chandrayaan-3 చరిత్ర సృష్టించిన భారత్.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా రికార్డు
అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. దీంతో ఇస్రో సహా యావత్ భారతావని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అపూర్వ క్షణాల కోసం వేచిచూసిన కనులు.. ఆనంద భాష్పాలతో నిండిపోయాయి.
ఏపీలోని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు 140 కోట్ల మంది ఆశలను జాబిల్లిపైకి తీసుకెళ్లిన చంద్రయాన్-3.. విజయవంతంగా చంద్రుడి ఉపరితలాన్ని తాకింది. ఈ సాయంత్రం 5:44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. కీలకమైన నాలుగు దశలను దాటి 6:03 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంలో అడుగు పెట్టింది. దీంతో ఇస్రో కేంద్రం సహా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా దేశాలు మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. కానీ చంద్రుడి దక్షిణ ధ్రువానికి ఏ దేశమూ చేరుకోలేకపోయింది. ఇటీవలే రష్యాకు చెందిన లూనా -25 చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నం చేసినా.. ఆఖరి సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తి, చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది.
అయితే చంద్రయాన్-3 ద్వారా భారత్.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఫలితంగా ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. మరియు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించింది. భారత అంతరిక్ష చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం.

విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ జరిగిన నాలుగు గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్‌లోని ప్రగ్యాన్ రోవర్ బయటకు రానుంది. చంద్రుడి ఉపరితలంపైకి వచ్చి పరిశోధనలు ప్రారంభించనుంది. 14 రోజుల పాటు (లూనార్ పగలు) చంద్రుడి ఉపరితలంలో వివిధ రకాల కీలక పరిశోధనలు చేయనుంది.
చంద్రయాన్-2 వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో చంద్రయాన్-3లో కీలక మార్పులు చేసింది. కచ్చితత్వంతో పనిచేసేలా కెమెరాలు, సెన్సార్లను అమర్చించింది. దీంతో ఎటువంటి అసాధారణ పరిస్థితులు తలెత్తినా సాఫ్ట్ ల్యాండింగ్ చేసే విధంగా రూపొందించింది. ఒకటి విఫలం అయినా మరొకటి పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంది.

2008 నుంచి చంద్రునిపై ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. అప్పట్లో చంద్రయాన్-1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిపై నీటి ఉనికి తొలిసారిగా కనుగొంది. అనంతరం 2019 జులై 22న ఇస్రో చంద్రయాన్-2ను ప్రయోగించింది. ఇందులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండింగ్ చేయాలన్నది ఇస్రో ఆలోచన.
అయితే చివరి వరకు అంతా సవ్యంగా జరిగినా.. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలానికి కేవలం 2 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్ ల్యాండర్‌లో సమస్య తలెత్తింది. ల్యాండంగ్ అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది. అయితే చంద్రయాన్-2 నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. జూలై 14న చంద్రయాన్-3ను ప్రయోగించింది. ఎట్టకేలకు విజయం సాధించింది.
అంతరిక్ష యాత్రలో చరిత్ర సృష్టించిన ఇస్రోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. శాస్త్రవేత్తలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇస్రోకు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications








