ఇన్ఫోసిస్ పగ్గాలు కె.వి.కామత్‌కు: గౌరవ చైర్మన్‌గా నారాయణమూర్తి

Posted By: Staff

ఇన్ఫోసిస్ పగ్గాలు కె.వి.కామత్‌కు: గౌరవ చైర్మన్‌గా నారాయణమూర్తి

బెంగళూరు: ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌లో ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్‌ స్వరూపాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రధాన శిల్పి ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి స్థానంలో అనుభవజ్ఞుడైన బ్యాంకర్‌ కె.వి.కామత్‌ను కొత్త ఛైర్మన్‌గా నియమించారు. నారాయణ మూర్తి ఆగస్టులో పదవీవిరమణ చేయనున్నారు. ఆయనకు గౌరవ ఛైర్మన్‌ హోదాను ఇచ్చారు. మూర్తి జీవిత కాలం ఈ హోదాలో కొనసాగుతారు. కంపెనీ మరో సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం సీఈఓగా ఉన్న క్రిస్‌ గోపాలకృష్ణన్‌ను కార్యనిర్వాహక సహ ఛైర్మన్‌గాను, ఇంకో సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం సీఓఓగా ఉన్న ఎస్‌.దినేశ్‌ శిబులాల్‌ను కొత్త సీఈఓ, ఎండీగాను నియమించారు. ఆగస్టు 21 నుంచి ఈ నియామకాలు అమలులోకి వస్తాయి.

శనివారం బెంగళూరులో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నియామకాలను ఆమోదించినట్లు మూర్తి విలేకరులకు వెల్లడించారు. కంపెనీ పేరును ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌గా మార్చాలన్న ప్రతిపాదనను కూడా బోర్డు ఆమోదించింది. సరికొత్త నియామకాలకు జూన్‌ 11న జరగనున్న వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ వాటాదారుల సమ్మతిని కోరతారు. ఆ లోపే కంపెనీలో ముగ్గురు కొత్త డైరెక్టర్లను నియమించనున్నారు. కామత్‌ వయస్సు ప్రస్తుతం 63 సంవత్సరాలు. 2009 మే నుంచి ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉంటున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ విజయ పథంలో పయనించడంలో చోదక శక్తిగా కామత్‌ పనిచేశారు. కొత్త బాధ్యతను వినమ్రతాపూర్వకంగా అంగీకరిస్తున్నట్టు కామత్ చెప్పారు. అంతేకాదు ఎవరైనా ఇన్ఫోసిస్ చైర్మన్‌గా చేయవచ్చు కానీ నారాయణమూర్తి బదులు ఆయన స్థానాన్ని భర్తీ చేయజాలరు అని అన్నారు.

సిఇవోగా నియమించబడ్డ శిబులాల్‌కు 56 ఏళ్లు వయస్సు. టీసీఎస్‌ కన్నా పైచేయిని సాధించడం ఆయన ముందున్న సవాలు. మా మార్కెట్‌ స్థాయిని పటిష్టం చేసుకోవడానికే కాకుండా ఖాతాదారులకు మరింత దీక్షాదక్షతలతో సేవలు అందించడానికి తోడ్పడేలా మరికొన్ని సంస్థాగతమైన మార్పులను తీసుకువస్తున్నానని శిబులాల్‌ చెప్పారు. కామత్‌, క్రిస్‌, శిబులు ఆదర్శవంతమైన జట్టు. వీరి నియామకాల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నన్ను చైర్మన్‌ ఎమెరిటస్‌గా నియమించి, బోర్డుకు విలువ జోడించే అవకాశాన్ని ప్రసాదించినందుకు కంపెనీకి కృతజ్ఞుణ్ని అని నారాయణమూర్తి ప్రతిస్పందించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting