ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఐటీ కంపెనీలు

Posted By: Staff

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఐటీ కంపెనీలు

రాష్ట్రంలో ఆకర్షణీయమైన ప్యాకేజీలతో కూడిన ఉద్యోగ అవకాశాలను ఎరగా వేసి నిరుద్యోగ యువత జీవితాలతో ఐటీ కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రజలు ప్రొడిజీ వ్యవహారం మరవకముందే.. హైదరాబాద్‌ కేంద్రంగా మరో ఐటీ కంపెనీ ట్యాంగోస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ కోట్లు దండుకుని నిరుద్యోగ యువత నెత్తిన కుచ్చుటోపి పెట్టింది. డిపాజిట్లు, అడ్వాన్సులు ఇతరత్రా పేర్లతో నిరుద్యోగ యువత జేబులను ఐటీ కంపెనీలు కొల్లగొడుతున్నాయి.వీటిని నివారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మోసాలకు పాల్పడిన ఐటీ కంపెనీలపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

మోసాలకు పాల్పడే ఐటీ కంపెనీల పక్కా ప్రణాళికలతో తమ కంపెనీలను ప్రారంభిస్తున్నాయి. అంతేకాకుండా...రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించి.. తమ ఐటీ కంపెనీలు ప్రారంభిస్తున్నాయి. తద్వా రా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతను ఆకర్షించి అనంతరం వారి తెరవెనుక వ్యూహానికి పదునుపెట్టడం విశేషం.

ఇటీవల విశాఖ, వరంగల్‌, హైదరాద్‌ కేంద్రాలుగా ప్రొడిజీ ఐటీ శిక్షణ సంస్థ వ్యవహారంలో ఒక సీనియర్‌ మంత్రి, ఆయన పుత్ర రత్నం పేరును సదరు కంపెనీ బిజినెస్‌ ప్రమోషన్‌ కోసం వినియోగించుకున్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు కూడా భగ్గుమన్నా యి. తీరా.. ఆ కంపెనీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించడంలో భాగంగానే తాను ఆకంపెనీ ప్రారంభోత్సవానికి హాజరైనట్లు రాష్ట్ర ఐటీ, సేవల మంత్రి పొన్నాల సీఎంకు వివరించినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తే.. వాస్తవ విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలుస్తాయని మంత్రి పొన్నాల సీఎంను కోరినట్లు తెలిసింది.

రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటు, శిక్షణ, ఉపాధి తదితర అంశాలపై ఐటీ శాఖ నియంత్రణ అంతగా లేకపోవడంతో రోజురోజుకి ఐటీ కంపెనీల అగడాలు పెచ్చుమీరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి.. ఐటీ కంపెనీల అక్రమాలు, ఆగడాలు నియంత్రించే విధంగా నూతన ఐటీ చట్టానికి పెదును పెడితేనే ఇది సాధ్యమని అధికారులు చెబుతున్నారు. సమర్థ ఐటీ మంత్రిగా పేరుగాంచిన.. పొన్నాల రాష్ట్రంలోని ఐటీ కంపెనీల ఆగడాలు, అరాచకాలకు అడ్డకట్టవేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువలా దూసుకువస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పిస్తామని పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఐటీ కంపెనీల చేతుల్లో దగాపడిన నిరుద్యోగ యువత తమ డబ్బులు తమకు ఇప్పించాలని, వీటితో కనీసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటామని బాధిత యువత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot