మార్కెట్లోకి 20 కొత్త మోడళ్లు దిగనున్న కార్బన్ మొబైల్స్

Posted By: Super

మార్కెట్లోకి 20 కొత్త మోడళ్లు దిగనున్న కార్బన్ మొబైల్స్

మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ కార్బన్ మొబైల్స్ త్వరలో అధునాతన ఫోన్లను మార్కెట్లోకి తేనుంది. ఇప్పటికే రూ.1,290-6,990 ధరల శ్రేణిలో 35 మోడళ్లను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది 20 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్టు కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ తెలిపారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక విక్రయ కేంద్రాలను నెలకొల్పనున్నాం. ఎంపిక చేసిన కేంద్రాల్లో అప్లికేషన్ స్టోర్లను కూడా ప్రారంభిస్తాం. వివిధ అప్లికేషన్లతోపాటు మొబైల్ బ్యాంకింగ్ సొల్యూషన్‌ను సొంతంగా అభివృద్ధి చేస్తున్నాం.

ఈ ఏడాది జూలైకల్లా ట్యాబ్లెట్ పీసీ మార్కెట్లోకి రానుంది. 7, 9, 10 అంగుళాల సైజులో ఇవి ఉంటాయి. బేసిక్ మోడల్ ధర రూ.10,000 లోపు ఉంటుంది. ఆన్‌డ్రాయిడ్, 3జీ ఫోన్లను కూడా విడుదల చేస్తాం. మూడు నెలల పాటు ఫీల్డ్ ట్రయల్స్ చేసిన అనంతరం అన్ని ప్రమాణాలను చేరుకున్న మోడళ్లనే మార్కెట్లో విడుదల చేస్తున్నాం. అగ్రస్థానం దిశగా.. ఐదేళ్ల క్రితం వరకు దేశంలో మొబైల్ ఫోన్ల మార్కెట్లో విదేశీ కంపెనీలదే హవా. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. నెలకు 1.5 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడవుతుండగా, ఇందులో 40 శాతం వాటా భారతీయ కంపెనీలదే. భారతీయ మొబైల్ కంపెనీలకు విదేశాల్లో కూడా క్రేజ్ పెరుగుతోంది. దేశీయ మొబైల్ తయారీ కంపెనీల విభాగంలో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఈ విభాగంలో 2012 మార్చి నాటికి దేశంలో అగ్రస్థానానికి చేరుకుంటాం.

2012 ఏప్రిల్‌కల్లా ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటకలో రూ.80 కోట్ల వ్యయంతో మొబైల్స్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని భావిస్తున్నాం. యూనిట్లో నెలకు 5 లక్షల సెల్‌ఫోన్లను తయారు చేస్తాం. బెంగళూరులోని డిజైన్ హౌజ్, టెస్టింగ్ ఫెసిలిటీతోపాటు బ్రాండింగ్‌కు రూ.370 కోట్లను ఖర్చు చేయనున్నాం. మూడు నెలల్లో కెన్యాలో, డిసెంబరునాటికి బ్రెజిల్, లాటిన్ అమెరికా దేశాలకు విస్తరిస్తాం. విస్తరణకు కావాల్సిన నిధుల కోసం యునెటైడ్ టెలీలింక్స్‌లో (కార్బన్ ప్రమోటర్ కంపెనీ) 10 నుంచి 15 శాతం వాటా విక్రయించనున్నాం. సరైన డీల్ కోసం ఎదురుచూస్తున్నాం. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కంపెనీలు కార్బన్ మొబైల్స్ మార్కెట్ విలువను రూ.2,800 కోట్లుగా అంచనా వేశాయి.

కే9 పేరుతో కొత్త మోడల్‌ను మంగళవారం విడుదల చేశాం. 2.4 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, 1.3 మెగాపిక్సెల్ కెమెరా, 30 రోజుల బ్యాటరీ, 16 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ దీని విశిష్టతలు. ధర రూ.1,999గా నిర్ణయించాం. అన్ని మోడళ్లను కలిపి 2011-12లో 80 లక్షల మొబైల్స్ విక్రయించాలని, 15 లక్షల ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,180 కోట్ల టర్నోవర్ నమోదైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot