మెరుస్తున్న భూమి,చంద్రయాన్ 2 పంపిన ఫోటోలు చూశారా ?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల చంద్రయాన్-2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు ప్రయోగాలు చేపట్టేందుకు వీలుగా ఇందులో ల్యాండర్, రోవర్, ఆర్బిటర్ లను ఇస్రో పంపింది. ప్రస్తుతం భూమి చుట్టూ కక్ష్యను పెంచుకుంటూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్-2 వాహక నౌక ఆగస్టు 14న భూ కక్ష్యను దాటి చంద్రుడివైపు దూసుకుపోనుంది.

ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఈరోజు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. 'ఆగస్టు 3 సాయంత్రం 5.34 గంటల ప్రాంతంలో చంద్రయాన్-2 ఎల్ ఐ14 తీసిన ఫోటోల్లో భూమి ఇలా కనిపిస్తుంది’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ఫొటోల్లో భూమి నీలం రంగులో మెరిసిపోతోంది. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో చూడండి.

కక్ష్య దూరాన్ని పెంచిన శాస్త్రవేత్తలు
చంద్రయాన్-2 మిషన్‌కు సంబంధించి ఆర్బిటర్‌లోని ఇంధనాన్ని శాస్త్రవేత్తలు 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. చంద్రయాన్-2 మిషన్ విజయవంతంగా ప్రయాణి స్తోందని ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా వెల్లడించారు

మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా
బెంగళూరు సమీపంలో బైలాలులో ఉన్న భూ నియంత్రిత కేంద్రం నుంచి చంద్రయాన్-2 ఉప్రగహంలోని ఆర్బిటర్‌లో నింపిన ఇంధన సాయంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను నాలుగోసారి కూడా విజయవంతంగా నిర్వహించారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్3-ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్ల ఎత్తులో భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఇలా పెంచారు
కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా జులై 24న తొలిసారి భూమికి దగ్గరగా ఉన్న 170 కిలోమీటర్ల ఎత్తును 230 కిలోమీటర్లకు, 26న రెండోసారి భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లుగా ఉన్న కక్ష్య దూరాన్ని 54,829 కిలోమీటర్లకు, జులై 29న మూడోసారి భూమికి దగ్గర్లో ఉన్న 230 కిలోమీటర్ల దూరాన్ని 270 కిలోమీటర్లకు, దూరంగా ఉన్న 54,829 కిలోమీటర్ల దూరాన్ని 71,792 కిలోమీటర్లకు ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పెంచిన విషయం తెలిసిందే.

చంద్రుడి కక్ష్యలోకి
నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని 277 కి.మీ, భూమికి దూరంగా ఉన్న 71,792 కి.మీ దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఆగస్టు 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచారు. తర్వాత ఆగస్టు 14న చివరిగా చంద్రయాన్-2 మిషన్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టనున్నారు.

చంద్రయాన్ అద్భుతంగా పనిచేస్తోంది
చంద్రయాన్ అంతరిక్షంలో ప్రయోగించిన తరువాత తీసిన తొలి ఫొటోలు ఇవే. ఇంతకుముందు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ.. అవి నకిలీవని తేలిపోయింది. భూ ఉపరితలానికి అయిదువేల కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రయన్ 2 ఈ ఫొటోలను తీసింది. అమెరికా ఉపఖండం, పసిఫిక్ మహాసముద్రం ఈ పిక్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫొటోల్లో ఎలాంటి లోపాలు లేవని, దీన్ని బట్టి చంద్రయాన్ అద్భుతంగా పనిచేస్తోందనే విషయాన్ని నిర్ధారించవచ్చని కె శివన్ తెలిపారు.


Click it and Unblock the Notifications








